Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్‌పై హైదరాబాద్ గెలుపు
- రాణించిన జేసన్ రాయ్, విలియమ్సన్
నవతెలంగాణ-అబుదాబి
బ్యాటర్ల సమిష్టి వైఫల్యం, బౌలర్ల ఫామ్ లేమి.. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తీవ్రంగా వేధించాయి. ఐపీఎల్14 ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించేలా చేశాయి. సీజన్ ముగింపులో హైదరాబాద్ ఊరట విజయాలపై కన్నేసింది. పాయింట్ల పట్టికలో టాప్-2 ముగింపుపై కన్నేసిన బెంగళూర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుపు విజయం సాధించింది. ఆఖరు ఓవర్ ఉత్కంఠకు దారితీసిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. 142 పరుగుల ఛేదనలో బెంగళూర్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. విరాట్ కోహ్లి (5), డాన్ క్రిస్టియన్ (1), శ్రీకర్ భరత్ (12) విఫలమైనా.. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (41, 52 బంతుల్లో 4 ఫోర్లు), గ్లెన్ మాక్స్వెల్ (40, 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా ఏబీ డివిలియర్స్ (19 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఒక్క సిక్సర్‌తో సరిపెట్టగా బెంగళూర్ 137/6 వద్ద ఆగిపోయింది. భువనేశ్వర్ కుమార్ ఉత్కంఠభరిత ఆఖరు ఓవర్‌తో సన్‌రైజర్స్ సీజన్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ జేసన్ రాయ్ (44, 38 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (31, 29 బంతుల్లో 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించటంతో సన్‌రైజర్స్ ఓ దశలో 84/1తో భారీ స్కోరు దిశగా సాగింది. 15 ఓవర్ అనంతరం వరుస ఏడు బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువీ, హోల్డర్, సిద్దార్థ్, ఉమ్రాన్, రషీద్ ఖాన్లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
మెరిసిన రాయ్, కేన్ : స్వల్ప స్కోర్లు నమోదవుతూ, అంచనాలకు భిన్నంగా స్పందిస్తున్న అబుదాబి పిచ్‌పై టాస్ నెగ్గిన బెంగళూర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ (13, 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా.. జార్జ్ గార్టన్ ఓవర్లో వికెట్ కోల్పోయాడు. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ జేసన్ రాయ్ (44)తో జతకట్టిన కేన్ విలియమ్సన్ (31) కీలక భాగస్వామ్యం నిర్మించాడు. రెండో వికెట్‌కు ఈ జోడీ 70 పరుగులు జోడించింది. పరుగులు కష్టంగా వస్తున్న పిచ్‌పై ఈ జోడీ తెలివిగా ఆడింది. రాయ్ ఐదు ఫోర్లు బాదగా.. విలియమ్సన్ నాలుగు బౌండరీలతో రాణించాడు. హర్షల్ పటేల్ ఓవర్లో విలియమ్సన్ నిష్క్రమణకు ముందు హైదరాబాద్ స్కోరు 84/1. యువ ఆటగాడు ప్రియాం గార్గ్ (15, 11 బంతుల్లో 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. ఈ ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు. 15వ ఓవర్ తొలి బంతికి గార్గ్ వికెట్ పడగా..ఆ తర్వాత ఆరు బంతుల్లో జేసన్ రాయ్, అబ్దుల్ సమద్ (1)లను హైదరాబాద్ కోల్పోయింది. 105/2తో పటిష్టంగా కనిపించిన సన్‌రైజర్స్ వరుస వికెట్లతో మళ్లీ కోలుకోలేదు. లోయర్ ఆర్డర్లో జేసన్ హోల్డర్ (16, 13 బంతుల్లో 2 ఫోర్లు), వృద్దిమాన్ సాహా (10, 6 బంతుల్లో 1 ఫోర్) రాణించారు. రషీద్ ఖాన్ (7 నాటౌట్, 9 బంతుల్లో 1 ఫోర్) నిరాశపరిచాడు.
స్కోరు వివరాలు :
హైదరాబాద్ :141/7 (జేసన్ రాయ్ 44, విలియమ్సన్ 31, హర్షల్ పటేల్ 3/33)
బెంగళూర్ : 137/6 (పడిక్కల్ 41, మాక్స్వెల్ 40, డివిలియర్స్ 19, మాలిక్ 1/21)