Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాల్గో టైటిల్‌పై సూపర్‌కింగ్స్ గురి
- మూడో ట్రోఫీపై నైట్‌రైడర్స్ కన్ను
- ఐపీఎల్ 14 ఫైనల్ పోరు నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఐపీఎల్ టైటిల్ వేటలో మాజీ చాంపియన్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మూడుసార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, రెండు సార్లు చాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్ నేడు దసరా ధమాకాలో తఢాకా చూపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఎం.ఎస్ ధోని సారథ్య బలంతో చెన్నై సూపర్‌కింగ్స్ నాల్గో టైటిల్ రేసులో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. యుఏఈలో అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్‌కత నైట్‌రైడర్స్ మూడో టైటిల్‌పై దీమాగా కనిపిస్తోంది. చెన్నై, కోల్‌కతలు ఫైనల్లో ఢకొీట్టనుండటంతో ఈ సీజన్లోనూ కొత్త చాంపియన్‌ను చూడలేము. ఐపీఎల్ 14 మెగా ఫైనల్ నేడు దుబారులో రాత్రి 7.30 గంటలకు ఆరంభం.
నవతెలంగాణ-దుబాయ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 తుది ఘట్టానికి చేరుకుంది. రెండు దఫాలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్ 14 నేడు మెగా ఫైనల్‌కు ముస్తాబైంది. వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు దుబారు (యుఏఈ)లో సర్వం సిద్ధమైంది. అన్ని విభాగాల్లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెన్నై సూపర్‌కింగ్స్ ఫైనల్‌కు ఉత్సాహంగా రెఢ అవుతుండగా.. టాప్ ఆర్డర్, స్పిన్నర్ల అండతో కోల్‌కత నైట్‌రైడర్స్ నేడు మెగా ఫైట్‌కు వస్తోంది. ఈ సీజన్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై రెండు సార్లు విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో చెన్నై సూపర్‌కింగ్స్ నేడు టైటిల్ పోరులో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
మహిమ చూపిస్తాడా? : ఈ సీజన్లో ఎం.ఎస్ ధోని నాయకుడిగా సక్సెస్ సాధించినా, బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో విపరీతి ఒత్తిడి నడుమ క్రీజులోకి వచ్చిన ధోని పూర్వ వైభవం చూపించాడు. బౌండరీల ధనాధన్‌తో గొప్పగా మ్యాచ్‌ను ముగించాడు. ఐపీఎల్లో ధోనికి ఇదే చివరి సీజన్ కానుందనే అంచనాల నేపథ్యంలో మహి ముగింపు మహిమ చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, అంబటి రాయుడు, మోయిన్ అలీలకు తోడు రాబిన్ ఉతప్ప సైతం ఫామ్‌లోకి వచ్చాడు. లోయర్ ఆర్డర్లో రవీంద్ర జడేజా, ఎం.ఎస్ ధోని, డ్వేన్ బ్రావోలు టచ్‌లోకి వచ్చారు. టెయిలెండర్లు దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్లు బ్యాట్‌తోనూ విజృంభించగల సమర్థులు. బంతితో సూపర్‌కింగ్స్ కాస్త తడబడుతున్నా.. నేడు కీలక ఫైనల్లో అంచనాలను అందుకునేందుకు బౌలర్లు ఉవ్విళ్లూరుతున్నారు.
కోల్‌కత మెరిసేనా? : కోల్‌కత నైట్‌రైడర్స్ యుఏఈలో అద్భుతంగా రాణిస్తోంది. ఇక్కడ అసమాన విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. తాజాగా ఫైనల్లోకి అడుగుమోపింది. ఇయాన్ మోర్గాన్ నాయకత్వం కోల్‌కతకు అదనపు బలం. బ్యాట్స్‌మన్‌గా మోర్గాన్ వైఫల్యం ఫైనల్లోనూ ఆ జట్టును వెంటాడే ప్రమాదం కనిపిస్తోంది. టాప్ ఆర్డర్లో యువ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రానాలు మంచి ఫామ్‌లో ఉన్నారు. దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్‌లు బ్యాట్‌తో పేలవంగా ఆడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2లోనూ కోల్‌కత మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ దారుణంగా విఫలమైంది. ఫైనల్లోనూ అదే పునరావృతం అయితే టైటిల్‌పై నైట్‌రైడర్స్ ముందుగానే ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. కోల్‌కత బౌలింగ్ విభాగం బలంగా ఉంది. లాకీ ఫెర్గుసన్, శివం మావిలు పేస్‌తో దడ పుట్టిస్తుండగా.. షకిబ్,వరుణ్, నరైన్‌లు స్పిన్‌తో మాయ చేస్తున్నారు.
