Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ హీరోయిక్స్
- ఎలిమినేటర్‌లో బెంగళూర్‌పై గెలుపు
- క్వాలిఫయర్2కు కోల్‌కత నైట్‌రైడర్స్
బెంగళూర్ కథ ముగిసింది. ఐపీఎల్ టైటిల్ కల తీరకుండానే బెంగళూర్‌లో విరాట్ కోహ్లి కెప్టెన్సీ శకానికి తెరపడింది. ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్‌లో బెంగళూర్‌పై కోల్‌కత నైట్‌రైడర్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సునీల్ నరైన్ (4/21, 26 రన్స్) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగాడు. ఫైనల్లో బెర్త్ కోసం బుధవారం క్వాలిఫయర్2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కత తలపడనుంది.
నవతెలంగాణ-షార్జా
స్పిన్నర్ సునీల్ నరైన్ (4/21, 26 రన్స్) ఆల్‌రౌండ్ హీరోయిక్స్‌తో కోల్‌కత నైట్‌రైడర్స్ క్వాలిఫయర్2కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన కోల్‌కత నైట్‌రైడర్స్ మూడో ఐపీఎల్ టైటిల్ రేసులో అవకాశాలను మెరుగు పర్చుకుంది. ఐపీఎల్లో తొలి టైటిల్‌పై కన్నేసిన బెంగళూర్ పోరాటానికి ఎలిమినేటర్‌తోనే తెరపడింది. ఐపీఎల్లో విరాట్ కోహ్లి కెప్టెన్సీ శకం టైటిల్ లేకుండానే ముగిసింది!. ఛేదనలో శుభ్‌మన్ గిల్ (29, 18 బంతుల్లో 4 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (26, 30 బంతుల్లో 1 సిక్స్) గట్టి పునాది వేయగా.. పించ్ హిట్టర్ సునీల్ నరైన్ (26, 15 బంతుల్లో 3 సిక్స్‌లు) వస్తూనే హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ను కోల్‌కత వైపు తిప్పాడు. ఆఖర్లో చాహల్, సిరాజ్ వికెట్ల వేటతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. ఆఖరు ఓవర్లో ఏడు పరుగులు అవసరం కాగా మరో రెండు బంతులు ఉండగానే షకిబ్ (9), మోర్గాన్ (5) లాంఛనం ముగించారు. కెప్టెన్ విరాట్ కోహ్లి (39, 33 బంతుల్లో 5 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (21, 18 బంతుల్లో 2 ఫోర్లు) రాణించటంతో 88/2తో భారీ స్కోరు దిశగా దూసుకెళ్లిన బెంగళూర్‌కు సునీల్ నరైన్ బ్రేక్ వేశాడు. ఏబీ డివిలియర్స్ (11), గ్లెన్ మాక్స్వెల్ (15), శ్రీకర్ భరత్ (9), విరాట్ కోహ్లి వికెట్లతో బెంగళూర్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు నరైన్. పేసర్ లాకీ ఫెర్గుసన్ (2/30) సైతం రాణించటంతో తొలుత బెంగళూర్ 138/7 పరుగులే చేసింది.
ఓపెనర్లు మెరిసినా.. : స్వల్ప స్కోర్లు నమోదవుతున్న షార్జాలో టాస్ నెగ్గిన విరాట్ కోహ్లి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ నెగ్గితే బౌలింగ్ ఎంచుకునేవాడినని కోల్‌కత కెప్టెన్ మోర్గాన్ వ్యాఖ్యానించటంతో పిచ్‌పై చర్చ అప్పుడే మొదలైంది!. దేవదత్ పడక్కిల్ (21, 18 బంతుల్లో 2 ఫోర్లు), విరాట్ కోహ్లి (39, 33 బంతుల్లో 5 ఫోర్లు) పవర్‌ప్లేలో బెంగళూర్‌కు అదిరే ఆరంభం అందించారు. కోహ్లి, పడిక్కల్ బౌండరీలతో కదం తొక్కారు. పవర్‌ప్లేలో పడిక్కల్‌ను కోల్పోయినా, బెంగళూర్ 53/1తో పటిష్ట స్థితిలో నిలిచింది.
