Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
- రాణించిన యువ బ్యాటర్ నితీశ్ రానా
- ఢిల్లీపై 3 వికెట్ల తేడాతో గెలుపు
నవతెలంగాణ-షార్జా
కోల్‌కత నైట్‌రైడర్స్ ఖతర్నాక్ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై సాధికారిక విజయం సాధించింది. చిన్న బౌండరీల షార్జాలో మరోసారి స్వల్ప స్కోర్లు నమోదు కాగా.. సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోల్‌కత నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 128 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కత ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో నితీశ్ రానా (36 నాటౌట్, 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (30, 33 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), సునీల్ నరైన్ (21, 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) కదం తొక్కారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులే చేసింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (39, 34 బంతుల్లో 4 ఫోర్లు), కెప్టెన్ రిషబ్ పంత్ (39, 36 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. స్పిన్నర్ సునీల్ నరైన్ (2/18) ఢిల్లీకి ముకుతాడు వేశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన సునీల్ నరైన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఢిల్లీపై గెలుపుతో ఐదో విజయం నమోదు చేసిన కోల్‌కత పది పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి ఎగబాకింది. 16 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ స్థానం లాంఛనం చేసుకున్నా.. సాంకేతికంగా ఖరారు చేసుకునేందుకు మరో విజయం సాధించాల్సి ఉంది.
ఆ ముగ్గురు మెరువగా.. : షార్జా స్టేడియం అనగానే భారీ స్కోర్లు గుర్తుకొస్తాయి. గత సీజన్లో ఇక్కడ 200కి పైగా పరుగులు నమోదైన మ్యాచులు ఉన్నాయి. ఈ సీజన్లో షార్జా అందుకు పూర్తి భిన్నంగా స్పందిస్తోంది. పిచ్ మందకోడిగా తయారవటంతో పరుగుల వేట గగనమవుతోంది. 128 పరుగుల సవాల్‌తో కూడిన ఛేదనను కోల్‌కత 18.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (30, 33 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) పవర్‌ప్లేలో కోల్‌కత ఇన్నింగ్స్‌ను నడిపించగా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నితీశ్ రానా (36 నాటౌట్, 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మ్యాచ్‌ను కోల్‌కత చేతుల్లోకి తీసుకొచ్చాడు. ఢిల్లీ బౌలర్లు సైతం క్రమం తప్పకుండా వికెట్లు కూల్చి నైట్‌రైడర్స్‌పై ఒత్తిడి పెంచారు. వెంకటేశ్ అయ్యర్ (14), రాహుల్ త్రిపాఠి (9), ఇయాన్ మోర్గాన్ (0), దినేశ్ కార్తీక్ (12)లు విఫలమయ్యారు. ఆఖర్లో సునీల్ నరైన్ (21, 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో క్యాపిటల్స్ ఆశలు ఆవిరి చేశాడు. నరైన్ మెరుపులతో కోల్‌కత అలవోకగా గెలుపొందింది. క్యాపిటల్స్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/13) మూడు వికెట్లతో రాణించగా.. ఎన్రిచ్ నోర్ట్జె, అశ్విన్, లలిత్ యాదవ్, కగిసో రబాడలు తలా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
నరైన్ మ్యాజిక్ : టాస్ నెగ్గిన కోల్‌కత తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో కొన్ని ప్రయోగాలు చేసింది. ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ పృథ్వీ షాకు విశ్రాంతి ఇచ్చింది. సీజన్లో తొలిసారి ఆడుతున్న స్టీవ్ స్మిత్ (39) ప్రతికూల పరిస్థితుల్లో రాణించాడు. ఐదు బౌండరీలతో దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (24, 20 బంతుల్లో) నిష్క్రమణతో ఢిల్లీ ఇన్నింగ్స్ నెమ్మదించింది. శ్రేయస్ అయ్యర్ (1), షిమ్రోన్ హెట్మయర్ (4), లలిత్ యాదవ్ (0), అక్షర్ పటేల్ (0), అశ్విన్ (9)లు పరుగుల వేటలో తేలిపోయారు. టాప్ ఆర్డర్లో స్మిత్, మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (39, 36 బంతుల్లో 3 ఫోర్లు) ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆఖరు వరకు క్రీజులో నిలిచిన రిషబ్ పంత్ సహజ శైలికి విరుద్ధంగా ఆడాడు. 36 బంతుల్లో కేవలం మూడు బౌండరీలు బాదాడు. సునీల్ నరైన్ (2/13) మాయాజాలంతో క్యాపిటల్స్‌ను కట్టడి చేశాడు. వెంకటేశ్ అయ్యర్ (2/29), లాకీ ఫెర్గుసన్ (2/10)లు మంచి ప్రదర్శన చేశారు. కోల్‌కత బౌలర్ల మెరుపులతో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 127 పరుగులకే పరిమితమైంది.