ఆ 12 ఓవర్లే కీలకం! : మూడుసార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ నేడు ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయినా, కోల్‌కత నైట్‌రైడర్స్‌ను దాటేసి కప్పు అందుకోవటం ధోనీసేనకు అంత సులువు కాదు. కోల్‌కత శిబిరంలో ముగ్గురు స్పిన్నర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. సునీల్ నరైన్, షకిబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తిలు సంయుక్తంగా 12 ఓవర్లు వేయనున్నారు. ఈ ముగ్గురు వేసే 12 ఓవర్లను కాచుకోవటం చెన్నైకి సవాల్. ఈ ఓవర్లలో రన్‌రేట్‌ను నిలుపుకోవటంతో పాటు వికెట్లను కాపాడుకోవటం ముఖ్యం. స్పిన్నర్ల ఓవర్లను చెన్నై ఏ విధంగా ఎదుర్కొంటుందనే విషయంపై ఫలితం ఆధారపడి ఉంటుంది. చెన్నై సూపర్‌కింగ్స్ శిబిరంలో రవీంద్ర జడేజా, మోయిన్ అలీలు సైతం ప్రమాదకారులే.
పిచ్, వాతావరణం : ఈ ఏడాది దుబారు పిచ్‌పై ఓ మోస్తరు స్కోర్లు నమోదయ్యాయి. ఒత్తిడితో కూడిన టైటిల్ పోరులో 170-180 పరుగులు సాధిస్తే గెలుపుపై దీమాగా ఉండవచ్చు. దుబారులో స్పిన్నర్లతో పాటు పేసర్లకు సైతం పిచ్ నుంచి సహకారం లభిస్తుంది. కోల్‌కతపై స్కోరు కాపాడుకోవటంలో, లక్ష్యాన్ని ఛేదించటంలోనూ చెన్నైకి మంచి రికార్డుంది. ఫైనల్లో ఛేదన అంత సులువు కాదు!. దీంతో టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. దుబారు ఎల్ఈడీ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో క్యాచులు కాస్త ఇబ్బందికి గురిచేసే వీలుంది!.
తుది జట్లు (అంచనా) :
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప/సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎం.ఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోశ్ హజిల్‌వుడ్.
కోల్‌కత నైట్‌రైడర్స్ : శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షకిబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గుసన్, శివం మావి, వరుణ్ చక్రవర్తి.
3
ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ సాధించిన టైటిళ్లు 3. 2010, 2011, 2018 సీజన్లలో ఎం.ఎస్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.
2
కోల్‌కత నైట్రైడ్స్ సాధించిన ఐపీఎల్ టైటిళ్లు 2. 2012, 2014 సీజన్లలో గౌతం గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కత నైట్‌రైడర్స్ ఐపీఎల్ విజేతగా అవతరించింది.
4/1
దసరా నాటి ఫైనల్స్‌కు ముందు కోల్‌కత నైట్‌రైడర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ చివరి ఐదు ముఖాముఖి మ్యాచుల్లో ధోనీసేనదే పైచేయి. ఈ సీజన్లో రెండు మ్యాచులు సహా మరో రెండు మ్యాచుల్లో చెన్నై గెలుపొందగా.. కోల్‌కత కేవలం ఒక్క మ్యాచ్‌లోనే చెన్నైపై పైచేయి సాధించింది.
9/3
చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది రికార్డు తొమ్మిదో ఐపీఎల్ ఫైనల్ కాగా, కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఇది మూడో ఐపీఎల్ టైటిల్ పోరు. ఎనిమిది ఫైనల్స్‌లో చెన్నై ఐదు సార్లుపరాజయం పాలవగా.. కోల్‌కతకు ఫైనల్లో ఓడిన చరిత్ర లేదు.