Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గులాబీ టెస్టులో మంధాన రికార్డు సెంచరీ
- రాణించిన పూనమ్, మిథాలీ రాజ్
- ఆసీస్‌తో పింక్ బాల్ టెస్టు రెండో రోజు
- భారత్ తొలి ఇన్నింగ్స్ 276/5
స్మృతీ మంధాన చరిత్ర సృష్టించింది. పింక్ బాల్ డే నైట్ టెస్టులో తొలి శతకం బాదింది. 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో శివమెత్తిన స్మృతీ మంధాన 127 పరుగుల భారీ శతకంతో రికార్డులు బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలపై వన్డే, టెస్టు శతకం బాదిన తొలి బ్యాటర్‌గా మంధాన సరికొత్త రికార్డు నెలకొల్పింది. గులాబీ బంతిపై మంధాన మెరుపు శతకంతో ఏకైక టెస్టులో టీమ్ ఇండియా ముందంజలో నిలిచింది. వర్షం, ఉరుములు, మెరుపులు మరోసారి ఆటకు ఆటంకం కలిగించినా.. రెండో రోజు స్మృతీ మంధాన శతకనాదమే హైలైట్‌గా నిలిచింది.
74మంధాన ఇన్నింగ్స్‌లో బౌండరీల రూపంలో వచ్చిన పరుగుల శాతం. 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో స్మృతీ శివమెత్తింది. చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) భారత్‌పై 2006లో చేసిన శతకంలో 80 శాతం బౌండరీల రూపంలో వచ్చిన పరుగులే. ఓ శతక ఇన్నింగ్స్‌లో బౌండరీల పరంగా ఆమె తర్వాత మంధాన నిలిచింది.
నవతెలంగాణ-గోల్డ్‌కోస్ట్
ఉరుములు, మెరుపులతో వరుణుడు మైదానంలోకి రాకముందే.. స్మృతీ మంధాన (127, 216 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్) ఆస్ట్రేలియాకు ఆ అనుభవం రుచి చూపించింది. కంగారూ బౌలర్లపై నిర్దాక్షిణ్య దండయాత్ర చేసిన మంధాన పింక్ బాల్ టెస్టులో చారిత్రక శతకం సాధించింది. స్మృతీ మంధాన రికార్డు సెంచరీ ఇన్నింగ్స్‌తో ఏకైక టెస్టులో భారత్ పట్టు బిగించింది. వర్షం అంతరాయంతో రెండో రోజు 57 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 276/5తో మంచి స్థితిలో కొనసాగుతోంది. పూనమ్ రౌత్ (36, 165 బంతుల్లో 2 ఫోర్లు), మిథాలీ రాజ్ (30, 86 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. తొలి రెండు రోజులు వర్షం ప్రభావంతో పూర్తి స్థాయి ఆట సాధ్యపడలేదు. టెస్టు మ్యాచ్‌లో చివరి రెండు రోజులు (మహిళల టెస్టు నాలుగు రోజులు) ఎటువంటి వర్ష సూచనలు లేవు. నేడు, రేపు వరుసగా 108 ఓవర్ల ఆటకు అంపైర్లు షెడ్యూల్ చేశారు.
