Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మృతీ అజేయ అర్థ సెంచరీ
- వర్షంతో ఆటకు అంతరాయం
- ఆసీస్‌తో పింక్ బాల్ టెస్టు తొలి రోజు
- భారత్ తొలి ఇన్నింగ్స్ 132/1
నవతెలంగాణ-గోల్డ్‌కోస్ట్
దశాబ్ద కాలానికి పైగా విరామం అనంతరం టెస్టు క్రికెట్ ఆడుతున్నారు. స్వదేశంలో టెస్టు అనుభవం లేకుండానే నేరుగా విదేశీ గడ్డపైనే సంప్రదాయ సవాల్ ఆరంభించారు. ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టు అనంతరం.. నేరుగా సవాల్‌తో కూడిన డే నైట్ పింక్ బాల్ టెస్టు అనగానే భారత శిబిరంలో కాస్త ఆందోళన కనిపించింది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో కంగారూ పేసర్లను ఎదుర్కొవటంపై అనుమానాలు ఎక్కువగానే వ్యక్తమయ్యాయి!. తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోయినా.. గులాబీ బంతిపై టీమ్ ఇండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు తొలి రోజు ఆటలో 44.1 ఓవర్లలో 132/1 స్కోరుతో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా బంతితో ప్రభావం చూపించలేదు. స్మృతీ మంధాన (80 బ్యాటింగ్, 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కింది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ (31, 64 బంతుల్లో 4 ఫోర్లు), పూనమ్ రౌత్ (16 బ్యాటింగ్, 57 బంతుల్లో 1 ఫోర్) ఆకట్టుకున్నారు.
ఆరంభం అదిరింది : గులాబీ బంతి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బ్యాటర్లకు కష్టకాలం. వర్ష సూచనలతో కూడిన వాతావరణం నేపథ్యంలో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ప్రణాళికలను భారత ఓపెనింగ్ జోడీ చిత్తు చేసింది. ఆరంభంలో కొత్త బంతిపై ఆధిపత్యం చెలాయించిన మంధాన, షెఫాలీ.. వర్షం విరామం అనంతరం ఆతిథ్య జట్టు పేసర్లకు తలొగ్గలేదు. ఇక ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్ కొనసాగే అవకాశం లేకపోవటంతో ఆసీస్‌కు చివరి సెషన్ వికెట్ల వేట అవకాశమే లభించలేదు. ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 163 పరుగులు జోడించిన స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ అదే జోరు ఆస్ట్రేలియాపైనా చూపించారు. ఆస్ట్రేలియా పేసర్లను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కొంది. 11.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసిన ఈ జంట.. డ్రింక్స్ విరామానికి 70/0తో అదరగొట్టారు. కండ్లుచెదిరే బ్యాటింగ్ ప్రదర్శన మంధాన 51 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసింది. 11 ఫోర్లతో ఏకంగా బౌండరీల రూపంలో 44 పరుగులు పిండుకుని అర్థ శతకం సాధించింది. మరో ఎండ్‌లో షెఫాలీ వర్మ సహనంతో ఆడింది. 64 బంతుల్లో నాలుగు బౌండరీలతో మెరిసింది. స్పిన్నర్ సోఫీ మోలినక్స్ ఓవర్లో మిడ్ ఆన్‌లో స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన షెఫాలీ మిడ్ ఆఫ్‌లో తహ్లియ మెక్‌గ్రాత్ చేతికి చిక్కింది. దీంతో 93 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. నం.3 బ్యాటర్ పూనమ్ రౌత్ (16 బ్యాటింగ్)తో కలిసి మంధాన దూకుడు కొనసాగించింది. 19 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన మంధాన, పూనమ్ రౌత్‌లు 39 పరుగులు జోడించారు. తొలి రోజు ఆటలో 44.1 ఓవర్లలో భారత్ 132/1తో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. ఏడుగురు బౌలర్లను ప్రయోగించిన ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ వికెట్ల వేటలో వెనుకంజ వేసింది.
వరుణుడు వచ్చాడు : తొలి సెషన్‌ను 101/1తో ముగించిన భారత్.. రెండో సెషన్లో మరింత దూకుడు ప్రదర్శించాలని అనుకుంది. అమ్మాయిల పింక్ బాల్ టెస్టు చూసేందుకు వరుణుడు సైతం రావటంతో ఆటకు అంతరాయం తప్పలేదు. 39.3 ఓవర్లలో భారత్ 114/1తో ఉండగా తొలిసారి వర్షం అంతరాయం కలిగింది. ఆ తర్వాత పలు మార్లు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. రెండో సెషన్ అనంతరం సైతం భారీ వర్షం, ఉరుములు మెరుపులతో ఆట ముందుకు సాగలేదు. దీంతో తొలి రోజు ఆటలో 44.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. నేడు ఆటను ఓ అరగంట ముందుగా ఆరంభించనున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ : స్మృతీ మంధాన బ్యాటింగ్ 80, షెఫాలీ వర్మ (సి) మెక్‌గ్రాత్ (బి) మోలినక్స్ 31, పూనమ్ రౌత్ బ్యాటింగ్ 16, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (44.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 132.
వికెట్ల పతనం : 1-93.
బౌలింగ్ : ఎలిసీ పెర్రీ 7-1-24-0, డార్సీ బ్రౌన్ 4-0-28-0, స్టెల్లా కాంప్‌బెల్ 3-0-14-0, తహ్లియ మెక్‌గ్రాత్ 10-1-34-0, సోఫీ మోలినక్స్ 9-4-18-1, ఆష్లె గార్డ్నర్ 10.1-3-14-0, అనాబెల్ సుథర్లాండ్ 1-1-0-0.