Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ తొలి ఇన్నింగ్స్ 377/8 డిక్లేర్డ్
- రాణించిన దీప్తి శర్మ, తానియా
- జులన్ గోస్వామి, పూజ పేస్ పంచ్
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 143/4
పింక్ బాల్ టెస్టులో టీమ్ ఇండియా అదరగొట్టింది. బ్యాట్‌తో, బంతితో ఆతిథ్య ఆస్ట్రేలియాను కంగారు పెట్టారు. లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ (66), యస్టికా భాటియా (19), తానియా భాటియా (22) రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత మహిళల జట్టు 377 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లరేషన్ ప్రకటించింది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి (2/27), యువ పేసర్ పూజ వస్ట్రాకర్ (2/31) నిప్పులు చెరగటంతో ఆస్ట్రేలియా 143/4తో కష్టాల్లో కూరుకుంది.
నవతెలంగాణ-గోల్డ్‌కోస్ట్
ఆస్ట్రేలియా, భారత్ (మహిళలు) ఏకైక టెస్టులో ఉమెన్ ఇన్ బ్లూ అదిరే ప్రదర్శన. బ్యాట్‌తో సమిష్టిగా కదం తొక్కిన మిథాలీసేన తొలి ఇన్నింగ్స్‌లో 377 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ (66, 167 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీతో మెరువగా.. తానియా భాటియా (22, 75 బంతుల్లో 3 ఫోర్లు), యస్టికా భాటియా (19, 40 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ఓపెనర్ స్మృతీ మంధాన (127) శతకానికి తోడు పూనమ్ రౌత్ (36), షెఫాలీ వర్మ (31), మిథాలీరాజ్ (30) విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 143/4తో ఆడుతోంది. భారత పేసర్లు జులన్ గోస్వామి, పూజ వస్ట్రాకర్ చెలరేగటంతో కంగారూ జట్టుకు కష్టాలు తప్పలేదు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో మరో 234 పరుగుల వెనుకంజలోనే కొనసాగుతోంది.
పేసర్ల ప్రతాపం : లంచ్ విరామం అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు భారత పేస్ ద్వయం చుక్కలు చూపించింది. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి ఇన్నింగ్స్ ఏడో ఓవర్లోనే కంగారూ తొలి వికెట్ పడగొట్టింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ బెత్ మూనీ (4) గోస్వామి బంతికి క్లీన్‌బౌల్డ్ అయిపోయింది. అలిసా హీలీ (29), కెప్టెన్ మెగ్ లానింగ్ (38) రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఈ ఇద్దరినీ స్వల్ప విరామంలో పెవిలియన్‌కు పంపించారు. అలీసాను గోస్వామి అవుట్ చేయగా.. మెగ్ లానింగ్, తహ్లియ మెక్‌గ్రాత్ (28) పూజకు తలొగ్గారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఎలిసీ పెర్రీ (27 బ్యాటింగ్, 68 బంతుల్లో 4 ఫోర్లు), ఆష్లె గార్డ్నర్ (13 బ్యాటింగ్, 34 బంతుల్లో 1 ఫోర్) అజేయంగా నిలిచారు.
దీప్తి శర్మ దూకుడు : ఓవర్‌నైట్ స్కోరు 276/5తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సైతం ఆసీస్ బౌలర్లను ఉతికారేశారు. యువ క్రీడాకారిణీలు యస్టికా భాటియా, తానియా భాటియాలు స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. బాధ్యతాయుతంగా ఆడిన దీప్తి శర్మ ఐదు ఫోర్ల సాయంతో 148 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసింది. యస్టికా, తానియాలతో కలిసి రెండు విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన దీప్తి శర్మ.. కాంప్‌బెల్‌కు వికెట్ల ముందు దొరికిపోయింది. పూజ (13), జులన్ గోస్వామి (7 నాటౌట్), మేఘ్న (2 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. 145 ఓవర్లలో 377/8 వద్ద ఉండగా కెప్టెన్ మిథాలీరాజ్ ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ప్రకటించింది. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
డ్రా దిశగా పింక్ పోరు : భారత్, ఆస్ట్రేలియా ఏకైక పింక్ బాల్ టెస్టు (డే నైట్) డ్రా దిశగా సాగుతోంది. తొలి రెండు రోజులు వర్షం కారణంగా పూర్తి స్థాయి ఆట సాధ్యపడలేదు. వరుణుడు రాని మూడో రోజు మాత్రమే ఆట సంపూర్ణంగా సాగింది. మహిళల టెస్టు నాలుగు రోజులే కాగా.. పింక్ బాల్ టెస్టులో నేడు ఆఖరు రోజు. మూడో రోజుకు తొలి ఇన్నింగ్స్‌లే పూర్తి కాలేదు. ఆసీస్ విజయానికి అసలు అవకాశాలే లేవు. భారత్ విజయానికి ఆఖరు రోజు ఏకంగా 16 వికెట్లు అవసరం. తొలి గంటలో ఆసీస్‌కు కుప్పకూల్చి.. ఫాలోఆన్‌లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కంగారూను బోల్తా కొట్టించే ఆలోచన కనిపిస్తోంది. అద్భుతమేమీ జరుగకపోతే ఈ టెస్టు డ్రాగా ముగియనుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ : స్మృతీ మంధాన (సి) మెక్‌గ్రాత్ (బి) గార్డ్నర్ 127, షెఫాలీ వర్మ (సి) మెక్‌గ్రాత్ (బి) మోలినక్స్ 31, పూనమ్ రౌత్ (సి) హీలీ (బి) మోలినక్స్ 36, మిథాలీ రాజ్ (రనౌట్) 30, యస్టికా భాటియా రనౌట్ 19, దీప్తి శర్మ (ఎల్బీ) కాంప్‌బెల్ 66, తానియా భాటియా (సి) హీలీ (బి) కాంప్‌బెల్ 22, పూజ (సి) మూనీ (బి) పెర్రీ 13, గోస్వామి నాటౌట్ 7, మేఘ్న సింగ్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 24, మొత్తం : (145 ఓవర్లలో 8 వికెట్లకు) 377.
వికెట్ల పతనం : 1-93, 2-195, 3-217, 4-261, 5-274, 6-319, 7-359, 8-369.
బౌలింగ్ : ఎలిసీ పెర్రీ 27-4-76-2, డార్సీ బ్రౌన్ 10-0-49-0, స్టెలా కాంప్‌బెల్ 14-2-47-2, తహ్లియ మెక్‌గ్రాత్ 16-3-40-0, సోఫీ మోలినక్స్ 23-8-45-2, ఆష్లె గార్డ్నర్ 30-11-52-1, అనాబెల్ 17-6-31-0, జార్జియ 8-2-28-0.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : అలీసా హీలీ (సి) తానియా (బి) గోస్వామి 29, బెత్ మూనీ (బి) గోస్వామి 4, మెగ్ లానింగ్ (ఎల్బీ) పూజ 38, ఎలిసీ పెర్రీ నాటౌట్ 27, తహ్లియ మెక్‌గ్రాత్ (సి) మంధాన (బి) పూజ 28, ఆష్లె గార్డ్నర్ నాటౌట్ 13, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం : (60 ఓవర్లలో 4 వికెట్లకు) 143.
వికెట్ల పతనం : 1-14, 2-63, 3-80, 4-119.
బౌలింగ్ : జులన్ గోస్వామి 14-3-27-2, మేఘ్న సింగ్ 11-1-32-0, పూజ 16-6-31-2, రాజేశ్వరి గైక్వాడ్ 12-1-36-0, దీప్తి శర్మ 7-4-14-0.