Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్షర్ పటేల్ మ్యాజిక్ ప్రదర్శన
- ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
నవతెలంగాణ-షార్జా
ముంబయి ఇండియన్స్ డీలా పడింది. సీజన్లో ఏడో పరాజయం మూట గట్టుకుని ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో మెరుగైన అవకాశాల కోసం తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ (3/21) మాయజాలంతో తొలుత ముంబయి ఇండియన్స్ 129/8 పరుగులకే పరిమితం అయ్యింది. ఛేదనలో శ్రేయస్ అయ్యర్ (33 నాటౌట్, 33 బంతుల్లో 2 ఫోర్లు), కెప్టెన్ రిషబ్ పంత్ (26, 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రవిచంద్రన్ అశ్విన్ (20 నాటౌట్, 21 బంతుల్లో 1 సిక్స్) రాణించటంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. తొమ్మిదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానం సుస్థిరం చేసుకుని.. టాప్-2 స్థానం దాదాపు లాంఛనం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
అయ్యర్ షో : 130 పరుగుల లక్ష్యం. ఆరంభంలోనే ఓపెనర్లు శిఖర్ ధావన్ (8), పృథ్వీ షా (6) సహా నం.3 బ్యాటర్ స్టీవెన్ స్మిత్ (9) వికెట్లు కోల్పోయారు. 30/3తో ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంపై ఒత్తిడి. ముంబయి బౌలింగ్ సామర్థ్యం దృష్ట్యా.. పంత్ గ్యాంగ్ కష్టాల్లో పడినట్టే అనిపించింది. రిషబ్ పంత్ (26) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో వేగంగా పరుగులు పిండుకున్నాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ను నేలకు దిగటంతో క్యాపిటల్స్ పని సులువైంది. శ్రేయస్ అయ్యర్ (33 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 33 బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అయ్యర్ ఆఖరు వరకు క్రీజులో నిలిచాడు. షిమ్రోన్ హెట్మయర్ (15) ధనాధన్ షోతో అలరించాడు. టెయిలెండర్ అశ్విన్ (20 నాటౌట్) బ్యాట్‌తో అదరగొట్టాడు. అయ్యర్ తోడుగా ఐదో వికెట్‌కు అజేయంగా 39 పరుగులు జోడించాడు. చివరి ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదిన అశ్విన్.. ఆఖర్లో హైడ్రామాకు తెరదించాడు. ముంబయి బౌలర్లలో బౌల్ట్, బుమ్రా, కృనాల్, జయంత్, కౌల్టర్‌నైల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
దారుణ వైఫల్యం : ముంబయి బ్యాటర్లు మళ్లీ విఫలమయ్యారు. అవేశ్ ఖాన్ (3/15), అక్షర్ పటేల్ (3/21) విజృంభించగా క్రీజులో నిలువలేక పోయారు. రోహిత్ (7), పొలార్డ్ (6), హార్దిక్ (17), కృనాల్ (13), తివారీ (15) పరుగుల వేటలో తేలిపోయారు. డికాక్ (19), సూర్యకుమార్ (33), ఆఖర్లో జయంత్ (11 నాటౌట్) ముంబయికి గౌరవప్రద స్కోరు అందించారు.
స్కోరు వివరాలు :
ముంబయి : 129/8 (సూర్యకుమార్ 33, డికాక్ 19, అక్షర్ 3/22)
ఢిల్లీ : 132/6 (అయ్యర్ 33, పంత్ 26, అశ్విన్ 20, బౌల్ట్ 1/24)
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక
జట్టు మ్యా వి ఓ పా
1 చెన్నై 11 09 02 18
2 ఢిల్లీ 12 09 03 18
3 బెంగళూర్ 11 07 04 14
4 కోల్‌కత 12 05 07 10
5 పంజాబ్ 12 05 07 10
6 ముంబయి 12 05 07 10
7 రాజస్థాన్ 11 04 07 08
8 హైదరాబాద్ 11 02 08 04
మ్యా : మ్యాచులు, వి : విజయాలు, ఓ : ఓటములు, పా : పాయింట్లు