Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాపిటల్స్‌తో నైట్‌రైడర్స్ ఢ నేడు
- ముంబయి, పంజాబ్ పోరూ నేడే
నవతెలంగాణ-షార్జా
ప్లే ఆఫ్స్‌లో టాప్-2లో నిలిచేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సన్నద్ధమవుతుండగా.. ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు నిలుపుకునేందుకు కోల్‌కత నైట్‌రైడర్స్ నేడు బరిలోకి దిగుతోంది. 8 విజయాలతో 16 పాయింట్లు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌లో చోటు లాంఛనం చేసుకుంది. చివరి నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు ఆ జట్టుకు టాప్-2లో స్థానం ఖాయం చేయగలదు. పది మ్యాచుల్లో నాలుగు విజయాలే సాధించిన కోల్‌కత నైట్‌రైడర్స్.. మరో మూడు జట్లు రాజస్థాన్, పంజాబ్, ముంబయిలతో కలిసి సమవుజ్జీగా కొనసాగుతోంది. నేడు క్యాపిటల్స్‌పై విజయం కోల్‌కతను ప్లే ఆఫ్స్ రేసుకు దగ్గర చేయనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత నైట్‌రైడర్స్ షార్జాలో నేడు మధ్యాహ్నాం 3.30 గంటలకు ఢ కొట్టనున్నాయి.
చెన్నై చేతిలో ఓటమితో ఒత్తిడిలో పడిన కోల్‌కత నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ అండ్రీ రసెల్ సేవలను కోల్పోనుంది. గాయంతో రసెల్ నేటి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. రసెల్ స్థానంలో ఆసీస్ ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్ లేదా బంగ్లా స్టార్ షకిబ్ అల్ హసన్ తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది. షార్జా పిచ్ నెమ్మదిగా స్పందిస్తున్న నేపథ్యంలో షకిబ్ అల్ హసన్‌కు అధిక అవకాశాలు ఉన్నాయి. సునీల్ నరైన్‌ను పించ్ హిట్టర్‌గా మళ్లీ ప్రయోగించే అవకాశం లేకపోలేదు. టాప్ ఆర్డర్లో యువ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్‌కు తోడు నిలకడగా మరో బ్యాటర్ ఆడటం లేదు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నుంచి జట్టు మేనేజ్మెంట్ బాధ్యతాయుత ప్రదర్శన ఆశిస్తోంది. కీలక మ్యాచుల్లో మోర్గాన్ మెరిస్తే బ్యాట్‌తో కోల్‌కతకు ఎదురుండదు. మరోవైపు యుఏఈలో వరుసగా మూడు విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ సేవలు కోల్పోయింది. గత మ్యాచ్‌లో ఆ జట్టు ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది, స్వదేశీ క్రికెటర్లు ఫామ్‌లో ఉండటంతో వారి అండతోనే నేడు కోల్‌కతపై ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
పంజాబ్, ముంబయి నువ్వా నేనా? : నేడు రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్‌లు చెరో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించాయి. ప్లే ఆఫ్స్ రేసు తుది దశకు చేరుకోవటంతో కీలక పాయింట్లపై ఇరు జట్లు కన్నేశాయి. ముంబయి ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యంతో ఇబ్బంది పడుతోంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య పరుగుల వేటలో విఫలమవుతున్నారు. హార్దిక్ పాండ్య గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ నలుగురు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ముంబయి రాత మారనుంది. పంజాబ్ కింగ్స్ కథ మరోలా ఉంది. జట్టు ఫామ్‌లో ఉంది, టాప్ ఆర్డర్ పరుగుల వరద పారిస్తోంది. సన్‌రైజర్స్‌పై విజయంతో గెలుపు బాట పట్టిన పంజాబ్ నేడు ముంబయిపైనా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ అబుదాబిలో రాత్రి 7.30 గంటలకు ఆరంభం.