Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బర్మింగ్‌హామ్ క్రీడల నుంచి తప్పుకున్న భారత జట్టు
- హాకీ ఇండియా సంచలన నిర్ణయం
- బ్రిటన్ వివక్షపూరిత కోవిడ్ నిబంధనలే కారణం
హాకీ ఇండియా సంచలన నిర్ణయం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో స్వదేశంలో హాకీ క్రీడకు పూర్వ వైభవం దిశగా చారిత్రక అడుగు ముందుకేసిన హాకీ ఇండియా.. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకుంది. భారతీయులపై బ్రిటన్ ప్రభుత్వం వివక్షపూరిత కోవిడ్ నిబంధనలను నిరసిస్తూ హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల నిర్వాహకులకు హాకీ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. 2022 జులై 28-ఆగస్టు 8న జరగాల్సిన కామన్వెల్త్ క్రీడల నుంచి భారత హాకీ జట్లు తప్పుకున్నాయి. ఈ మేరకు హాకీ ఇండియా ఓ లేఖ ద్వారా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరెంద్ర బత్రాకు తెలియజేసింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ కఠిన కోవిడ్ నిబంధనలు విధించింది. టీకాతో సంబంధం లేకుండా పది రోజుల కఠిన క్వారంటైన్ నిబంధనలు విధించింది. భారత్‌పై వివక్ష పూరిత కోవిడ్ నిబంధనల విధింపుతో హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టు (మహిళలు, పురుషులు) సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. కాంస్య పతక మ్యాచ్‌లో పోరాడి ఓడాయి.
దెబ్బకు దెబ్బ! : ఎఫ్ఐహెచ్ జూనియర్ మెన్స్ హాకీ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ప్రతిష్టాత్మక జూనియర్ వరల్డ్‌కప్‌కు వేదికగా నిలువనుంది. అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత, ఇతర కోవిడ్-19 సమస్యలతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు జూనియర్ వరల్డ్‌కప్‌కు దూరమయ్యాయి. భారత్‌లో కోవిడ్ సంబంధిత పరిస్థితులు, కఠిన క్వారంటైన్ కారణంగా ఇంగ్లాండ్ జట్టు జూనియర్ వరల్డ్‌కప్‌లో పాల్గొనటం లేదని ప్రకటించింది. ఇంగ్లాండ్ జట్టు నిర్ణయం వెలువడిన మరుసటి రోజే హాకీ ఇండియా నుంచి సంచలన నిర్ణయం వచ్చింది. భారత ప్రయాణికులకుపై విధించిన కఠిన కోవిడ్ నిబంధనలను సవరించాలని పలుమార్లు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా బ్రిటన్ పట్టించుకోలేదు. దీంతో భారత్ సైతం బ్రిటన్ ప్రయాణికులపై అవే తరహా నిబంధనలు విధించింది. దీంతో బ్రిటన్ ప్రయాణికులు సైతం భారత్‌లోకి రావడానికి 72 గంటల ముందు నెగెటివ్ కోవిడ్-19 ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ చూపించాలి. క్వారంటైన్ తొలి రోజు, ఎనిమిదో రోజు కోవిడ్-19 ఆర్టీపీసీఆర్ నెగెటివ్ నివేదికలు అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ భారత్‌లో టోర్నీ నుంచి తప్పుకోగా.. భారత్ బ్రిటన్‌లో జరుగుతున్న ఈవెంట్లో పాల్గొనటం లేదు.
ఆసియా క్రీడలే ముద్దు! : బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు హాంగ్జౌ ఆసియా క్రీడలకు (2022 సెప్టెంబర్ 10-25) 32 రోజుల విరామమే ఉంది. 2020 ఆసియా క్రీడలకు చైనా ఆతిథ్యం ఇస్తోంది. ఒలింపిక్స్‌కు ఆసియా క్రీడలు కాంటినెంటల్ అర్హత టోర్నీ. కోవిడ్-19కు ప్రభావితమైన దేశాల్లో బ్రిటన్ ముందుంది. కీలక ఆసియా క్రీడలకు ముందు భారత హాకీ జట్లను బ్రిటన్‌కు పంపించి, ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని హాకీ ఇండియా రాసిన లేఖలో పేర్కొంది. కామన్వెల్త్ క్రీడలను పక్కనపెట్టి, భారత్ పూర్తిగా ఆసియా క్రీడలకు సిద్ధం కానుందని తెలిపింది.
సాధన షురూ : ఓ వైపు హాకీ ఇండియా కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకోగా.. మరోవైపు భారత హాకీ మెన్స్ జట్టు అప్పుడే సాధన మొదలుపెట్టింది. బెంగళూర్‌లోని సారు కేంద్రంలో మన్‌ప్రీత్‌సేన తిరిగి ప్రాక్టీస్ షురూ చేసింది. ఈ ఏడాది ఆఖర్లో ఆసియా హాకీ చాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడలే లక్ష్యంగా భారత్ ప్రాక్టీస్ చేస్తోంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మెన్స్ జట్టు ఆ తర్వాత ఇప్పుడే హాకీ టర్ఫ్‌పైకి అడుగుపెట్టింది. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్, చీఫ్ కోచ్ గ్రాహం రీడ్‌లు క్యాంప్‌కు హాజరయ్యారు.