Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెలరేగిన కౌల్టర్‌నైల్, నీషమ్, బుమ్రా
- రాజస్థాన్ రాయల్స్ 90/9
నవతెలంగాణ- షార్జా
ముంబయి ఇండియన్స్ పేస్ త్రయం విరుచుకుపడింది. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో కండ్లుచెదిరే ప్రదర్శన చేసింది. విజయంతో పాటు నెట్ రన్‌రేట్‌లోనూ దూసుకెళ్లగలిగే ప్రదర్శనతో అదరగొట్టింది. పేస్ త్రయం నాథన్ కౌల్టర్ నైల్ (4/14), జేమ్స్ నీషమ్ (3/12), జశ్‌ప్రీత్ బుమ్రా (2/14) బంతితో నిప్పులు చెరిగింది. ముంబయి పేసర్ల దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ విలవిల్లాడింది. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (24, 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (12, 9 బంతుల్లో 3 ఫోర్లు), డెవిడ్ మిల్లర్ (15, 23 బంతుల్లో), రాహుల్ తెవాటియ (12, 20 బంతుల్లో) మాత్రమే రాయల్స్ తరఫున రెండెంకల స్కోరు సాధించారు. నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేయగలిగింది.
పేసర్ల దూకుడు : చెన్నై సూపర్‌కింగ్స్‌పై ధనాధన్ ఛేదనతో ముంబయి ఇండియన్స్‌పై రాయల్స్ ఫేవరేట్‌గా కనిపించింది. రాయల్స్ తొలుత బ్యాటింగ్‌కు రావటంతో పరుగుల వరద లాంఛనమే అనిపించింది. అంచనాలకు తగ్గట్టుగానే ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (24), యశస్వి జైస్వాల్ (12) దూకుడుగా ఆడారు. లూయిస్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో చెలరేగగా, జైస్వాల్ మూడు బౌండరీలతో ప్రమాదకరంగా కనిపించాడు. ఓపెనర్లు ఇద్దరినీ పవర్‌ప్లేలోనే వెనక్కి పంపించిన ముంబయి.. రాయల్స్‌పై ఒత్తిడి పెంచింది. మిడిల్ ఆర్డర్లో ఏ బ్యాటర్ ముంబయి పేస్ ముందు నిలువలేదు. కెప్టెన్ సంజు శాంసన్ (3), శివం దూబె (3), గ్లెన్ ఫిలిప్స్ (4)లు పరుగుల వేటలో తేలిపోయారు. శాంసన్, దూబె, రాహుల్ తెవాటియలను జేమ్స్ నీషమ్ పడగొట్టగా.. నాథన్ కౌల్టర్ నైల్ మరింతగా రెచ్చిపోయాడు. జైస్వాల్ వికెట్ తీసిన కౌల్టర్‌నైల్ ఆ తర్వాత డెవిడ్ మిల్లర్ (15), చేతన్ సకారియ (6), గ్లెన్ ఫిలిప్స్‌ను సాగనంపాడు. లూయిస్, శ్రేయస్ గోపాల్ (0)లను యార్కర్ల హీరో జశ్‌ప్రీత్ బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.
పేసర్లు గొప్పగా రాణించడానికి తోడు షార్జా పిచ్ బ్యాటర్లకు ఏమాత్రం సహకరించలేదు. బ్యాట్‌పైకి బంతి రావటం లేదు. దీంతో రాయల్స్ బ్యాటర్లు పరుగుల కోసం నానా తంటాలు పడ్డారు. మిడిల్ ఓవర్లలో (6-16 ఓవర్లు) రాజస్థాన్ కేవలం 33 పరుగులే చేసింది. ఇందులో ఒక్క బౌండరీ కూడా లేదు.
ఐపీఎల్లో నేడు
బెంగళూర్ X హైదరాబాద్
వేదిక : అబుదాబి
సమయం : రాత్రి 7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక
జట్టు మ్యా వి ఓ పా
1 ఢిల్లీ 13 10 03 20
2 చెన్నై 13 09 04 18
3 బెంగళూర్ 12 08 04 16
4 కోల్‌కత 13 06 07 12
5 పంజాబ్ 13 05 08 10
6 రాజస్థాన్ 12 05 07 10
7 ముంబయి 12 05 07 10
8 హైదరాబాద్ 12 02 10 04
మ్యా : మ్యాచులు, వి : విజయాలు, ఓ : ఓటములు, పా : పాయింట్లు