Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 32 బంతుల్లో 84 బాదిన కిషన్
- సూర్యకుమార్ విధ్వంసక ఇన్నింగ్స్
- ముంబయి ఇండియన్స్ 235/9
ఎడారిలో తుఫాన్. పటిష్టమైన బౌలింగ్ దళమున్న సన్‌రైజర్స్‌పై యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (84, 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగుల సునామీ సృష్టించాడు. పవర్‌ప్లేలో పవర్ఫుల్ షాట్లు కొట్టిన కిషన్ కెరీర్లోనే అత్యుత్తమ ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (82, 40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) సైతం మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈ ఇద్దరు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో విశ్వరూపం చూపించటంతో ముంబయి ఇండియన్స్ ఐపీఎల్లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. 235/9తో గత ఉత్తమ స్కోరు 223/6ను అధిగమించింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కనీసం 171 పరుగుల తేడాతో గెలుపొందాల్సిన అసాధ్యమైన సమీకరణం ఎదురుండగా.. ముంబయి ఇండియన్స్ భయమెరుగని బ్యాటింగ్‌తో కదం తొక్కింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ తుఫాన్లో సన్‌రైజర్స్ బౌలర్ల గణాంకాలు కొట్టుకుపోయాయి.
కిషన్ కొట్టుడు చూడతరమా..! : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌కు ఇషాన్ కిషన్ కలల ఆరంభం అందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (18, 13 బంతుల్లో 3 ఫోర్లు) తోడుగా కిషన్ రెచ్చిపోయాడు. పవర్‌ప్లేలో బౌండరీల మోత మోగించాడు. 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 16 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. నబి అద్భుత క్యాచ్‌తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినా.. పవర్‌ప్లే (6 ఓవర్లు)లో ముంబయి 83/1తో ధనాధన్ మోత మోగించింది. ఏ బౌలర్‌ను విడిచిపెట్టని కిషన్ కళాత్మక విధ్వంసం సృష్టించాడు. ఇషాన్ జోరుతో ముంబయి పది ఓవర్లలోనే 131/3తో రికార్డు స్కోరు దిశగా సాగింది. ఉమ్రాన్ మాలిక్ ఓవర్లో కిషన్ నిష్క్రమణతో ముంబయి జోరు కాస్త తగ్గింది. హార్దిక్ పాండ్య (10), కీరన్ పొలార్డ్ (13), జేమ్స్ నీషమ్ (0), కృనాల్ పాండ్య (9), నాతన్ కౌల్టర్ నైల్ (9) నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం మరో ఎండ్‌లో అద్భుతమే చేశాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడినా..కుదురుకున్నాక అదరగొట్టాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 24 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన సూర్యకుమార్ ముంబయికి భారీ స్కోరు అందించాడు. సన్‌రైజర్స్ ఫీల్డింగ్ తడబాటు సైతం ముంబయికి కలిసొచ్చింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ (4/52) నాలుగు వికెట్లు తీసుకోగా.. రషీద్ ఖాన్ (2/40), అభిషేక్ శర్మ (2/4) రాణించారు.
ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 65 పరుగుల లోపే కట్టడి చేయాలి. 171 పరుగుల తేడాతో నెగ్గితేనే నెట్ రన్‌రేట్‌లో కోల్‌కతను వెనక్కి నెట్టి ముంబయి టాప్-4లో నిలువగలదు. సన్‌రైజర్స్ 65 పరుగుల మార్క్ దాటితే ముంబయి ఇండియన్స్ అద్వితీయ బ్యాటింగ్ ప్రదర్శన వృథా కానుంది.