Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి భారత్, ఆసీస్ డే నైట్ టెస్టు
- విజయంపై కన్నేసిన మిథాలీరాజ్ సేన
- తొలి రెండు రోజులు వర్ష సూచనలు
భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రక సమరానికి సిద్ధమవుతోంది. తొలిసారి అమ్మాయిల జట్టు గులాబీ బంతి టెస్టుకు రెఢ అవుతున్నారు. 2006లో చివరగా నాలుగు రోజుల ఫార్మాట్లో తలపడిన భారత్, ఆస్ట్రేలియా 15 ఏండ్ల విరామం అనంతరం టెస్టు సమరంలో పోటీపడుతున్నారు. సొంతగడ్డపై ఆడుతున్న అనుకూలతతో ఆస్ట్రేలియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. ఇంగ్లాండ్‌తో టెస్టును డ్రా చేసుకున్న మిథాలీసేన గోల్డ్‌కోస్ట్‌లోనూ గొప్ప ప్రదర్శనపై కన్నేసింది. భారత్, ఆస్ట్రేలియా (మహిళలు) డే నైట్ గులాబీ బంతి టెస్టు మ్యాచ్ నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-గోల్డ్‌కోస్ట్
ఫ్లడ్‌లైట్ల వెలుతురులో, గులాబీ బంతితో, నాలుగు రోజుల ఫార్మాట్లో పింక్ సవాల్‌కు రంగం సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా తొలి ముఖాముఖి గులాబీ టెస్టు ఆడనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టుతో సంప్రదాయ ఫార్మాట్లో పున ప్రవేశం చేసిన టీమ్ ఇండియా.. తాజాగా ఆస్ట్రేలియాపై చారిత్రక డే నైట్ టెస్టుకు సన్నద్ధమవుతోంది. 2006లో చివరగా ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు మ్యాచ్ ఆడింది. భారత్‌తో ఆడిలైడ్ టెస్టు అనంతరం ఆసీస్ అమ్మాయిలు.. ఇంగ్లాండ్ మినహా మరో జట్టుతో టెస్టుల్లో తలపడలేదు. టెస్టుల్లో ఆస్ట్రేలియా బలమైన జట్టు. అయినా, గులాబీ బంతితో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆట పరిస్థితులపై కంగారూలకు పెద్ద అవగాహన లేదు. దీంతో భారత్, ఆస్ట్రేలియా తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ సమవుజ్జీల సమరంగానే సాగనుంది.
ఆ ఇద్దరు మెరుస్తారా? : ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అరంగ్రేట షెఫాలీ వర్మ, స్మృతీ మంధానలు వరుసగా 96, 63 పరుగులతో ఏకంగా 167 పరుగులు జోడించారు. సీనియర్ బ్యాటర్లు మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు కేవలం 18 పరుగులే చేయగలిగారు. గాయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ టెస్టు మ్యాచ్‌కు సైతం అందుబాటులో లేదు. ఇంగ్లాండ్‌తో టెస్టులో విఫలమైనా.. వన్డేల్లో పరుగుల వరద పారించిన మిథాలీరాజ్ అదే జోరు ఆసీస్‌తో వన్డేల్లో చూపించింది. ఈ ఫార్మాట్లో మంచి రికార్డున్న మిథాలీ గులాబీ బంతితో మంచి ఇన్నింగ్స్ ఆడాలని చూస్తోంది. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించింది. చివరి రెండు వన్డేల్లో బంతిని చూడచక్కని రీతిలో స్వింగ్ చేసింది. మిథాలీ రాజ్‌తో కలిసి 2002లో జులన్ గోస్వామి టెస్టు అరంగ్రేటం చేసింది. ఈ ఇద్దరికి కెరీర్లో ఇది 12వ టెస్టు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వన్డే వరల్డ్‌కప్ అనంతరం ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉండటంతో.. దిగ్గజాలకు ఇదే ఆఖరు టెస్టు మ్యాచ్ కానుంది!. ఈ నేపథ్యం ఈ మ్యాచ్‌పై అంచనాలను మరింత పెంచుతుంది. దీప్తి శర్మ, పూనమ్ రౌత్, రిచా ఘోష్, మేఘ్న సింగ్‌లు పింక్ టెస్టులో తమదైన ముద్ర వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
గాయాల బెడద : ఆతిథ్య ఆస్ట్రేలియాకు గాయాల బెడద ఎక్కువైంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రేచల్ హేన్స్ టెస్టు మ్యాచ్‌కు దూరమైంది. దీంతో టాప్ ఆర్డర్లో కంగారూలకు ఓ బ్యాటర్ అన్వేషణ తలనొప్పి మొదలైంది. బెత్ మూనీ రూపంలో ఓ ఆప్షన్ ఉన్నప్పటికీ.. టెస్టుల్లో ఆమె ఓపెనింగ్ చేయలేదు. వన్డేల్లో వరుస విజయాల జోరుకు బ్రేక్ వేసిన భారత్‌పై టెస్టు మ్యాచ్‌లో పైచేయి సాధించాలని ఆసీస్ ఆలోచన. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్‌కు సైతం గులాబీ బంతితో పోరు ఇదే తొలిసారి కానుంది. అన్ని విభాగాల్లోనూ ఆస్ట్రేలియా బలంగా కనిపిస్తోంది. చివరి వన్డేలో ఓటమి ఆస్ట్రేలియా ప్రణాళికల్లో మార్పులకు దోహదం చేయనుంది.
పిచ్, వాతావరణం : గోల్డ్‌కోస్ట్ నగర శివారు ప్రాంతం కార్రరా టెస్టు మ్యాచ్‌కు వేదిక. పిచ్‌పై పచ్చిక బాగుంది. మ్యాచ్‌కు ముందు పచ్చిక కాస్త తగ్గించే అవకాశం ఉంది. పేసర్లతో పాటు స్పిన్నర్లకు పిచ్ నుంచి సహకారం లభిస్తుంది. తొలి రెండు రోజులు వర్ష సూచనలు ఉన్నాయి. వర్షం ప్రభావిత టెస్టులో ఫలితం తేలే అవకాశాలు సైతం స్వల్పమే. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : షెఫాలీ వర్మ, స్మృతీ మంధాన, మిథాలీరాజ్ (కెప్టెన్), పూనమ్ రౌత్/యస్టికా భాటియా, దీప్తి శర్మ, స్నేV్‌ా రానా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శిఖా పాండే, జులన్ గోస్వామి, మేఘ్న సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.
ఆస్ట్రేలియా : అలీసా హీలీ (వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఎలిసీ పెర్రీ, తహ్లియ మెక్‌గ్రాత్, గార్డ్నర్, అనాబెల్ సుథర్లాండ్, సోఫీ మోలినెక్స్, జార్జియా, డార్సీ బ్రౌన్, స్టెల్లా కాంప్‌బెల్.