Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్‌పై 33 పరుగులతో విజయం
- ప్లేఆఫ్స్‌లో క్యాపిటల్స్ చోటు ఖాయం!
- ఛేదనలో సంజు అర్థ శతకం వృథా
ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ లేపింది. సీజన్లో ఎనిమిదో విజయంతో దాదాపుగా ప్లే ఆఫ్స్‌లో బెర్త్ ఖాయం చేసుకుంది. 16 పాయింట్లు సాధించిన జట్టు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరని రికార్డు లేదు. అనధికారంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌లో తొలి బెర్త్ సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌పై 33 పరుగుల తేడాతో అలవోక విజయం నమోదు చేసిన క్యాపిటల్స్.. పాయింట్ల పట్టికలో టాప్ లేపింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ను వెనక్కి నెడుతూ అగ్రస్థానంలో నిలిచింది.
నవతెలంగాణ-అబుదాబి
ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం. రాజస్థాన్ రాయల్స్‌పై రిషబ్‌పంత్ సేన 33 పరుగుల తేడాతో గెలుపొందింది. 155 పరుగుల ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 121/6 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ సంజు శాంసన్ (70 నాటౌట్, 53 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో రాణించినా.. ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. లియాం లివింగ్‌స్టోన్ (1), యశస్వి జైస్వాల్ (5), డెవిడ్ మిల్లర్ (5), రియాన్ పరాగ్ (2), మహిపాల్ (19), రాహుల్ తెవాటియ (9) వైఫల్యం రాజస్థాన్‌ను ఓటమి బాటలో నడిపించింది. అంతకముందు శ్రేయాస్ అయ్యర్ (43, 32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించటంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 154/6 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (24), షిమ్రోన్ హెట్మయర్ (28) రాణించారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఎనిమిదో విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయాస్ అయ్యర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
సంజు మెరిసినా..! : రాజస్థాన్ రాయల్స్ లక్ష్యం 155 పరుగులు. బిగ్ హిట్టర్లతో కూడిన రాయల్స్‌కు ఇది పెద్ద విషయం కాదు. ఆరంభంలోనే వరుస బంతుల్లో ఓపెనర్లను కోల్పోవటం రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది. అవేశ్ ఖాన్ బంతికి లివింగ్‌స్టోన్ (1), నోర్జ్టె బంతికి జైస్వాల్ (5) వికెట్ కోల్పోయారు. 6/2తో రాయల్స్ ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో కెప్టెన్ సంజు శాంసన్ (70 నాటౌట్)కు సహకారం లభించలేదు. డెవిడ్ మిల్లర్ (7), రియాన్ పరాగ్ (2), రాహుల్ తెవాటియ (9)లు విఫలమయ్యారు. మహిపాల్ (19, 24 బంతుల్లో 1 సిక్స్) కాసేపు క్రీజులో నిలిచినా.. వికెట్ కాపాడుకోలేదు. 53 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన సంజు అజేయంగా 70 పరుగులు చేశాడు. సంజు శాంసన్ క్రీజులో నిలిచినా.. రాయల్స్ గెలుపు ఆశలు ఎప్పుడో కోల్పోయింది. చివరి ఓవర్లలో సాధించాల్సిన రన్‌రేట్ ఆకాశాన్నంటింది. 33 పరుగుల తేడాతో క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఎన్రిచ్ నోర్జ్టె (2/18), అవేశ్ ఖాన్ (1/29), అశ్విన్ (1/20), అక్షర్ పటేల్ (1/27) గొప్పగా రాణించారు.
అయ్యర్ ఒక్కడే : టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు పృథ్వీ షా (10), శిఖర్ ధావన్ (8)లు పవర్‌ప్లేలోనే డగౌట్‌కు చేరుకున్నారు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ (43), కెప్టెన్ రిషబ్ పంత్ (24)లు మూడో వికెట్‌కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయ్యర్ ఓ ఫోర్, సిక్సర్‌తో కదం తొక్కగా.. పంత్ రెండు బౌండరీలతో మెరిశాడు. పంత్ నిష్క్రమించినా.. షిమ్రోన్ హెట్మయర్ (28, 16 బంతుల్లో 5 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో క్యాపిటల్స్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. లలిత్ యాదవ్ (14 నాటౌట్), అశ్విన్ (6 నాటౌట్) అజేయంగా నిలిచారు. రాయల్స్ బౌలర్లు ముస్తాఫిజుర్ రెహమాన్ (2/22), చేతన్ సకరియ (2/33) రాణించటంతో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 154/6 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు :
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా (సి) లివింగ్‌స్టోన్ (బి) సకారియ 10, శిఖర్ ధావన్ (బి) కార్తీక్ త్యాగి 8, శ్రేయాస్ అయ్యర్ (స్టంప్డ్) సంజు (బి) తెవాటియ 43, రిషబ్ పంత్ (బి) ముస్తాఫిజుర్ 24, హెట్మయర్ (సి) సకారియ (బి) ముస్తాఫిజుర్ 28, లలిత్ యాదవ్ నాటౌట్ 14, అక్షర్ పటేల్ (సి) మిల్లర్ (బి) సకారియ 12, అశ్విన్ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 09, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154.
వికెట్ల పతనం : 1-18, 2-21, 3-83, 4-90, 5-121, 6-142.
బౌలింగ్ : ముస్తాఫిజుర్ రెహమాన్ 4-0-22-2, మహిపాల్ 1-0-5-0, చేతన్ సకారియ 4-0-33-1, కార్తీక్ త్యాగి 4-0-40-1, షంషి 4-0-34-0, రాహుల్ తెవాటియ 3-0-17-1.
రాజస్థాన్ రాయల్స్ : లివింగ్‌స్టోన్ (సి) పంత్ (బి) అవేశ్ ఖాన్ 1, యశస్వి జైస్వాల్ (సి) పంత్ (బి) నోర్ట్జె 5, సంజు శాంసన్ నాటౌట్ 70, డెవిడ్ మిల్లర్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 7, మహిపాల్ (సి) అవేశ్ ఖాన్ (బి) రబాడ 19, రియాన్ పరాగ్ (బి) అక్షర్ పటేల్ 2, రాహుల్ తెవాటియ (సి) హెట్మయర్ (బి) నోర్ట్జె 2, షంషి నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 121.
వికెట్ల పతనం : 1-6, 2-6, 3-17, 4-48, 5-55, 6-99.
బౌలింగ్ : అవేశ్ ఖాన్ 4-0-29-1, ఎన్రిచ్ నోర్జ్టె 4-0-18-2, అశ్విన్ 4-0-20-1, రబాడ 4-0-26-1, అక్షర్ పటేల్ 4-0-27-1.
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక
జట్టు మ్యా వి ఓ పా
1 ఢిల్లీ 10 08 02 16
2 చెన్నై 09 07 02 14
3 బెంగళూర్ 09 05 04 10
4 కోల్‌కత 09 04 05 08
5 ముంబయి 09 04 05 08
6 రాజస్థాన్ 09 04 05 08
7 పంజాబ్ 09 03 06 06
8 హైదరాబాద్ 08 01 07 02