మంధాన అదరహో : ఆస్ట్రేలియాతో డే నైట్ గులాబీ టెస్టులో స్మృతీ మంధాన ఇన్నింగ్స్ హైలైట్. తొలి రోజే 80 పరుగులతో అజేయంగా నిలిచిన మంధాన.. రెండో రోజు మరో 57 పరుగులు జోడించింది. 51 బంతుల్లోనే అర్థ సెంచరీతో ధనాధన్ టచ్ ఇచ్చింది. 18 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 170 బంతుల్లో మంధాన సెంచరీ పూర్తి చేసింది. ఆరంభంలో దూకుడు ప్రదర్శించినా.. అర్థ సెంచరీ అనంతరం నెమ్మదించింది. ఆసీస్ పేసర్లు షార్ట్ బంతులతో మంధానను కవ్వించేందుకు, ఇరకాటంలో పెట్టేందుకు శతథా ప్రయత్నించారు. డ్రైవ్ షాట్లు, పుల్ షాట్లు, లేట్ కట్ షాట్లతో మంధాన విరుచుకు పడింది. మంధాన ముందు ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ వ్యూహలు చిన్నబోయాయి. మంధాన వికెట్ కోసం ఆసీస్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించింది. ఉదయం సెషన్లోనే శతక గర్జన చేసిన మంధాన భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించింది. మరో బ్యాటర్ పూనమ్ రౌత్ (36) నుంచి మంధానకు గొప్ప సహకారం లభించింది. పింక్ బాల్‌తో ఆసీస్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. పూనమ్ రౌత్ అద్భుతంగా డిఫెన్స్ చేసింది. 165 బంతుల్లో 2 ఫోర్లతో 36 పరుగులు చేసింది. గార్డ్నర్ బౌలింగ్‌లో మంధాన నిష్క్రమించగా.. కొద్దిసేపటికే పూనమ్ పెవిలియన్‌కు చేరుకుంది. మంధాన, పూనమ్ జోడీ రెండో వికెట్‌కు 102 పరుగులు జోడించారు. అంతకుముందు షెఫాలీ వర్మ (31)తో కలిసి మంధాన తొలి వికెట్‌కు 93 పరుగులు చేసింది. సోఫీ మోలినక్స్ ఓవర్లో వికెట్ కీపర్ క్యాచౌట్ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించినా.. పూనమ్ రౌత్ స్వచ్ఛందంగా క్రీజులో నుంచి నిష్క్రమించింది. అప్పటికి భారత్ స్కోరు 217.
భారత కెప్టెన్, స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ (30, 86 బంతుల్లో 5 ఫోర్లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌కు అనూహ్య రీతిలో తెరపడింది. ఆరంభం నుంచీ క్రీజులో స్వేచ్ఛగా నిలిచిన మిథాలీ భారీ స్కోరు సాధించేలా కనిపించింది. 98.1 ఓవర్లో మిడ్ వికెట్ నుంచి సుథర్లాండ్ నేరుగా విసిరిన త్రోకు రనౌట్‌గా నిష్క్రమించింది. మరో యువ బ్యాటర్ యస్టికా భాటియా (19, 40 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకుంది. దీప్తి శర్మ (12 నాటౌట్, 28 బంతుల్లో 2 ఫోర్లు), తానియా భాటియా (0 నాటౌట్) అజేయంగా క్రీజులో కొనసాగుతున్నారు. 101.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ 276 పరుగులు చేసింది. నేడు ఉదయం సెషన్లో వేగంగా పరుగులు రాబట్టి.. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆసీస్ అమ్మాయిల భరతం పట్టేందుకు భారత అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : స్మృతీ మంధాన (సి) మెక్‌గ్రాత్ (బి) గార్డ్నర్ 127, షెఫాలీ వర్మ (సి) మెక్‌గ్రాత్ (బి) మోలినక్స్ 31, పూనమ్ రౌత్ (సి) హీలీ (బి) మోలినక్స్ 30, మిథాలీ రాజ్ రనౌట్ 30, యస్టికా భాటియా (సి) బెత్ మూనీ (బి) పెర్రీ 19, దీప్తి శర్మ బ్యాటింగ్ 19, తానియా భాటియా బ్యాటింగ్ 0, ఎక్స్‌ట్రాలు : 21, మొత్తం : (101.5 ఓవర్లలో 5 వికెట్లకు) 276.
వికెట్ల పతనం : 1-93, 2-195, 3-217, 4-261, 5-274.
బౌలింగ్ : ఎలిసీ పెర్రీ 18-3-54-1, డార్సీ బ్రౌన్ 10-0-49-0, స్టెల్లా కాంప్‌బెల్ 6-0-31-0, తహ్లియ మెక్‌గ్రాత్ 15.5-3-39-0, సోఫీ మోలినక్స్ 14-5-28-2, ఆష్లె గార్డ్నర్ 22-10-26-1, అనాబెల్ సుథర్లాండ్ 11-4-25-0, జార్జియ వాహెమ్ 5-1-17-0.
127 పింక్ బాల్ టెస్టులో మంధాన 127 పరుగుల శతకం ఆసీస్‌పై ఏ బ్యాటర్‌కైనా అత్యధికం. 1949లో మోలీ హైడ్ (ఇంగ్లాండ్) 124ను మంధాన అధిగమించింది.
1ఆస్ట్రేలియాపై వన్డే, టెస్టుల్లో శతకం సాధించిన తొలి భారత మహిళ బ్యాటర్ మంధాన. కంగారూ గడ్డపై ఆ జట్టుపై ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్ ఘనతా మంధానదే.