Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైపై కెఎల్ బౌండరీల మోత
- పంజాబ్‌కు ఊరట విజయం
నవతెలంగాణ-దుబాయ్
కెఎల్ రాహుల్ (98 నాటౌట్, 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) విశ్వరూపం ప్రదర్శించాడు. సూపర్‌కింగ్స్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 8 సిక్సర్లు, 7 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించిన రాహుల్ సీజన్ చివరి మ్యాచ్‌లో పంజాబ్‌కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట స్ట్రయిక్‌రేట్‌పై విమర్శకులకు ఎదురులేని సమాధానం బ్యాట్‌తోనే ఇచ్చాడు. కెఎల్ రాహుల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 13 ఓవర్లలోనే ఊదేసింది. మయాంక్ (12), మార్కరం (13), సర్ఫరాజ్ (0), షారుక్ (8) నిరాశపరిచినా.. రాహుల్ ఒంటిచేత్తో పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. మరో 42 బంతులు ఉండగానే లాంఛనం పూర్తి చేసి ప్లే ఆఫ్స్ రేసులో పంజాబ్ ఆశలను సాంకేతికంగా సజీవంగా నిలిపాడు. తొలుత చెన్నై సూపర్‌కింగ్స్ 134/6 పరుగులే చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ (76, 55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో కదం తొక్కిన కెఎల్ రాహుల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. లీగ్ దశలో చివరి రెండు మ్యాచుల్లో ఓడినా పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్‌కింగ్స్ టాప్-2 పొజిషన్ నిలుపుకుంది.
రాహుల్ దంచికొట్టాడు : 135 పరుగుల స్వల్ప ఛేదనలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ (98 నాటౌట్) విరుచుకు పడ్డాడు. సూపర్‌కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. మరో ఎండ్‌లో మయాంక్ (12), సర్ఫరాజ్ (0), షారుక్ (8), మార్కరం (13) నిరాశపరిచినా.. రాహుల్ దూకుడు తగ్గలేదు. స్వేచ్ఛగా దండయాత్ర చేసిన రాహుల్ బౌండరీల వర్షం కురిపించాడు. సూపర్‌కింగ్స్ శిబిరంలో ఏ బౌలర్‌నూ వదలకుండా ఉతికారేశాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 25 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన రాహుల్.. మరో 17 బంతుల్లోనే 48 పరుగులు పిండుకున్నాడు. రాహుల్ ధనాధన్‌తో చెన్నై బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. 13 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుని ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కోల్‌కత, సన్‌రైజర్స్ చేతిలో ముంబయి ఓడితే.. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఆస్కారం ఉంది.
డుప్లెసిస్ ఒక్కడే : సూపర్‌కింగ్స్ లీగ్ దశ చివర్లో లయ కోల్పోయింది!. టాప్ ఆర్డర్లో ఏ బ్యాటర్ రాణించలేదు. ఓపెనర్ డుప్లెసిస్ (76, 55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెన్నైని ఆదుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (12), మోయిన్ అలీ (0), రాబిన్ ఉతప్ప (2), అంబటి రాయుడు (4) నిరాశపరిచారు. 15 బంతులు ఆడిన ఎం.ఎస్ ధోని రెండు ఫోర్లతో 12 పరుగులు సాధించాడు. రవి బిష్ణోరు మాయకు వికెట్ కోల్పోయాడు. రవీంద్ర జడేజా (15 నాటౌట్, 17 బంతుల్లో 1 ఫోర్) వేగంగా ఆడలేకపోయాడు. డ్వేన్ బ్రావో (4 నాటౌట్) అజేయంగా నిలిచాడు. నిర్ణీత ఓవర్లలో చెన్నై 134 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, క్రరిస్ జోర్డాన్లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
స్కోరు వివరాలు :
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ (సి) షారుక్ (బి) అర్షదీప్ 12, డుప్లెసిస్ (సి) రాహుల్ (బి) షమి 76, అలీ (సి) రాహుల్ (బి) అర్షదీప్ 0, ఉతప్ప (సి) బరార్ (బి) జోర్డాన్ 2, రాయుడు (సి) అర్షదీప్ (బి) జోర్డాన్ 4, ధోని (బి) బిష్ణోరు 12, జడేజా నాటౌట్ 15, బ్రావో నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 09, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 134.
వికెట్ల పతనం : 1-18, 2-29, 3-32, 4-42, 5-61,6-128.
బౌలింగ్ : మహ్మద్ షమి 4-0-22-1, బరార్ 4-0-22-0, అర్షదీప్ 4-0-35-2, జోర్డాన్ 3-0-20-2, బిష్ణోరు 4-0-25-1, హెన్రిక్స్ 1-0-9-0.
పంజాబ్ కింగ్స్ : రాహుల్ నాటౌట్ 98, మయాంక్ (ఎల్బీ) శార్దుల్ 12, సర్ఫరాజ్ (సి) డుప్లెసిస్ (బి) శార్దుల్ 0, షారుక్ (సి) బ్రావో (బి) చాహర్ 8, మార్కరం (సి) ధోని (బి) శార్దుల్ 13, హెన్రిక్స్ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (13 ఓవర్లలో 4 వికెట్లకు) 139.
వికెట్ల పతనం : 1-46, 2-46, 3-80, 4-126.
బౌలింగ్ : దీపక్ చాహర్ 4-0-48-1, హజిల్‌వుడ్ 3-0-22-0, శార్దుల్ 3-0-28-3, జడేజా 1-0-9-0, బ్రావో 2-0-32-0.