Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కతపై సూపర్ విజయం
- యుఏఈలో వరుసగా మూడో గెలుపు
నవతెలంగాణ-దుబాయ్
చెన్నై సూపర్‌కింగ్స్ హ్యాట్రిక్ కొట్టింది. ఐపీఎల్14లో యుఏఈ గడ్డపై వరుసగా మూడో విజయం నమోదు చేసింది. తొలుత ముంబయి, బెంగళూర్లను ఓడించిన చెన్నై.. ఆదివారం కోల్‌కత నైట్‌రైడర్స్‌పై సవారీ చేసింది. ఆఖరు బంతి ఉత్కంఠకు దారితీసిన ఈ థ్రిల్లర్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. 172 పరుగుల ఛేదనలో ఓపెనర్లు డుప్లెసిస్ (43, 30 బంతుల్లో 7 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (40, 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి విజయానికి గట్టి పునాది వేశారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (22, 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ధనాధన్ విశ్వరూపం చూపించాడు. ఆఖరు ఓవర్లో శామ్ కరణ్ (4), జడేజా నిష్క్రమణతో ఉత్కంఠ రేగినా.. దీపక్ చాహర్ (1 నాటౌట్) చివరి బంతికి సింగిల్ తీసి చెన్నైకి విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 171/6 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (45), దినేశ్ కార్తీక్ (26), అండ్రీ రసెల్ (20), నితీశ్ రానా (37) రాణించారు.
సూపర్ థ్రిల్లర్ : ఛేదనలో చెన్నై చెలరేగింది. ఓపెనర్లు గైక్వాడ్, డుప్లెసిస్ కోల్‌కత బౌలర్లను చితకబాదారు. ఈ ఇద్దరికి మోయిన్ అలీ (32) తోడవటంతో చెన్నై వేగంగా పరుగులు పిండుకుంది. అంబటి రాయుడు (10), సురేశ్ రైనా (11), ఎం.ఎస్ ధోని (1) నిష్క్రమణతో కోల్‌కత మ్యాచ్ రేసులోకి వచ్చింది. చివరి రెండు ఓవర్లలో 26 పరుగులు చేయాల్సిన దశలో ప్రసిద్ కృష్ణపై జడేజా దండయాత్ర చేశాడు. తొలి రెండు బంతులకు సింగిల్స్ రాగా.. తర్వాత వరుసగా 6, 6, 4, 4తో జడేజా ధనాధన్ అనిపించాడు. ఆ ఓవర్లో 22 పరుగులు రాబట్టిన జడేజా ఆఖరు ఓవర్‌ను నామమాత్రం చేశాడు. చివరి ఓవర్లో సునీల్ నరైన్ మ్యాజిక్‌తో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. తొలి బంతికి కరణ్‌ను అవుట్ చేసిన నరైన్.. జడేజాను సైతం సాగనంపాడు. ఆఖరు బంతికి ఒక్క పరుగు కావాల్సిన పరిస్థితుల్లో కొత్త బ్యాటర్ దీపక్ చాహర్ (1 నాటౌట్)పై ఒత్తిడి కనిపించినా.. అతడు నరైన్‌ను అలవోకగా ఎదుర్కొన్నాడు. సూపర్‌కింగ్స్‌కు 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. సీజన్లో 8వ విజయంతో చెన్నై సూపర్‌కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. యుఏఈలో జరిగిన గత సీజన్ చివర్లో వరుసగా మూడు విజయాలు సాధించిన చెన్నై.. తాజాగా మూడు విజయాలతో ఇక్కడ విజయాల పరంపర కొనసాగిస్తోంది.
స్కోరు వివరాలు :
కోల్‌కత నైట్‌రైడర్స్ : 171/6 (రాహుల్ త్రిపాఠి 45, నితీశ్ రానా 37, దినేశ్ కార్తీక్ 26, శార్దుల్ ఠాకూర్ 2/20)
చెన్నై సూపర్‌కింగ్స్ : 172/8 (డుప్లెసిస్ 43, రుతురాజ్ 40, రవీంద్ర జడేజా 22, సునీల్ నరైన్ 3/41)