Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూర్, కోల్‌కత ఎలిమినేటర్ నేడు
- విజయంపై దీమాగా విరాట్గ్యాంగ్
ఐపీఎల్14 రేసులో ఇప్పటికే నాలుగు జట్లు నిష్క్రమించాయి. ఇప్పుడు తాజాగా మరో జట్టు పోటీ నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, కోల్‌కత నైట్‌రైడర్స్‌లు నేడు ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి. ఎలిమినేటర్‌లో విజయంతో టైటిల్ రేసులో నిలిచేందుకు విరాట్ కోహ్లి, ఇయాన్ మోర్గాన్‌లు అన్ని అస్త్రాలు ప్రయోగించనున్నారు. నేడు రాత్రి 7.30 గంటలకు బెంగళూర్, కోల్‌కత ఎలిమినేటర్ పోరు ఆరంభం.
నవతెలంగాణ-షార్జా
రెండుసార్లు చాంపియన్ ఒకవైపు. తొలి సారి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న జట్టు మరోవైపు. ఈ రెండు జట్లు నేడు ఐపీఎల్ 14 ఎలిమినేటర్‌లో ముఖాముఖికి రంగం సిద్ధం చేసుకున్నాయి. మాజీ చాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్ టాప్-4లో చివరి స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. చెన్నైతో సమానంగా విజయాలు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పరీక్షకు సై అంటోంది. లీగ్ దశ ప్రదర్శన, ఫలితాలతో సంబంధం లేకుండా ప్రస్తుతం రెండు జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. క్వాలిఫయర్2 బెర్త్ కోసం కోహ్లి, మోర్గాన్ పట్టుదలగా కనిపిస్తున్నారు.
కొత్త ఉత్సాహం : ప్రథమార్థంలో కనిపించిన దూకుడు యుఏఈలో బెంగళూర్ చూపించలేదు. అయినా, చివరి దశలో కోహ్లి జట్టు గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది. ఓటమి తప్పదనుకునే మ్యాచులను గెలిచిన చరిత్ర ఆ జట్టుకు పెద్దగా లేదు. తెలుగు తేజం, యువ బ్యాటర్ శ్రీకర్ భరత్, గ్లెన్ మాక్స్వెల్ చివరి మ్యాచ్‌లో కొత్త ఒరవడి సృష్టించారు. ఈ ఇద్దరి జోరుతో ఢిల్లీపై బెంగళూర్ అదిరే విజయం సాధించింది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న బెంగళూర్ నేడు ఎలిమినేటర్‌కు రెట్టించిన ఊపుతో బరిలోకి దిగనుంది. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లి ఫామ్ ఆ జట్టుకు ఆందోళనగా మారింది. కోహ్లిలో క్రీజులో నిలిచినా వేగంగా పరుగులు చేయటం లేదు. దేవదత్ పడిక్కల్, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్‌లకు తోడు శ్రీకర్ భరత్ బ్యాటింగ్ లైనప్‌కు అదనపు బలం తీసుకొచ్చాడు. మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్, పేస్ సంచలనం మహ్మద్ సిరాజ్‌లు బంతితో బెంగళూర్ అస్త్రాలు. కోల్కతతో చివరి ఐదు మ్యాచుల్లో ఏకంగా నాలుగింట విజయాలు సాధించిన బెంగళూర్.. నేడూ నైట్‌రైడర్స్‌పై రైడ్‌కు సిద్ధమవుతోంది.
మెరుస్తారా? : అతికష్టంగా, ఎన్నో సమీకరణాల నడుమ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్ ఇంకా కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతోంది. చివరాగా రాజస్థాన్ రాయల్స్‌పై తిరుగులేని ప్రదర్శనతో కోల్‌కత శిబిరంలో నూతన ఉత్సాహం నిండింది. యువ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్లు ఆరంభంలో గొప్పగా ఆడుతున్నారు. కానీ మిడిల్ ఆర్డర్లో దినేశ్ కార్తీక్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నుంచి సహకారం లభించటం లేదు. నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి నిలకడగా రాణించటం లేదు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బ్యాటింగ్ లైనప్ సమిష్టిగా రాణించటం కీలకం. బంగ్లా ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్, కరీబియన్ స్పిన్నర్ సునీల్ నరైన్‌లు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చే అవకాశం లేకపోలేదు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, శివం మావి, లాకీ ఫెర్గుసన్, సునీల్ నరైన్‌లు కోల్‌కతను నడిపించనున్నారు.
పిచ్ రిపోర్టు : గత ఐపీఎల్ సీజన్లో అత్యధిక స్కోర్లు నమోదైన వేదిక షార్జా. అందుకు పూర్తి భిన్నంగా ఈ సీజన్లో అత్యల్ప స్కోర్లు నమోదు అవుతున్న వేదికగా షార్జా నిలిచింది. ఇక్కడ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కోల్‌కత పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా భారీ స్కోరు సాధించింది. నేటి మ్యాచ్‌కు పిచ్‌లో ఎటువంటి మార్పు లేకపోయినా.. ఇరు జట్ల వ్యూహాలు, ప్రణాళికల ఆధారంగా స్కోరు వేగంలో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా) :
బెంగళూర్ : విరాట్ కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, డాన్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, యుజ్వెంద్ర చాహల్.
కోల్‌కత : శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షకిబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గుసన్, వరుణ్ చక్రవర్తి, శివం మావి.
ఎలిమినేటర్
బెంగళూర్ x కోల్‌కత
వేదిక : షార్జా
సమయం : రాత్రి 7.30
స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..