Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ,హైదరాబాద్
37వ జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ అట్టహాసంగా ఆరంభమైంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ టోర్నీని అధికారికంగా ప్రారంభించారు. జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ' కోవిడ్ అనంతరం నగరంలో జరుగుతున్న తొలి జాతీయ స్థాయి టోర్నీ ఇది. హ్యాండ్బాల్ టోర్నీతో పండుగ వాతావరణం నెలకొంది. ఇటువంటి జాతీయ స్థాయి ఈవెంట్లు మరిన్ని నిర్వహించాలి. ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని' శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ' ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహణకు అనుమతులతో పాటు పూర్తి సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కోవిడ్ పరిస్థితుల్లోనూ టోర్నీకి జట్లను పంపించిన 24 రాష్ట్ర సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని' జగన్మోహన్ రావు అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శించిన సాంస్కృతిక కళారూపాలు ఆరంభ వేడుకల్లో విశేషంగా ఆకట్టుకున్నాయి.