Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో విలియమ్సన్ అజేయ అర్థ సెంచరీ
- రాజస్థాన్‌పై హైదరాబాద్ ఘన విజయం
నవతెలంగాణ-దుబాయ్
హమ్మయ్య హైదరాబాద్ గెలిచింది. ఐపీఎల్ 14 సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టుపై 7 ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 165 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ అరంగ్రేట ఓపెనర్ జేసన్ రారు (60, 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51 నాటౌట్, 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. వృద్దిమాన్ సాహా (18, 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (21 నాటౌట్, 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) సైతం రాణించటంతో 18.3 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛేదన పూర్తి చేసింది. సన్‌రైజర్స్ చేతిలో ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. అంతకముందు, సంజు శాంసన్ (82, 57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లో అర్థ సెంచరీతో చెలరేగాడు. సంజు శాంసన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరవటంతో రాజస్థాన్ రాయల్స్ 164/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. శాంసన్ దూకుడుతో రాయల్స్ మరింత భారీ స్కోరుపై కన్నేసినా.. చివరి మూడు ఓవర్లలో భువనేశ్వర్ కుమార్, జేసన్ హౌల్డర్ రాజస్థాన్ జోరుకు కళ్లెం వేశారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36, 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లామ్రోర్ (29 నాటౌట్, 28 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ (2/36), భువనేశ్వర్ కుమార్ (1/27), జేసన్ హౌల్డర్ (1/27) రాణించారు. డెవిడ్ వార్నర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జేసన్ రారు అరంగ్రేట మ్యాచ్‌లో హైదరాబాద్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. 60 పరుగుల అర్థ శతకంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
ఆ ఇద్దరు ధనాధన్ : టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఎవిన్ లూయిస్ (6)ను వెనక్కి పంపించాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36)తో జత కట్టిన కెప్టెన్ సంజు శాంసన్ (82) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సంజు శాంసన్ నెమ్మదిగా ఆడగా.. మరో ఎండ్‌లో జైస్వాల్ రెచ్చిపోయాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో శివమెత్తాడు. యశస్వి మెరుపులతో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ 49/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. యశస్వి జైస్వాల్.. సందీప్ శర్మకు వికెట్ కోల్పోగా, లివింగ్‌స్టోన్ (4) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. 41 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన సంజు శాంసన్.. ఆ తర్వాత గేర్ మర్చాడు. మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో దండెత్తాడు. సంజుకు మహిపాల్ లామ్రోర్ (29 నాటౌట్) సైతం తోడటంతో రాజస్థాన్ భారీ స్కోరు దిశగా పయనించింది. సంజు వికెట్‌తో డెత్ ఓవర్లలో పరుగుల వరదకు హైదరాబాద్ అడ్డుకట్ట వేసింది. నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
వార్నర్ అవుట్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా ఐదు సీజన్లలో 500కి పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డెవిడ్ వార్నర్‌కు మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదు. యుఏఈలో వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమైన వార్నర్‌ను సన్‌రైజర్స్ పక్కనపెట్టింది. నాయకుడిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన డెవిడ్ వార్నర్ ఈ సీజన్లో అంచనాలను అందుకోలేకపోయాడు. ప్రథమార్థంలో చివరి మ్యాచ్‌లోనూ వార్నర్‌ను పక్కనపెట్టిన హైదరాబాద్ తాజాగా రెండు మ్యాచుల్లో అవకాశం ఇచ్చింది. ఈ రెండింటా వార్నర్ పరుగుల వేటలో దారుణంగా విఫలమయ్యాడు. డెవిడ్ వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ జేసన్ రారును తుది జట్టులోకి వచ్చాడు.
స్కోరు వివరాలు :
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 164/5 (సంజు శాంసన్ 82, యశస్వి జైస్వాల్ 36, మహిపాల్ 29, సిద్దార్థ్ కౌల్ 2/36)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : 167/3 (జేసన్ రారు 60, కేన్ విలియమ్సన్ 51, అభిషేక్ శర్మ 21, మహిపాల్ 1/22).
ఐపీఎల్లో నేడు
ఢిల్లీ x కోల్‌కత
వేదిక : షార్జా , సమయం : మ.3.30
పంజాబ్ x ముంబయి
వేదిక : అబుదాబి , సమయం : రా.7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక
జట్టు మ్యా వి ఓ పా
1 చెన్నై 10 08 02 16
2 ఢిల్లీ 10 08 02 16
3 బెంగళూర్ 10 06 04 12
4 కోల్‌కత 10 04 06 08
5 పంజాబ్ 10 04 06 08
6 రాజస్థాన్ 10 04 06 08
7 ముంబయి 10 04 06 08
8 హైదరాబాద్ 10 02 08 04