Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్ సిరీస్‌పై బోర్డు యోచన
- సీనియర్ క్రికెటర్లు అందరికీ విశ్రాంతి!
ముంబయి : జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్, భారత అండర్-19, భారత్-ఏ జట్ల చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి సీనియర్ జట్టుకు చీఫ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌తో సమాంతరంగా సాగిన శ్రీలంక పర్యటనలో వైట్‌బాల్ ఫార్మాట్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బంది పదవీ కాలం 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. నూతన చీఫ్ కోచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. అయినా, కావాలనే ఆ ప్రక్రియను జాప్యం చేస్తోందని సమాచారం. ఆస్ట్రేలియాకు చెందిన కొంత మంది కోచ్‌లు భారత చీఫ్ కోచ్‌గా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ స్వదేశీ కోచ్‌లను నియమించేందుకు బీసీసీఐ పెద్దలు ఆసక్తిగా ఉన్నారు. రాహుల్ ద్రవిడ్‌ను పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించాలని కోరినా.. కుటుంబాన్ని విడిచి జట్టుతో పాటు సుదీర్ఘ పర్యటనలకు విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ పేర్లు సైతం వినిపిస్తోన్నా ఎటువంటి స్పష్టత లేకుండా పోయింది. అక్టోబర్ 14న టీ20 ప్రపంచకప్ ముగియనుండగా.. అక్టోబర్ 17 నుంచి భారత్, న్యూజిలాండ్ సిరీస్ ఆరంభం అవనుంది. అక్టోబర్ 17, 19, 21న టీ20 సిరీస్ జరుగనుంది. ఆ తర్వాత రెండు టెస్టుల సిరీస్ షెడ్యూల్ చేశారు. తదుపరి చీఫ్ కోచ్ ఎంపిక ఆలస్యం కానుండటంతో, ఈ సిరీస్ కోసం రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించనున్నారని సమాచారం.
సీనియర్లకు విశ్రాంతి : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం బయో బబుల్‌లోకి ప్రవేశించిన భారత క్రికెటర్లు.. అప్పట్నుంచి సుదీర్ఘంగా బుడగలోనే ఉంటున్నారు. దీంతో సీనియర్ క్రికెటర్లకు కాస్త విరామం, కుటుంబంతో గడిపే సమయం ఇవ్వటం కోసం కివీస్‌తో టీ20 సిరీస్‌కు యువ జట్టును ఎంపిక చేయనున్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సహా బుమ్రా, షమి, జడేజాలు విశ్రాంతి తీసుకోనున్నారు. కెఎల్ రాహుల్‌కు టీ20 కెప్టెన్సీ అప్పగించే అవకాశం కనిపిస్తోంది. టెస్టు సిరీస్‌కు పూర్తి స్థాయి జట్టును ఎంపిక చేయనున్నారని బోర్డు వర్గాల సమాచారం.