Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోనీసేన ఖాతాలో నాల్గో ఐపీఎల్ టైటిల్
- ఫైనల్లో కోల్‌కతపై ఏకపక్ష విజయం
- డుప్లెసిస్, రుతురాజ్, ఉతప్ప మెరుపులు
12 సీజన్లు, 11 ప్లే ఆఫ్స్, 9 ఫైనల్స్. ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ ప్రతిహాత రికార్డు ఇది. అయినా, 2020 ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరటంలో చెన్నై విఫలమవటంతో ధోనీసేన పనైపోయిందనే వ్యాఖ్యలు. డాడీస్ ఆర్మీ ప్రతాపం గాలివాటమే అనే విమర్శలు వినిపించాయి. ' వచ్చే సీజన్‌కు మరింత బలంగా దూసుకొస్తామని' నిరుడు ధోనీ చెప్పిన మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. 2021 ఐపీఎల్ సీజన్లో తొలి ప్లే ఆఫ్స్ బెర్త్ సొంతం చేసుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ శుక్రవారం నాటి ఫైనల్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసి రికార్డు స్థాయిలో నాల్గోసారి ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది.
ధోనీ మినహా ఇతర జట్లకు, ఇతర కెప్టెన్లకు సెమీఫైనల్స్‌కు చేరినా, ఫైనల్స్‌కు చేరినా అది గొప్ప రికార్డు. కానీ ధోనీ బరిలో నిలిస్తే అతడు టైటిల్ విజయమే అతడి ప్రదర్శనకు కొలమానమైంది. ఐపీఎల్‌లోనూ మహీ ఇదే ట్రెండ్ కొనసాగించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ గత నాలుగు సీజన్లలో మూడు సార్లు ఫైనల్స్‌కు చేర్చి, రెండు సార్లు టైటిల్ ముద్దాడే అవకాశం అందించాడు. కోల్‌కతపై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చూపించిన చెన్నై సూపర్‌కింగ్స్ చాంపియన్ తరహాలో సగర్వంగా ఐపీఎల్ విజేతగా నిలిచింది.
నవతెలంగాణ-దుబాయ్
చెన్నై సూపర్‌కింగ్స్ కొట్టేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను నాల్గోసారి తంబీల సొంతమైంది. దసరా ధమాకా ఐపీఎల్ 14 ఫైనల్లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్ ఘన విజయం సాధించింది. డుప్లెసిస్ (86, 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మోయిన్ అలీ (37 నాటౌట్, 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (32, 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (31, 15 బంతుల్లో 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగటంతో టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 192/3 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రికార్డు ఛేదనలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51, 43 బంతుల్లో 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (50, 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కగా కోల్‌కత ఆశలు చిగురించినా.. మిడిల్ ఆర్డర్ మరోసారి సమిష్టిగా విఫలమైంది. నిర్ణీత ఓవర్లలో 165/9 పరుగులే చేసిన కోల్‌కత ఐపీఎల్ ఫైనల్లో తొలిసారి పరాజయం మూటగట్టుకుంది. మెగా ఫైనల్లో మెగా ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ అత్యధిక పరుగుల రికార్డుతో 'ఆరెంజ్' క్యాప్ అందుకోగా.. అత్యధిక వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పేసర్ హర్షల్ పటేల్ 'పర్పుల్' క్యాప్ దక్కించుకున్నాడు. ఐపీఎల్ 14 విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎం.ఎస్ ధోనికి బీసీసీఐ కార్యదర్శి జై షా ట్రోఫీ అందించగా, బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.20 కోట్ల నగదు బహుమతి చెక్‌ను అందించాడు.
డుప్లెసిస్ ముందుండి..! : దుబాయ్ పిచ్‌పై ఛేదనకు ఉండే అనుకూలతను దృష్టిలో ఉంచుకుని టాస్ నెగ్గిన కోల్‌కత నైట్‌రైడర్స్ తొలుత సూపర్‌కింగ్స్‌ను బ్యాటింగ్‌కు పిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసినా, ఆ పరిస్థితులకు సన్నద్ధమై వచ్చిన ధోనీసేన అందుకు తగినట్టే ఆడింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (32, 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డుప్లెసిస్ (86, 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆచితూచి ఆడుతూనే, పరుగుల వరద పారించారు. పవర్‌ప్లేలో 50 పరుగులు చేసిన ఓపెనర్లు భారీ స్కోరుకు చక్కటి పునాది వేశారు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన ఆరెంజ్ క్యాప్ విజేత రుతురాజ్‌ను సునీల్ నరైన్ అవుట్ చేసినా.. చెన్నై ఇన్నింగ్స్‌లో ఎటువంటి మార్పు లేదు. డుప్లెసిస్ ఓ ఎండ్‌లో ఇన్నింగ్స్‌కు నాయకత్వం వహించగా.. మరో ఎండ్‌లో రాబిన్ ఉతప్ప (31) కోల్‌కత బౌలర్లను ఉతికారేశాడు. మూడు భారీ సిక్సర్లు కొట్టిన ఉతప్ప చెన్నైకి ఊపు తీసుకొచ్చాడు. ఉతప్ప నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన మోయిన్ అలీ (37 నాటౌట్) సైతం వెనక్కి తగ్గలేదు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన డుప్లెసిస్ కోల్‌కత బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. స్పిన్నర్లపై కోల్‌కత భారీ ఆశలు పెట్టుకోగా ఆ స్పిన్నర్లపైనే దండయాత్ర చేశారు. వరుణ్ చక్రవర్తి (0/38), షకిబ్ (0/33), నరైన్ (2/26)లను దంచి కొట్టారు. ప్రధాన సీమర్ లాకీ ఫెర్గుసన్ (0/56)ను చెన్నై బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. అందరి బౌలింగ్‌లోనూ సిక్సర్లు బాది కోల్‌కత బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతీశారు. ఆఖరు ఓవర్లో బౌండరీలు రాకపోవటంతో చెన్నై 192 పరుగులే చేసింది.
