Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్‌పై బెంగళూర్ గెలుపు
- రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి!
నవతెలంగాణ-దుబాయ్
ప్లే ఆఫ్స్‌లో చోటుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మరింత చేరువైంది. రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 150 పరుగుల ఊరించే ఛేదనలో గ్లెన్ మాక్స్వెల్ (50 నాటౌట్, 30 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), శ్రీకర్ భరత్ (44, 35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టారు. ఆరంభంలో విరాట్ కోహ్లి (25), దేవదత్ పడిక్కల్ (22)లు రాణించారు. మాక్స్వెల్ మెరుపులతో 17.1 ఓవర్లలోనే బెంగళూర్ ఛేదనను పూర్తి చేసింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మిగతా మ్యాచుల్లో ఆ జట్టు నెగ్గినా.. ఇతర జట్ల ప్రదర్శనపై ఆ జట్టు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అంతకముందు, ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (58, 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (31, 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో రాయల్స్ 149 పరుగులు చేసింది. మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్ (2/18), లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ (2/10) మాయజాలంతో రాజస్థాన్‌ను కట్టడి చేశారు.
స్పిన్నర్ల మాయ : టాస్ గెలిచిన బెంగళూర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ఓపెనర్లు లూయిస్ (58), జైస్వాల్ (31) ఆ జట్టుకు అదిరే ఆరంభం అందించారు. పవర్‌ప్లే ముగిసేసరికి రాయల్స్ 56/0తో ధనాధన్ జోరు అందుకుంది. కెప్టెన్ సంజు శాంసన్ భీకర ఫామ్‌లో ఉండటంతో రాజస్థాన్ భారీ స్కోరుపై కన్నేసింది. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన లూయిస్, యువ బ్యాటర్ జైస్వాల్ నిష్క్రమణతో రాయల్స్ దూకుడుకు కళ్లెం పడింది. కెప్టెన్ సంజు శాంసన్ (19), మహిపాల్ లామ్రోర్ (3), లియాం లివింగ్‌స్టోన్ (6), రాహుల్ తెవాటియ (2)లు స్పిన్నర్ల మాయలో పడ్డారు. రియాన్ పరాగ్ (9), క్రిస్ మోరీస్ (14), చేతన్ సకారియ (2)లు హర్షల్ పటేల్ ఖాతాలో పడిపోయారు. ఆఖరు ఓవర్లలో పరుగుల వేటలో వెనుకంజ వేసిన రాయల్స్ వరుస వికెట్లతో 149 పరుగులకే పరిమితమైంది. 11 ఓవర్లలో 100/1తో ఉన్న రాయల్స్.. చివరి 54 బంతుల్లో 49 పరుగులే చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. బెంగళూర్ బౌలర్లలో హర్షల్ పటేల్ (3/34), యుజ్వెంద్ర చాహల్ (2/18), షాబాజ్ నదీమ్ (2/10) రాణించారు.
స్కోరు వివరాలు :
రాజస్థాన్ రాయల్స్ : 149/9 (ఎవిన్ లూయిస్ 58, యశస్వి జైస్వాల్ 31, హర్షల్ పటేల్ 3/34, చాహల్ 2/18)
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : 153/3 (మాక్స్వెల్ 51, శ్రీకర్ భరత్ 44, కోహ్లి 25, ముస్తాఫిజుర్ రెహమాన్ 2/20)