Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ, చెన్నై తొలి క్వాలిఫయర్ నేడు
- జోరుమీదున్న క్యాపిటల్స్ శిబిరం
- గెలుపుపై నమ్మకంగా ధోనీసేన
ఐపీఎల్ 14 తుది అంకానికి చేరుకుంది. లీగ్ దశ మ్యాచులు ముగియటంతో నాకౌట్ సమరానికి తెరలేచింది. వరుసగా రెండో సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫయర్ 1 పోరుకు సిద్ధమైంది. ప్లే ఆఫ్స్‌లో అత్యంత సీనియర్ చెన్నై సూపర్‌కింగ్స్ ఓ సీజన్ విరామం అనంతరం టాప్-4లో తిరిగి అడుగుపెట్టింది. టైటిల్ పోరులో తొలి బెర్త్ కోసం నేడు చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి. వరుస విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది
నవతెలంగాణ-దుబాయ్
గురువు బోల్తాకొట్టించేందుకు శిష్యుడు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 14 ఫైనల్లోకి చేరుకునేందుకు నేడు అగ్ర జట్లు చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రంగం సిద్ధం చేసుకున్నాయి. యువ నాయకుడు రిషబ్ పంత్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ సరికొత్తగా చెలరేగుతుండగా.. దిగ్గజ నాయకుడు ఎం.ఎస్ ధోని నేతృత్వంలో చెన్నై సూపర్‌కింగ్స్ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనే చేసింది. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన ఈ రెండు జట్లు నేడు క్వాలిఫయర్ 1లో పోటీపడుతున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌తో గత నాలుగు ముఖాముఖి మ్యాచుల్లో తిరుగులేని విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ నేడు క్వాలిఫయర్1లో స్పష్టమైన ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. దుబారు వేదికగా నేడు రాత్రి 7.30 గంటలకు గురు శిష్యుల సమరం ఆరంభం.
క్యాపిటల్స్‌కు ఎదురుందా? : ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఫామ్‌లో ఉంది. వరుసగా రెండో ఏడాది ఆ జట్టు టాప్-2లో నిలిచింది. లీగ్ దశలో పది విజయాలు సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించింది. కీలక ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ గాయంతో దూరమైనా.. గెలుపు బాటలో ఇబ్బంది పడలేదు. స్టోయినిస్ ఫిట్నెస్ సాధిస్తే నేడు బరిలోకి నిలిచే అవకాశం ఉంది. పూర్తిగా స్వదేశీ ఆటగాళ్లపై ఆధారపడిన క్యాపిటల్స్ ఫైనల్స్ బెర్త్ రేసులో ఫేవరేట్. పృథ్వీ షా, శిఖర్ ధావన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆరంభంలో ఈ ఇద్దరే విలువైన పరుగులు చేస్తున్నారు. మిడిల్లో శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ రిషబ్ పంత్‌లు సహా షిమ్రోన్ హెట్మయర్ జోరు మీదున్నారు. బౌలింగ్ విభాగంలో కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్జ్టె సహా స్పిన్ ద్వయం అక్షర్, అశ్విన్‌లు ఢిల్లీ కోటను శుత్రు దుర్బేద్యంగా తయారు చేశారు. తాజా ఫామ్, సూపర్‌కింగ్స్‌పై తిరుగులేని రికార్డు క్యాపిటల్స్ శిబిరంలో రెట్టించిన ఉత్సాహం నింపుతున్నాయి. ఐపీఎల్లో తొలి టైటిల్‌పై కన్నేసిన క్యాపిటల్స్ ఆ దిశగా మరో అడుగు ముందుకేయాలని చూస్తోంది.
