Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో తెలుగు తేజం అజేయ అర్థ శతకం
- ఢిల్లీ క్యాపిటల్స్‌పై బెంగళూర్ గెలుపు
నవతెలంగాణ-దుబాయ్
తెలుగు తేజం శ్రీకర్ భరత్ (78 నాటౌట్, 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. 167 పరుగుల ఛేదనలో బెంగళూర్‌ను నడిపించిన చివరి బంతికి సూపర్ సిక్సర్‌తో ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. గ్లెన్ మాక్స్వెల్ (51 నాటౌట్, 33 బంతుల్లో 8 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీ బాదాడు. భరత్, మాక్స్వెల్ నాల్గో వికెట్‌కు 10.3 ఓవర్లలోనే 111 పరుగులు జోడించి బెంగళూర్‌ను గెలిపించారు. నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలుపుకుంది. ఆదివారం తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు యువ ఓపెనర్ పృథ్వీ షా (48, 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (43, 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 88 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ఇద్దరి మెరుపులతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 164/5 పరుగులు చేసింది. బెంగళూర్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (2/25), యుజ్వెంద్ర చాహల్ (1/34), హర్షల్ పటేల్ (1/34), డాన్ క్రిస్టియన్ (1/19) వికెట్లు తీసుకున్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీకి ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. పవర్‌ప్లేలో స్పిన్‌తో మొదలెట్టిన కోహ్లికి పృథ్వీ షా, ధావన్ పంచ్ ఇచ్చారు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో పృథ్వీ చెలరేగగా.. శిఖర్ ధావన్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో దంచికొట్టాడు. ఓపెనర్లు ఇద్దరూ పోటీపడి పరుగులు చేయటంతో 10 ఓవర్లలోనే ఢిల్లీ క్యాపిటల్స్ 88/0తో పటిష్టంగా కనిపించింది. స్వల్ప విరామంలో పృథ్వీ, ధావన్ నిష్క్రమణతో ఢిల్లీ స్కోరు వేగం నెమ్మదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ (10), శ్రేయస్ అయ్యర్ (18), షిమ్రోన్ హెట్మయర్ (29, 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఢిల్లీకి మంచి స్కోరు అందించారు. రిపాల్ పటేల్ (7 నాటౌట్) అజేయంగా నిలిచాడు.
స్కోరు వివరాలు :
ఢిల్లీ : 164/5 (పృథ్వీ షా 48, శిఖర్ ధావన్ 43, సిరాజ్ 2/25)
బెంగళూర్ : 166/3 (భరత్ 78, మాక్స్వెల్ 51, ఎన్రిచ్ 2/24)