Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హార్దిక్ పాండ్య బౌలింగ్‌పై గవాస్కర్
దుబాయ్ : విధ్వంసక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం బౌలింగ్ చేయటం లేదు. సర్జరీకి రెండేండ్లు ముగుస్తున్నా హార్దిక్ పాండ్య ఇప్పటికీ బౌలింగ్ వైపు చూడటం లేదు. బంతితో హార్దిక్ కొంత ఇబ్బంది పడుతున్నాడని ముంబయి ఇండియన్స్ చీఫ్ కోచ్ మహేళ జయవర్దనె ఇటీవల చెప్పాడు. హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయకపోవటం ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కూ ఎదురుదెబ్బ అని సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. ' హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయకపోవటం పెద్ద ఎదురు దెబ్బ. ఇది ముంబయితో పాటు భారత్‌కూ ఇబ్బందే. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ జట్టులో ఉంటున్నాడు. ఆరు, ఏడో స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ చేయకపోతే కెప్టెన్‌కు పెద్ద తలనొప్పి. భారత జట్టులోకి ఎంపికైన అనంతరం సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. భారత జట్టులో ఉన్నందుకే కొన్ని షాట్లు ఆడుతున్నారనే భావన అనిపిస్తోంది' అని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు నిలకడగా విఫలమవుతున్నారు. హార్దిక్, సూర్యకుమార్, కిషన్ వైఫల్యంతో ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ తడబడగా.. ఈ ముగ్గురు భారత టీ20 ప్రపంచకప్ జట్టులోనూ భాగం. దీంతో వీరి ఫామ్‌పై భారత అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది.