Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోర్గాన్‌తో వివాదంపై అశ్విన్
దుబాయ్ : కోల్‌కత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఢిల్లీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ రెండు జట్ల ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోల్కతతో మ్యాచ్‌లో రిషబ్ పంత్, అశ్విన్ క్రీజులో ఉండగా.. టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఈ జోడీ 18వ ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు తీసింది. సింగిల్ తీసే సమయంలో నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో త్రో విసరగా అది పంత్‌కు తగిలి పక్కకు వెళ్లింది. దీంతో అశ్విన్ రెండో పరుగు కోసం పంత్‌ను పిలిచాడు. ఓవర్ త్రో విసిరినప్పుడు ఓ ఆటగాడికి బంతి తగిలినప్పుడు మరో పరుగుకు వెళ్లరనే సంప్రదాయం ఉంది. కానీ ఐసీసీ నిబంధనల ప్రకారం పరుగు తీసేందుకు అవకాశం ఉంది. అశ్విన్ రూల్స్ ప్రకారం పరుగు తీయగా.. దీనికి మోర్గాన్, సౌథీ వాగ్వివాదానికి దిగారు. అశ్విన్ చేసిన పని యువతకు తప్పుడు సందేశం పంపిస్తుందని మోర్గాన్ మ్యాచ్ అనంతరం ట్వీట్ చేయగా.. ఆస్ట్రేలియా మీడియా అశ్విన్‌ను విలన్ చేస్తూ కథనాలు రాసింది. దీనికి అశ్విన్ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో స్పందించాడు. 'మైదానంలో నిబంధనల మేరకు ఆడి, ఆట అనంతరం ప్రత్యర్థితో కరచాలనం చేయటమే నాకు తెలిసిన క్రీడా స్ఫూర్తి. ఆ బంతి పంత్‌కు తగలటం నేను చూడలేదు. ఒకవేళ చూసినా, నేను పరుగు తీసేవాడిని. నిబంధనల ప్రకారమే నేను ఆడానని' అశ్విన్ అన్నాడు. ఐసీసీ 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో బెన్ స్టోక్స్‌కు ఓవర్ త్రో విసిరిన బంతి తగిలి బౌండరీకి వెళ్లటంతో ఇంగ్లాండ్ ఆ మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించింది. వరల్డ్‌కప్ ఫైనల్లో గుర్తుకు రాని నైతికత, క్రీడా స్ఫూర్తి.. ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చిందని అశ్విన్ దీటుగా బదులిచ్చాడు.