సూపర్‌కింగ్స్ పుంజుకునేనా? : 2020 ఐపీఎల్లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించని చెన్నై సూపర్‌కింగ్స్ ఈ ఏడాది టాప్-4లో చోటు దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. ప్రథమార్థంలో, ద్వితీయార్థంలోనూ సూపర్‌కింగ్స్ సూపర్ ప్రదర్శనతో మెప్పించింది. లీగ్ దశ చివర్లో చెన్నై అపజయాలు ధోనీసేనను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. వరుసగా రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ చేతుల్లో చెన్నై పరాజయం పాలైంది. మూడు మ్యాచుల్లో లక్ష్యాలను కాపాడుకోలేదు. రాయల్స్‌పై భారీ స్కోరును.. పంజాబ్, ఢిల్లీలతో స్వల్ప స్కోర్లను బౌలింగ్ దళం నిలుపుకోలేదు. క్వాలిఫయర్1లో సూపర్‌కింగ్స్ బౌలింగ్ విభాగంపై దృష్టి సారించనుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఎం.ఎస్ ధోని తిరిగి లోయర్ ఆర్డర్‌కు వెళ్లనున్నాడు. టాప్ ఆర్డర్లో రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ కీలకం. మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో మిడిల్ ఆర్డర్లో ప్రధాన భూమిక పోషించనున్నారు. గాయంతో లీగ్ దశ చివరి మ్యాచులకు దూరమైన సురేశ్ రైనా నేడు తిరిగి తుది జట్టులోకి రానున్నాడు. లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సూపర్‌కింగ్స్ క్వాలిఫయర్1లో ఆ వనరులను పూర్తి స్థాయిలో వాడుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఖతర్నాక్ క్యాపిటల్స్ : ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ముఖాముఖి పోరులో ధోనీసేనదే స్పష్టమైన పైచేయి. కానీ ఇటీవల సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాకు చెన్నై విలవిల్లాడింది. చివరగా 2019 సీజన్లో ఢిల్లీపై చెన్నై గెలుపొందింది. 2020 సీజన్లో చెన్నైని రెండు మ్యాచుల్లోనూ ఓడించిన ఢిల్లీ.. తాజా సీజన్లోనూ లీగ్ దశలో రెండు మ్యాచుల్లో విజయాలు నమోదు చేసింది. క్వాలిఫయర్‌కు ముందు క్యాపిటల్స్‌కు ఇది అతిపెద్ద సానుకూలత. అయితే, ప్లే ఆఫ్స్‌లో రికార్డు మళ్లీ సూపర్‌కింగ్స్‌కు అనుకూలం. ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్/సెమీఫైనల్లో రెండు సార్లు తలపడగా.. ఈ రెండింటా సూపర్‌కింగ్స్ పైచేయి సాధించింది. ప్లే ఆఫ్స్‌లో ఆడిన అనుభవం చెన్నైకి నేడు ఉపయుక్తం అవనుంది.
పిచ్, వాతావరణం : టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో యుఏఈ పిచ్‌లు ఐపీఎల్ సీజన్‌కు కాస్త భిన్నంగా స్పందించాయి. వరల్డ్‌కప్‌కు పోటీతత్వ వికెట్లను అందించే ప్రణాళికలో భాగంగా ఐపీఎల్లో నెమ్మదైన పిచ్‌లు చూశాం. అయితే, చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో పిచ్ స్వభావంతో నిమిత్తం లేకుండా పరుగుల వరద పారించవచ్చని రాయల్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ నిరూపించాయి. దుబారులో 170-180 పరుగులు మంచి స్కోరు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌కు మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, మోయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ఎం.ఎస్ ధోని (కెప్టెన్, వికెట్‌కీపర్), దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, జోశ్ హజిల్‌వుడ్.
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్‌కీపర్), షిమ్రోన్ హెట్మయర్, రిపాల్ పటేల్/మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్, ఎన్రిచ్ నోర్ట్జె.
ఐపీఎల్లో నేడు క్వాలిఫయర్ 1
చెన్నై X ఢిల్లీ
వేదిక : దుబాయ్, సమయం : రాత్రి: 7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..