Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయో సెక్యూర్ బబుల్‌లో నిర్వహణ
- డిసెంబర్ 22న ఆరంభానికి ఏర్పాట్లు
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ప్రొ కబడ్డీ లీగ్ విరామం అనంతరం అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ ఏడాది జులైలోనే ప్రొ కబడ్డీ లీగ్ ఆరంభం కావాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇటీవల ఆటగాళ్ల వేలం ముగించుకున్న ప్రొ కబడ్డీ.. డిసెంబర్ 22 నుంచి కబడ్డీ కబడ్డీ అనేందుకు సిద్ధమవుతోంది. మూడు నెలల పాటు 12 నగరాల్లో అలరించే ప్రొ కబడ్డీ లీగ్ ఈ ఏడాది కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఒకే నగరానికి పరిమితం అవుతోంది. అహ్మదాబాద్, జైపూర్ నగరాలను పరిశీలించినా.. బెంగళూర్ వేదికగా ఈ సీజన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి కంఠీరవ స్టేడియం ఈ సీజన్ మ్యాచులకు ఏకైక వేదికగా నిలువనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జట్లు కనీసం 14 రోజుల ముందే బెంగళూర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరూ కోవిడ్ టీకా తీసుకోవాలని ఇప్పటికే నిర్వాహకులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రొ కబడ్డీ లీగ్ తొలి సీజన్ విజేత జైపూర్ పింక్ పాంథర్స్ ఈ నెల 16న డెహ్రాడూన్‌లో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనుండగా.. తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న తెలుగు టైటాన్స్ అక్టోబర్ 7న హైదరాబాద్‌లో జట్టు క్యాంప్‌ను నిర్వహించనుంది. కోవిడ్ టీకా తప్పనిసరి నేపథ్యంలో లీగ్‌లో ప్రాతినిథ్యం వహించనున్న విదేశీ ఆటగాళ్ల విషయంలో కొంత అనిశ్చితి వాతావరణం నెలకొంది.