Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎఫ్ఐహెచ్ వార్షిక అవార్డులు
లాసానె : అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డులను హాకీ ఇండియా స్వీప్ చేసింది. ఓటింగ్ విధానంతో నిర్ణయించిన అవార్డుల్లో భారత హాకీ స్టార్స్ ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఐదుగురు భారత హాకీ క్రీడాకారులు, మహిళల, పురుషుల జట్ల చీఫ్ కోచ్‌లు ఎఫ్ఐహెచ్ అవార్డులు దక్కించుకున్నారు. 41 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ 'మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు సాధించగా.. మహిళల జట్టు డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు గెలుచుకుంది. వెటరన్ గోల్ కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేష్, మహిళల జట్టు గోల్‌కీపర్ సవిత పూనియాలు ఉత్తమ గోల్ కీపర్ అవార్డులను కైవసం చేసుకున్నారు. షర్మిలా దేవి (మహిళలు), వివేక్ సాగర్ ప్రసాద్ (మెన్స్) వర్థమాన స్టార్ క్రీడాకారుల అవార్డులను ఖాతాలో వేసుకున్నారు. మెన్స్ జట్టు కోచ్ గ్రాహం రీడ్, మహిళల జట్టు కోచ్ మారినెలు ఉత్తమ కోచ్‌లుగా ఎంపికయ్యారు. ఓటింగ్ పద్దతితో ఎంపిక చేసిన అవార్డులకు 50 శాతం జాతీయ హాకీ సమాఖ్యల కెప్టెన్లు, కోచ్‌ల ఓట్లు.. 25 శాతం ఆటగాళ్లు, అభిమానులు, మరో 25 శాతం మీడియా ఓట్లను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను తేల్చారు. ఒలింపిక్ చాంపియన్ బెల్జియం అన్ని విభాగాల్లోనూ రేసులో నిలిచినా.. అవార్డులు దక్కించుకోలేదు. ఓటింగ్ పద్దతిని అవార్డులను తేల్చటంపై బెల్జియం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.