Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో రుతురాజ్, ఉతప్ప జోరు
- ముగింపులో ధోని అపూర్వ ఇన్నింగ్స్
- క్వాలిఫయర్1లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి
ఐపీఎల్ 14 ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్ అడుగు పడింది. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ధోనీసేన ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఉత్కంఠ క్వాలిఫయర్1లో ఎం.ఎస్ ధోని (18 నాటౌట్, 6 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అద్వితీయ ప్రదర్శనతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్ (70), రాబిన్ ఉతప్ప (63) అర్థ సెంచరీలతో 173 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలోనే ఊదేసింది.
నవతెలంగాణ-దుబాయ్
చెన్నై విజయానికి 5 బంతుల్లో 13 పరుగులు అవసరం. బంతి టామ్ కరన్ చేతిలో, క్రీజులో ఎం.ఎస్ ధోని. సూపర్‌కింగ్స్ 'తలా' తాజా ఫామ్‌తో ఢిల్లీకే మొగ్గు కనిపించింది. అందరినీ ఆశ్చపరుస్తూ ఛేదనలో జడేజాను వెనక్కి నెట్టి ముందుకొచ్చిన ధోనీ అభిమానులకు గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో పాటు చెన్నై సూపర్‌కింగ్స్‌ను రికార్డు స్థాయిలో 9వ సారి ఐపీఎల్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. టామ్ కరన్‌పై ఎక్స్ట్రా కవర్, బిహైండ్ ది వికెట్, డీప్ స్క్వేర్ లెగ్ దిశగా హ్యాట్రిక్ బౌండరీలు బాదిన మహి మరో రెండు బంతులు ఉండగానే చెన్నైకి 4 వికెట్ల తేడాతో విజయాన్ని కట్టబెట్టాడు. ఛేదనలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (70, 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాబిన్ ఉతప్ప (63, 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. రెండో వికెట్‌కు ఈ జోడీ 110 పరుగులు జోడించింది. వరుస వికెట్లతో చివరి ఓవర్లలో మ్యాచ్‌పై పట్టు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ధోని నిరాశే మిగిల్చాడు. మోయిన్ అలీ (16, 12 బంతుల్లో 2 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. పృథ్వీ షా (60, 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రిషబ్ పంత్ (51 నాటౌట్, 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలకు తోడు షిమ్రోన్ హెట్మయర్ (37, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 172/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోల్‌కత, బెంగళూర్ ఎలిమినేటర్ విజేతతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది.
పృథీ, పంత్ మెరుపుల్ : యువ బ్యాటర్ పృథ్వీ షా (60, 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దుబారులో దుమ్మురేపాడు. చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన పృథ్వీ షా 27 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగిన ఢిల్లీ ఓపెనర్ పవర్‌ప్లేలో క్యాపిటల్స్‌కు అదిరే ఆరంభం అందించాడు. ఆరంభంలో పృథ్వీ షా హీరోయిక్స్.. చివర్లో రిషబ్ పంత్ (51 నాటౌట్, 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్ దుబారు పిచ్‌పై ఛేదనకు మొగ్గుచూపింది. పృథ్వీ షా చెలరేగినా.. మరో ఎండ్‌లో అతడికి సహకారం దక్కలేదు. శిఖర్ ధావన్ (7), శ్రేయస్ అయ్యర్ (1), అక్షర్ పటేల్ (10) విఫలమయ్యారు. దీంతో పృథ్వీ ఒక్కడే తొలి పది ఓవర్లలో చెన్నై పని పట్టాడు. కీలక వికెట్లు కోల్పోవటం, లోయర్ ఆర్డర్లో బ్యాటర్లు లేకపోవటంతో రిషబ్ పంత్, షిమ్రోన్ హెట్మయర్ (37, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా ఆడారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 83 పరుగులు జోడించింది. శార్దుల్ ఠాకూర్ స్లో బౌన్సర్‌ను పంత్ సిక్సర్‌గా మలిచి అలరించాడు. చివరి ఓవర్లో శార్దుల్ ఠాకూర్ పరుగుల కట్టడితో ఢిల్లీ 172 పరుగులే చేసింది. చివరి మూడు బంతుల్లో 4, 2, 2తో పంత్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూపర్‌కింగ్స్ బౌలర్లలో జోశ్ హజిల్‌వుడ్ (2/29) రెండు వికెట్లు తీసుకోగా.. రవీంద్ర జడేజా (1/23), మోయిన్ అలీ (1/27), డ్వేన్ బ్రావో (1/31) రాణించారు.
స్కోరు వివరాలు :
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా (సి) డుప్లెసిస్ (బి) జడేజా 60, ధావన్ (సి) ధోని (బి) హజిల్‌వుడ్ 7, శ్రేయస్ (సి) రుతురాజ్ (బి) హజిల్‌వుడ్ 1, అక్షర్ పటేల్ (సి) శాంట్నర్ (బి)అలీ 10, పంత్ నాటౌట్ 51, హెట్మయర్ (సి) జడేజా (బి) బ్రావో 37, కరన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు :06, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172.
వికెట్ల పతనం : 1-36, 2-50, 3-77, 4-80, 5-163.
బౌలింగ్ : చాహర్ 3-0-26-0, హజిల్‌వుడ్ 4-0-29-2, శార్దుల్ 3-0-36-0, జడేజా 3-0-23-1, మోయిన్ అలీ 4-0-27-1, బ్రావో 3-0-31-1.
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ (సి) అక్షర్ (బి) అవేశ్ 70, డుప్లెసిస్ (బి) నోర్జ్జె 1, ఉతప్ప (సి) అయ్యర్ (బి) కరన్ 63, శార్దుల్ (సి) అయ్యర్ (బి) కరన్ 0, రాయుడు రనౌట్ 1, అలీ (సి) రబాడ (బి) కరన్ 16, ధోని నాటౌట్ 18, జడేజా నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం :(19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 173.
వికెట్ల పతనం : 1-3, 2-113, 3-117, 4-119, 5-149, 6-160
బౌలింగ్ : ఎన్రిచ్ నోర్ట్జె 4-0-31-1, అవేశ్ ఖాన్ 4-0-47-1, కగిసో రబాడ 3-0-23-0, అక్షర్ పటేల్ 3-0-23-0, టామ్ కరన్ 3.4-0-29-3, అశ్విన్ 2-0-19-0.