Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుతురాజ్ అజేయ శతకం
- చెన్నై సూపర్‌కింగ్స్ 189/4
నవతెలంగాణ-అబుదాబి
రుతురాజ్ గైక్వాడ్ (101 నాటౌట్, 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతక గర్జన చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకు పడిన గైక్వాడ్ ఇన్నింగ్స్ చివరి బంతిని గ్రౌండ్ బయటకు సిక్సర్‌గా పంచి ఐపీఎల్లో తొలి శతకం సాధించాడు. రవీంద్ర జడేజా (32 నాటౌట్, 15 బంతుల్ల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సైతం రెచ్చిపోవటంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 189/4 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
రుతురాజ్ ఊచకోత! : రాయల్స్ బౌలర్లు రాణించగా చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే ఆరంభమైంది. పవర్‌ప్లేలో ఆ జట్టు 44 పరుగులే చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ (25, 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), మోయిన్ అలీ (21, 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) బౌలర్లపై ఆధిపత్యానికి ప్రయత్నించారు. ఇద్దరూ తెవాటియ ఓవర్లో క్రీజు వదిలి డగౌట్‌కు చేరారు. చెన్నై తరఫున 200వ ఐపీఎల్ మ్యాచ్‌లో సురేశ్ రైనా (3) విఫలమవగా, అదే బాటలో రాయుడు (2) నడిచాడు. మరో ఎండ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (101 నాటౌట్) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. ఆరు ఫోర్లతో 43 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఓ దశలో సూపర్‌కింగ్స్ 12 ఓవర్లలో 83/2తో స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది.
ఆఖరు ఓవర్లలో మొదలైన గైక్వాడ్ విధ్వంసం ఆఖరు బంతి వరకూ కొనసాగింది. రుతురాజ్ ఆడిన చివరి 30 బంతుల్లో ఏకంగా 71 పరుగులు పిండుకున్నాడు. సంప్రదాయ షాట్లతోనే దండెత్తిన గైక్వాడ్ కండ్లుచెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా సైతం నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కగా చెన్నై ఇన్నింగ్స్ రాకెట్ స్పీడ్‌తో ముందుకెళ్లింది. గైక్వాడ్, జడేజా మెరుపు ఇన్నింగ్స్‌లతో చెన్నై చివరి ఎనిమిది ఓవర్లలో 106 పరుగులు పిండుకుంది. రాయల్స్ బౌలర్లలో రాహుల్ తెవాటియ (3/39) రాణించాడు.
ఐపీఎల్లో నేడు
బెంగళూర్ X పంజాబ్
వేదిక : షార్జా , సమయం : మ.3.30
కోల్‌కత X హైదరాబాద్
వేదిక : దుబాయ్ , సమయం : రా.7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..