Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ క్రికెటర్ మోయిన్ అలీ నిర్ణయం
దుబాయ్ : ఇంగ్లాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్లో 3000 పరుగులు, 200 వికెట్లు కూల్చిన ఘనత సాధించిన 15వ ఆల్‌రౌండర్‌గా నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్న మోయిన్ అలీ.. తాజాగా ఐదు రోజుల ఫార్మాట్‌కు దూరమవుతున్నట్టు ప్రకటించాడు. వైట్ బాల్ ఫార్మాట్లో కెరీర్ పొడగింపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. 34 ఏండ్ల మోయిన్ అలీ ఇంగ్లాండ్‌కు 64 టెస్టుల్లో 28.29 సగటుతో 2914 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు ఉన్నాయి. ఆఫ్ స్పిన్ మ్యాజిక్‌తో 195 వికెట్లు పడగొట్టాడు. ' ఇప్పుడు నా వయసు 34. సాధ్యమైనంత ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా. మనదైన రోజున టెస్టు క్రికెట్‌కు మించిన ఫార్మాట్ లేదు. టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించాను. రెడ్ బాల్లో నా పోరు ముగిసిందని అనుకుంటున్నాను. టెస్టుల్లో నా ప్రదర్శనకు గర్వపడుతున్నాను. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను' అని మోయిన్ అలీ పేర్కొన్నాడు. కెప్టెన్ జో రూట్, కోచ్ సిల్వర్వుడ్లకు మోయిన్ తన నిర్ణయాన్ని వెల్లడించిన అనంతరం మీడియాకు ప్రకటన చేశాడు.