Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశేషంగా ఆకట్టుకున్న భారత్
నవతెలంగాణ-గోల్డ్‌కోస్ట్ : టీమ్ ఇండియా అమ్మాయిలు ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన చారిత్రక గులాబీ బంతి టెస్టు (డే నైట్) మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆతిథ్య ఆస్ట్రేలియాను బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో ఇబ్బంది పెట్టిన మిథాలీసేన కంగారూలతో కలిసి చెరో రెండు పాయింట్లు పంచుకుంది. టెస్టు మ్యాచ్ చివరి రోజు మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవటంతో.. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 36/2 వద్ద ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకారం తెలిపారు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో చెలరేగిన స్మృతీ మంధాన (127, 31 రన్స్) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది. ఏకైక టెస్టు ముగియటంతో ఆస్ట్రేలియా 6, భారత్ 4 పాయింట్లతో కొనసాగుతున్నాయి. నిర్ణయాత్మక టీ20 సిరీస్ గురువారం (అక్టోబర్ 7) నుంచి ఆరంభం కానుంది. మూడు ఫార్మాట్ల సిరీస్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు విజేతగా నిలువనుంది.
షెఫాలీ, పూనమ్ జోరు : రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ దూకుడు తగ్గలేదు. శతక స్టార్ మంధాన (31, 48 బంతుల్లో 6 ఫోర్లు) త్వరగా అవుటైనా.. యువ సంచలనం షెఫాలీ వర్మ (52, 91 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీతో కదం తొక్కింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ పూనమ్ రౌత్ (41 నాటౌట్, 62 బంతుల్లో 6 ఫోర్లు) ఫామ్ కొనసాగించింది. ఈ ముగ్గురు మెరుపులతో రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 135/3 వద్ద డిక్లరేషన్ ఇచ్చింది.
బౌలర్ల జోరు : పింక్ బాల్‌తో భారత బౌలర్లు అదరగొట్టారు. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి, మేఘ్న సింగ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా.. యువ పేసర్ పూజ మూడు వికెట్లతో మెరిసింది. ఎలీసీ పెర్రీ (68), ఆష్లె గార్డ్నర్ (51), తహ్లియ (28), అలిసా (29)లు రాణించారు. 96.4 ఓవర్లలో ఆసీస్ 241 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి డిక్లరేషన్ ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగుల వెనుకంజలో ఉండగానే ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అలిసా హీలీ (6), బెత్ మూనీ (17)లు గోస్వామి, పూజలకు వికెట్ కోల్పోయారు. మెగ్ లానింగ్ (17), ఎలిసీ పెర్రీ (1) అజేయంగా ఆడుతుండగా.. డ్రింక్స్ విరామంలోనే ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 377 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 241/9 డిక్లేర్డ్
భారత్ రెండో ఇన్నింగ్స్ : 135/3 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 36/2