Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయుడు అర్థ శతకం
- చెన్నై సూపర్‌కింగ్స్ 136/5
నవతెలంగాణ-దుబాయ్
చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కట్టడి చేసింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్ (2/18), రవిచంద్రన్ అశ్విన్ (1/20) మ్యాజిక్‌తో సూపర్‌కింగ్స్ స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యింది. తెలుగు తేజం అంబటి రాయుడు (55 నాటౌట్, 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిసినా జట్టుకు మంచి స్కోరు అందించటంలో విఫలమయ్యాడు. కెప్టెన్ ఎం.ఎస్ ధోని (18, 27 బంతుల్లో) సుదీర్ఘంగా క్రీజులో నిలిచినా కనీసం ఒక్క బౌండరీ బాదలేకపోయాడు. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్‌కింగ్స్ 136 పరుగులే చేసింది.
తేలిపోయిన చెన్నై! : టాప్ ఆర్డర్ మెరుపులతో ఎదురులేని విజయాలు అందుకున్న సూపర్‌కింగ్స్.. సీజన్లో తొలిసారి టాప్ ఆర్డర్ వైఫల్యంతో తీవ్ర కష్టాల్లో కూరుకుంది. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దుబారు పిచ్ నెమ్మదిగా స్పందించటంతో ఢిల్లీ బౌలర్లు ఉత్సాహంగా వికెట్ల వేటకు వచ్చారు. గత మ్యాచ్‌లో శతకబాదిన రుతురాజ్ గైక్వాడ్ (13, 13 బంతుల్లో 2 ఫోర్లు), డుప్లెసిస్ (10, 8 బంతుల్లో 2 ఫోర్లు) స్వల్ప స్కోర్లకు నిష్క్రమించారు. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయటంలోనూ సూపర్‌కింగ్స్ వెనుకంజ వేయగా 39/2తో కీలక ఓపెనర్లను కోల్పోయింది. ధనాధన్ బ్యాటర్ మోయిన్ అలీ (5) నిరాశపరిచాడు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన రాబిన్ ఉతప్ప (19, 19 బంతుల్లో 1 ఫోర్)ను అశ్విన్ రిటర్న్ క్యాచ్‌తో సాగనంపాడు. అప్పటికి చెన్నై స్కోరు 62/4. ఈ పరిస్థితుల్లో జతకట్టిన ఎం.ఎస్ ధోని, అంబటి రాయుడు ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. పిచ్ బౌలర్లకు సహకరించటం, ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో.. పరుగులు రావటం గగనమైంది. ఎం.ఎస్ ధోని 27 బంతుల్లో 18 పరుగులే చేశాడు. ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. చివరి ఓవర్ తొలి బంతికి నిష్క్రమించిన ధోనీ.. క్రీజులో నిలిచినా జట్టుకు నష్టమే చేశాడు!. మరో ఎండ్‌లో అంబటి రాయుడు ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరు ఓవర్లో వచ్చిన రవీంద్ర జడేజా (1 నాటౌట్) ధనాధన్ అవకాశం లభించలేదు. చివరి ఓవర్లోనూ సూపర్‌కింగ్స్ ఆశించిన పరుగులు రాబట్టుకోలేదు. డుప్లెసిస్, మోయిన్ అలి వికెట్లు కూల్చిన అక్షర్ పటేల్ సూపర్‌కింగ్స్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. పేసర్లు ఎన్రిచ్ నోర్జ్టె, అవేశ్ ఖాన్లు చెరో వికెట్ పడగొట్టారు.
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (సి) అశ్విన్ (బి) నోర్ట్జె 13, డుప్లెసిస్ (సి) అయ్యర్ (బి) అక్షర్ పటేల్ 10, రాబిన్ ఉతప్ప (సి,బి) అశ్విన్ 19, మోయిన్ అలి (సి) అయ్యర్ (బి) అక్షర్ పటేల్ 5, అంబటి రాయుడు నాటౌట్ 55, ఎం.ఎస్ ధోని (సి) రిషబ్ పంత్ (బి) అవేశ్ ఖాన్ 18, రవీంద్ర జడేజా నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 136.
వికెట్ల పతనం : 1-28, 2-39, 3-59, 4-62, 5-132.
బౌలింగ్ : ఎన్రిచ్ నోర్ట్జె 4-0-37-1, అవేశ్ ఖాన్ 4-0-35-1, అక్షర్ పటేల్ 4-0-18-2, కగిసో రబాడ 4-0-21-0, రవిచంద్రన్ అశ్విన్ 4-0-20-1.