Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రియో ఒలింపిక్స్‌లో పది బౌట్లు ప్రభావితం
న్యూఢిల్లీ : ఓ బాక్సర్ రింగ్‌లో ప్రత్యర్థిపై పిడి గుద్దుల వర్షం కురిపించి నెత్తురోడించినా.. ఫలితం అతడికి ప్రతికూలంగా రావటం ఎన్నో సార్లు చూశాం. గతంలో భారత మహిళా బాక్సర్లు సరితా దేవి, ఎం.సీ మేరీకోమ్‌లు సైతం న్యాయమూర్తుల నిర్ణయంపై నిరసన తెలిపారు. అంతర్జాతీయ బాక్సింగ్‌లో బౌట్ల ఫలితాలను న్యాయమూర్తులు, రిఫరీలు డబ్బులు, ఇతర ప్రయోజనాల కోసం తారుమారు చేశారని తాజాగా ఓ నివేదిక స్పష్టం చేసింది. మెక్లారెన్ గ్లోబల్ స్పోర్ట్స్ సొల్యూషన్స్ సంస్థ స్వతంత్ర దర్యాప్తు నివేదికను అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబిఏ)కు అందజేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఈ సంస్కృతికి బీజాలు పడగా.. 2016 రియో ఒలింపిక్స్‌లో పదికి పైగా బౌట్లు ప్రభావితమైనట్టు నివేదిక నిగ్గు తేల్చింది. ఆతిథ్య దేశాన్ని, జాతీయ ఒలింపిక్ సంఘాన్ని సంతృప్తి పరిచేందుకు, టోర్నీ నిర్వహణలో ఆర్థిక అండదండలు అందించిన సంస్థల ప్రయోజనం కోసం, ఏఐబిఏ ప్రయోజనాలు కాపాడేందుకు సహా నేరుగా డబ్బు రూపంలో లబ్ది పొందేందుకు న్యాయమూర్తులు రియో ఒలింపిక్స్ బాక్సింగ్ బౌట్ల ఫలితాలను తారుమారు చేశారని.. అందులో రెండు పసిడి పోరు బౌట్లు సైతం ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. రిఫరీలు, జడ్జీల ఎంపిక ప్రక్రియ సమయంలోనే ప్రలోభాలకు తలొగ్గే అధికారులను ఎంపిక చేసి, నిజాయితీ పరులను దూరం పెట్టారని నివేదిక వెల్లడించింది. దీనిపై సమగ్ర దర్యాప్తుతో పాటు రిఫరీలు, జడ్జీల ఎంపిక ప్రక్రియను సమీక్షిస్తామని ఏఐబిఏ పేర్కొంది.