స్కోరు వివరాలు :
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : స్టీవ్ స్మిత్ (బి) ఫెర్గుసన్ 39, శిఖర్ ధావన్ (సి) అయ్యర్ (బి) ఫెర్గుసన్ 24, శ్రేయస్ అయ్యర్ (బి) సునీల్ నరైన్ 1, రిషబ్ పంత్ (రనౌట్) 39, షిమ్రోన్ హెట్మయర్ (సి) సౌథీ (బి) అయ్యర్ 4, లలిత్ యాదవ్ (ఎల్బీ) సునీల్ నరైన్ 0, అక్షర్ పటేల్ (సి) ఫెర్గుసన్ (బి) అయ్యర్ 0, రవిచంద్రన్ అశ్విన్ (సి) రానా (బి) సౌథీ 9, కగిసో రబాడ నాటౌట్ 0, అవేశ్ ఖాన్ రనౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127.
వికెట్ల పతనం : 1-35, 2-40, 3-77, 4-88, 5-89, 6-92, 7-120, 8-122, 9-127.
బౌలింగ్ : సందీప్ వారియర్ 2-0-15-0, టిమ్ సౌథీ 4-0-29-3, లాకీ ఫెర్గుసన్ 2-0-10-2, వరుణ్ చక్రవర్తి 4-0-24-0, సునీల్ నరైన్ 4-0-18-2, వెంకటేశ్ అయ్యర్ 4-0-29-2.
కోల్‌కత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : శుభ్‌మన్ గిల్ (సి) అయ్యర్ (బి) రబాడ 30, వెంకటేశ్ అయ్యర్ (బి) లలిత్ యాదవ్ 14, రాహుల్ త్రిపాఠి (సి) స్మిత్ (బి) అవేశ్ ఖాన్ 9, నితీశ్ రానా నాటౌట్ 36, ఇయాన్ మోర్గాన్ (సి) లలిత్ యాదవ్ (బి) అశ్విన్ 0, దినేశ్ కార్తీక్ (బి) అవేశ్ ఖాన్ 12, సునీల్ నరైన్ (సి) అక్షర్ పటేల్ (బి) నోర్జ్జ్టె 21, టిమ్ సౌథీ (బి) అవేశ్ ఖాన్ 3, లాకీ ఫెర్గుసన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (18.2 ఓవర్లలో 7 వికెట్లకు) 130.
వికెట్ల పతనం : 1-28, 2-43, 3-67, 4-67, 5-96, 6-122, 7-126.
బౌలింగ్ : ఎన్రిచ్ నోర్జ్టె 2.2-0-15-1, అక్షర్ పటేల్ 3-0-13-0, అశ్విన్ 4-0-24-1, లలిత్ యాదవ్ 3-0-35-1, అవేశ్ ఖాన్ 3-0-13-3, కగిసో రబాడ 3-1-28-1.
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక
జట్టు మ్యా వి ఓ పా
1 చెన్నై 10 08 02 16
2 ఢిల్లీ 11 08 03 16
3 బెంగళూర్ 10 06 04 12
4 కోల్‌కత 11 05 06 10
5 పంజాబ్ 10 04 06 08
6 రాజస్థాన్ 10 04 06 08
7 ముంబయి 10 04 06 08
8 హైదరాబాద్ 10 02 08 04
మ్యా : మ్యాచులు, వి : విజయాలు, ఓ : ఓటములు, పా : పాయింట్లు
ఐపీఎల్లో నేడు
బెంగళూర్ x రాజస్థాన్
వేదిక : దుబాయ్, సమయం : రాత్రి: 7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..