మాయజాలం : ఫీల్డింగ్ నిబంధనలతో పాటు బెంగళూర్ ఆటలోనూ మార్పు వచ్చింది. పవర్‌ప్లేలో గొప్పగా రాణించిన బెంగళూర్ ఆ తర్వాత పరుగుల కోసం చెమటోడ్చింది. ఫామ్‌లో ఉన్న తెలుగు తేజం శ్రీకర్ భరత్ (9, 16 బంతుల్లో) అంచనాలు అందుకోలేదు. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బెంగళూర్ ఇన్నింగ్స్‌ను కుదేల్ చేశాడు. తొలుత భరత్‌ను వెనక్కి పంపిన నరైన్.. కీలక బ్యాటర్లు ఏబీ డివిలియర్స్ (11), గ్లెన్ మాక్స్వెల్ (15)తో పాటు విరాట్ కోహ్లి (39) ఇన్నింగ్స్‌నూ ముగించాడు. నలుగురు కీలక బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన సునీల్ నరైన్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. పేసర్ లాకీ ఫెర్గుసన్ (2/30) సైతం నరైన్‌కు తోడవటంతో బెంగళూర్ విలవిల్లాడింది. చివర్లో విలువైన పరుగులు జోడించిన షాబాజ్ అహ్మద్ (13) సహా ఓపెనర్ పడిక్కల్ వికెట్లను ఫెర్గుసన్ తన ఖాతాలో వేసుకున్నాడు. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన బెంగళూర్ 138 పరుగులు చేసింది. షార్జా పిచ్‌పై కీలక పాత్ర పోషిస్తాడనుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (0/20)కి వికెట్లు దక్కలేదు.
స్కోరు వివరాలు
బెంగళూర్ ఇన్నింగ్స్ : పడిక్కల్ (బి) ఫెర్గుసన్ 21, కోహ్లి (బి) నరైన్ 39, భరత్ (సి) అయ్యర్ (బి) నరైన్ 9, మాక్స్వెల్ (సి) ఫెర్గుసన్ (బి) నరైన్ 15, డివిలియర్స్ (బి) నరైన్ 11, షాబాజ్ (సి) మావి (బి) ఫెర్గుసన్ 13, క్రిస్టియన్ రనౌట్ 9, హర్షల్ నాటౌట్ 8, గార్టన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు :13, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 138.
వికెట్ల పతనం : 1-49, 2-69, 3-88, 4-102, 5-112, 6-126, 7-134.
బౌలింగ్ : షకిబ్ 4-0-24-0, శివం 4-0-36-0, వరుణ్ 4-0-20-0, ఫెర్గుసన్ 4-0-30-2, నరైన్ 4-0-21-4.
కోల్‌కత ఇన్నింగ్స్ : గిల్ (సి) ఏబీ (బి) హర్షల్ 29, అయ్యర్ (సి) భరత్ (బి) హర్షల్ 26, త్రిపాఠి (ఎల్బీ) చాహల్ 6, రానా (సి) ఏబీ (బి) చాహల్ 23, నరైన్ (బి) సిరాజ్ 26, కార్తీక్ (సి) భరత్ (బి)సిరాజ్ 10, మోర్గాన్ నాటౌట్ 5, షకిబ్ నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం :(19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 139.
వికెట్ల పతనం : 1-41, 2-53, 3-79, 4-110, 5-125, 6-126.
బౌలింగ్ : సిరాజ్ 4-0-19-2, గార్టన్ 3-0-29-0, హర్షల్ 4-0-19-2, చాహల్ 4-0-16-2, మాక్స్వెల్ 3-0-25-0, క్రిస్టియన్ 1.4-0-29-0.