Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి
ముంబయి : ప్రతిభాన్వేషణ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల తయారీకి ప్రామాణిక వ్యవస్థ లేకుండా అద్భుతాలు ఆశిస్తే ఎలా అని భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి అన్నారు. మరో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌తో కలిసి ఓ చర్చ వేదికలో పాల్గొన్న భూపతి ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) వ్యవస్థపై స్పందించాడు. ' క్రీడాకారులు అందరం ఏదో ఒక ఈకోసిస్టం సాయం పొందాం. అమృత్‌రాజ్ టెన్నిస్ అకాడమీ లియాండర్ పేస్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది. జీవీకే ఇండిస్టీస్ సానియా మీర్జాకు 10 ఏండ్ల వయసు నుంచే మద్దతుగా నిలిచారు. ఇవన్నీ అద్భుతాలు. సంస్థాగత వ్యవస్థ లేకుండా అద్భుతాలు ఆశిస్తే ఏం అవుతుంది? కేవలం అద్భుతాలు మాత్రమే జరుగుతాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పది మంది ఫ్రెంచ్ ఆటగాళ్లు, పది మంది స్పెయిన్ ఆటగాళ్లు, పది మంది అమెరికన్ ఆటగాళ్లు ఉన్నారంటే అక్కడి వ్యవస్థ కారణం. మనకు అటువంటి వ్యవస్థ లేదు. అసలు వ్యవస్థ ఏర్పాటు చేయకుండా.. వ్యవస్థ మద్దతు లేకపోయినా గొప్పగా ఎదిగారనే ప్రశంస మంచిది కాదని నా అభిప్రాయం. సరైన వ్యవస్థ లేకపోవటంతోనే ఈ రోజు వర్థమాన క్రీడాకారులు రావటం లేదు. ఎవరైనా ఎలా రాణించగలరు?' అని మహేశ్ భూపతి అన్నారు.