Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వాలిఫయర్-2లో ఢిల్లీపై ఉత్కంఠ విజయం
- ఛేదనలో వెంటకటేశ్, శుభ్‌మన్ ధనాధన్
- రిషబ్‌పంత్ సేనకు తప్పని భంగపాటు
నవతెలంగాణ-షార్జా
కోల్‌కత నైట్‌రైడర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించిన కోల్‌కత నైట్‌రైడర్స్ ముచ్చటగా మూడోసారి టైటిల్ పోరుకు చేరుకుంది. 2012, 2014 చాంపియన్‌గా నిలిచిన కోల్‌కత.. తర్వాత వరుస సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరినా ఎన్నడూ తుది పోరులో అడుగుమోపలేదు. బుధవారం నాటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఫేవరేట్ ఢిల్లీని చిత్తు చేసిన మోర్గాన్‌సేన శుక్రవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. 136 పరుగుల ఛేదనలో కోల్‌కత నైట్‌రైడర్స్‌కు అద్భుత ఆరంభం లభించింది. యువ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (55, 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (46, 46 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) తొలి వికెట్‌కు 12.2 ఓవర్లలో 96 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. ఓపెనర్ల మెరుపులతో కోల్‌కత గెలుపు లాంఛనం చేసుకుంది. ఓపెనర్లు సహా నితీశ్ రానా (13), దినేశ్ కార్తీక్ (0) నిష్క్రమించటంతో ఆఖర్లో కోల్‌కత కాస్త ఒత్తిడి చవిచూసింది. చివరి మూడు ఓవర్లలో కగిసో రబాడ, ఎన్రిచ్ నోక్యా, అశ్విన్‌లు ఢిల్లీని రేసులోకి తీసుకొచ్చారు. ఇయాన్ మోర్గాన్ (0), షకిబ్ అల్ హసన్ (0), సునీల్ నరైన్ (0) వచ్చీ రాగానే డకౌట్ అయ్యారు. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన తరుణంలో రాహుల్ త్రిపాఠి (12 నాటౌట్, 11 బంతుల్లో 1 సిక్స్) అశ్విన్ ఓవర్లో సిక్సర్ బాది కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఫైనల్లోకి తీసుకెళ్లాడు. ఢిల్లీ బౌలర్లలో ఎన్రిచ్ నోక్యా (2/31), అశ్విన్ (2/27), రబాడ (2/23) రాణించారు. అంతకముందు, శ్రేయస్ అయ్యర్ (30 నాటౌట్, 27 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), షిమ్రోన్ హెట్మయర్ (17, 10 బంతుల్లో 2 సిక్స్‌లు) సహా శిఖర్ ధావన్ (36, 39 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 135/5 పరుగులు చేసింది. కోల్‌కత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (2/26), శివం మావి (1/27), లాకీ ఫెర్గుసన్ (1/26) ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయటంలో సఫలమయ్యారు.
బ్యాటర్ల తడబాటు : షార్జా పిచ్‌కు అలవాటు పడిన కోల్‌కత నైట్‌రైడర్స్ మరోసారి టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలింగ్ అనుకూల పిచ్‌పై ఢిల్లీ బ్యాటర్లు పరుగుల వేటలో ఇక్కట్లు పడ్డారు. శిఖర్ ధావన్ (36) తొలి ఏడు బంతులకు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. పృథ్వీ షా (18, 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) సహజ శైలిలో రెచ్చిపోయాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కాడు. పవర్‌ప్లేలో సునీల్ నరైన్ ఓవర్లో వరుస సిక్సర్లు బాదిన శిఖర్ ధావన్ జోరందుకున్నాడు. వరుణ్ చక్రవర్తి మాయకు పృథ్వీ షా తలొగ్గటంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు వేగం నెమ్మదించింది. గాయం నుంచి కోలుకుని తుది జట్టులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ (18, 23 బంతుల్లో 1 ఫోర్) క్రీజులో సౌకర్యవంతంగా కనిపించలేదు. పవర్‌ప్లేలో 38/1తో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత ఎక్కడా ఇన్నింగ్స్‌కు వేగం తీసుకు రాలేకపోయింది. క్రీజులో నిలదొక్కుకున్న శిఖర్ ధావన్ సైతం వేగంగా పరుగులు చేయలేదు. స్టోయినిస్, ధావన్ నిష్క్రమణ అనంతరం ఢిల్లీ స్కోరు మరింత నెమ్మదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ (6, 6 బంతుల్లో 1 ఫోర్) కీలక మ్యాచ్‌లో విఫలమయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ వంద పరుగులు దాటడం సైతం గగనమే అనిపించిన తరుణంలో శ్రేయస్ అయ్యర్ (30 నాటౌట్, 27 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), షిమ్రోన్ హెట్మయర్ (17, 10 బంతుల్లో 2 సిక్స్‌లు) గౌరవప్రద స్కోరు అందించారు. ఆరంభంలో అయ్యర్ సైతం ఇబ్బంది పడ్డాడు. హెట్మయర్ రెండు భారీ సిక్సర్లతో ధనాధన్ ఊపు తీసుకొచ్చినా..పరుగుల ఒత్తిడికి లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌గా నిష్క్రమించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఓ ఫోర్, సిక్సర్ బాదిన అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు 135 పరుగుల పొరాడగలిగే స్కోరు సాధించాడు. కోల్‌కత నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలర్లను గొప్పగా వినియోగించుకున్నాడు. స్పిన్నర్ల స్వర్గధామం షార్జాలో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, షకిబ్ అల్ హసన్‌లను ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రణాళిక ప్రకారం ప్రయోగించి రన్‌రేట్‌ను నియంత్రణలో ఉంచుకున్నాడు.
స్కోరు వివరాలు :
ఢిల్లీ ఇన్నింగ్స్ : పృథ్వీ షా (ఎల్బీ) వరుణ్ 18, శిఖర్ ధావన్ (సి) షకిబ్ (బి) వరుణ్ 36, స్టోయినిస్ (బి) శివం మావి 18, శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 30, రిషబ్ పంత్ (సి) త్రిపాఠి (బి) ఫెర్గుసన్ 6, హెట్మయర్ రనౌట్ 17, అక్షర్ పటేల్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 135.
వికెట్ల పతనం : 1-32, 2-71, 3-83, 4-90, 5-117.
బౌలింగ్ : షకిబ్ అల్ హసన్ 4-0-28-0, లాకీ ఫెర్గుసన్ 4-0-26-1, సునీల్ నరైన్ 4-0-27-0, వరుణ్ చక్రవర్తి 4-0-26-2, శివం మావి 4-0-27-1.
కోల్‌కత ఇన్నింగ్స్ : గిల్ (సి) పంత్ (బి) అవేశ్ 46, అయ్యర్ (సి) స్మిత్ (బి) రబాడ 55, రానా (సి) హెట్మయర్ (బి) నోక్యా 13, త్రిపాఠి నాటౌట్ 12, కార్తీక్ (బి) రబాడ 0, మోర్గాన్ (బి) నోక్యా 0, షకిబ్ (ఎల్బీ) అశ్విన్ 0, నరైన్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 0, ఫెర్గుసన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం :(19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 136.
వికెట్ల పతనం : 1-96, 2-123, 3-125, 4-126, 5-129, 6-130, 7-130.
బౌలింగ్ : నోక్యా 4-0-31-2, అశ్విన్ 3.5-0-27-2, అవేశ్ 4-0-22-1, అక్షర్ 4-0-32-0, రబాడ 4-0-23-2.