Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేసన్ హోల్డర్‌కు మూడు వికెట్లు
- పంజాబ్ కింగ్స్ 125/7
నవతెలంగాణ-షార్జా
పొట్టి బౌండరీల షార్జాలో విచిత్రంగా స్వల్ప స్కోర్లు నమోదవుతున్నాయి!. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించటంతో పంజాబ్ కింగ్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 127/7 పరుగులే చేసింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు కెఎల్ రాహుల్ (21), మయాంక్ అగర్వాల్ (5) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించగా.. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ నిలబడలేదు. ఎడెన్ మార్కరం (27, 32 బంతుల్లో 2 ఫోర్లు), హర్‌ప్రీత్ బరార్ (18 నాటౌట్, 18 బంతుల్లో 1 ఫోర్) మెరవటంతో పంజాబ్ కింగ్స్ గౌరవప్రద స్కోరు చేయగల్గింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ (3/19) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు.
పంజాబ్ విలవిల : పంజాబ్ టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉండటంతో షార్జాలో ఆ జట్టు భారీ స్కోరుపై కన్నేసింది. రాయల్స్ చేతిలో అనూహ్య ఓటమి చెందిన పంజాబ్.. హైదరాబాద్‌పై విజయంతో ఊరట చెందాలని అనుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లు మెరువటంతో పంజాబ్ కింగ్స్ బ్యాట్‌తో తేలిపోయింది. కెఎల్ రాహుల్ (21, 21 బంతుల్లో 3 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (5), క్రిస్ గేల్ (14, 17 బంతుల్లో 1 ఫోర్)లు విఫలమయ్యారు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి పంజాబ్ 29/2తో కష్టాల్లో పడింది. మిడిల్ ఆర్డర్లో ఎడెన్ మార్కరం (27) సులువైన క్యాచ్‌ను వార్నర్ వదిలేయటంతో అతడు కాసిన్ని పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ (8), దీపక్ హుడా (13) నిరాశపరిచారు. ఆఖర్లో హర్‌ప్రీత్ బరార్ (18), నాథన్ ఎల్లిస్ (12) బ్యాట్ ఝులిపించటంతో పంజాబ్ 125 పరుగులైనా చేయగల్గింది. ఏ దశలో హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడి చేసేందుకు సాహసించని పంజాబ్ అందుకు తగిన స్కోరే పొందింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్‌లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
ఐపీఎల్లో నేడు
చెన్నై x కోల్‌కత
వేదిక : అబుదాబి, సమయం : మ: 3.30
బెంగళూర్ x ముంబయి
వేదిక : దుబారు, సమయం : రాత్రి: 7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..