Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రులు వేరే చోట నిర్మించండి
- శాప్ మాజీ చైర్మన్ రాజ్ ఠాకూర్
నవతెలంగాణ, హైదరాబాద్ : క్రీడా రంగానికి ప్రోత్సాహకాలు అందించి, అభివృద్ది చేయకపోగా.. క్రీడా సముదాయాలు, స్టేడియాలను పథకం ప్రకారం నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని శాప్ మాజీ చైర్మన్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. గచ్చిబౌలి స్టేడియం భూములను వైద్య ఆరోగ్య శాఖకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీఆర్ఎస్ సర్కార్‌ను హెచ్చరించారు. ఆదివారం ఫతే మైదాన్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్‌ఠాకూర్ మాట్లాడారు. 'కరోనా సమయంలో గచ్చిబౌలి స్పోర్ట్స్ టవర్‌ను 'టిమ్స్'గా ఉపయోగించుకుంటే ఎవరూ వ్యతిరేకించలేదు. కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగినా ఇంకా టిమ్స్‌ను ఆ టవర్లోనే కొనసాగించటం, అదనంగా మరో 5.17 ఎకరాల భూమికి కేటాయించటం అన్యాయం. ఆర్చరీ సాధన చేసే మైదానాన్ని టిమ్స్‌కు ఏ విధంగా అప్పగిస్తారు?. హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేస్తామని సీఏం గొప్పలు చెప్తారు, ఉప సంఘం వేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాలను ఆధునీకరించకుండా.. నిరుపయోగం, శిథిలావస్థ సాకుతో వేలం వేసి సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఇప్పటికైనా మేల్కోవాలి. క్రీడా రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు ఉపక్రమించాలని' రాజ్ ఠాకూర్ అన్నారు.