Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్ఐహెచ్ సీఈఓ థియరీ వేల్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక పురస్కారాలను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేయటంతో ఒలింపిక్ చాంపియన్ బెల్జియం అవార్డుల ఎంపిక ప్రక్రియపై నిరసన గళం వినిపిస్తోంది. జాతీయ జట్ల కోచ్‌లు, కెప్టెన్ల ఓట్లకు 50 శాతం ప్రాధాన్యత.. అభిమానులు, ఆటగాళ్ల ఓట్లకు 25 శాతం ప్రాధాన్యత, మీడియా ఓట్లకు 25 శాతం ప్రాధాన్యత ఇస్తూ సాగిన ఓటింగ్ ప్రక్రియలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత్ అవార్డులను స్వీప్ చేసింది. భారత డ్రాగ్ ఫ్లికర్లు హర్మన్‌ప్రీత్ సింగ్, గుర్జత్ కౌర్ (మహిళలు) ఈ ఏడాది ఉత్తమ ఆటగాళ్ల అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గోల్ కీపర్లు పీఆర్ శ్రీజేష్, సవిత పూనియాలు ఉత్తమ గోల్‌కీపర్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అవార్డు ఎంపిక ప్రక్రియను సమీక్షిస్తామని చెప్పిన ఎఫ్ఐహెచ్ సీఈఓ థియరీ వేల్..ప్రక్రియ మారినా ఈ ఏడాది అవార్డు విజేతల్లో మార్పు ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ' అభిమానులు, ఆటగాళ్లలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటమే అంతిమంగా ఎఫ్ఐహెచ్ వ్యూహం. తమ అభిప్రాయాలను పంచుకునేందుకు అభిమానులకు ఓ అవకాశం ఇవ్వటం అవసరం. ప్రస్తుత ప్రక్రియ సరైనదా, కాదా అనే అంశంతో సంబంధం లేకుండా సమీక్ష చేస్తాం. అభిమానులకు ఓటింగ్ అవకాశం లేకపోయినా ఈ ఏడాది అవార్డు విజేతల్లో ఎటువంటి మార్పు ఉండేది కాదు' అని వేల్ అన్నారు.