ఆ ఇద్దరి నిష్క్రమణతోనే..! : ఐపీఎల్ ఫైనల్. 193 పరుగుల భారీ లక్ష్యం. అయినా, ఛేదనలో కోల్‌కత ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గతంలో చెన్నై ఈ స్కోరు ఛేదించి టైటిల్ అందుకున్న చరిత్ర కోల్‌కత సొంతం. ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51), వెంకటేశ్ అయ్యర్ (50)లు అర్థ సెంచరీలతో చెలరేగటంతో తొలి పది ఓవర్లలో కోల్‌కత నైట్‌రైడర్స్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. అయ్యర్ సున్నా పరుగుల వద్ద ఉండగా ధోనీ క్యాచ్ నేలపాలు చేయటంతో ఆ తర్వాతి బంతినే సిక్సర్‌గా మలిచిన అయ్యర్..చెన్నై శిబిరంలో గుబులు పుట్టించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 10.3 ఓవర్లలోనే 91 పరుగులు జోడించారు. దీంతో కోల్‌కత మ్యాచ్ రేసులో నిలిచింది. కానీ వెంకటేశ్ అయ్యర్ నిష్క్రమణతో మ్యాచ్ వేగంగా చెన్నై చేతుల్లోకి వచ్చేసింది. ఫామ్‌లో లేని కోల్‌కత మిడిల్ ఆర్డర్‌ను చెన్నై బౌలర్లు తేలిగ్గా వెనక్కి పంపించారు. నితీశ్ రానా (0), సునీల్ నరైన్ (2), ఇయాన్ మోర్గాన్ (4), దినేశ్ కార్తీక్ (9), షకిబ్ అల్ హసన్ (0), రాహుల్ త్రిపాఠి (2)లు చెన్నై బౌలర్లకు దాసోహం అయిపోయారు. 125/8తో కోల్‌కత నైట్‌రైడర్స్ ఓటమి ఖాయమైంది. టెయిలెండర్లు లాకీ ఫెర్గుసన్ (18 నాటౌట్, 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), శివం మావి (20, 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఓటమి అంతరాన్ని తగ్గించారు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ (3/38), జోశ్ హజిల్‌వుడ్ (2/29), రవీంద్ర జడేజా (2/37)లు కోల్‌కతను కట్టడి చేశారు. ఐపీఎల్లో మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్.. టైటిల్ పోరులో పరాజయం పాలవటం ఇదే తొలిసారి. గౌతం గంభీర్ సారథ్యంలోని కోల్‌కత నైట్‌రైడర్స్ 2012, 2014 సీజన్లలో ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది.
స్కోరు వివరాలు :
చెన్నై ఇన్నింగ్స్ : రుతురాజ్ (సి) శివం (బి) నరైన్ 32, డుప్లెసిస్ (సి) అయ్యర్ (బి) శివం 86, ఉతప్ప (ఎల్బీ) నరైన్ 31, అలీ నాటౌట్ 37, ఎక్స్‌ట్రాలు : 06, మొత్తం :(20 ఓవర్లలో 3 వికెట్లకు) 192.
వికెట్ల పతనం : 1-61, 2-124, 3-192.
బౌలింగ్ : షకిబ్ 3-0-33-0, శివం 4-0-32-1, ఫెర్గుసన్ 4-0-56-0, వరుణ్ 4-0-38-0, నరైన్ 4-0-26-2, అయ్యర్ 1-0-5-0.
కోల్‌కత ఇన్నింగ్స్ : గిల్ (ఎల్బీ) చాహర్ 51, అయ్యర్ (సి) జడేజా (బి) శార్దుల్ 50, రానా (సి) డుప్లెసిస్ (బి) శార్దుల్ 0, నరైన్ (సి) జడేజా (బి) హజిల్‌వుడ్ 2, మోర్గాన్ (సి) చాహర్ (బి) హజిల్‌వుడ్ 4, కార్తీక్ (సి) రాయుడు (బి) జడేజా 9, షకిబ్ (ఎల్బీ) జడేజా 0, త్రిపాఠి (సి) అలీ (బి) శార్దుల్ 2, ఫెర్గుసన్ నాటౌట్ 18, శివం (సి) చాహర్ (బి) బ్రావో 20, వరుణ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 09, మొత్తం :(20 ఓవర్లలో 9 వికెట్లకు) 165.
వికెట్ల పతనం : 1-91, 2-93, 3-97, 4-108, 5-119, 6-120, 7-123, 8-125, 9-164.
బౌలింగ్ : చాహర్ 4-0-32-1, హజిల్‌వుడ్ 4-0-29-2, శార్దుల్ 4-0-38-3, బ్రావో 4-0-29-1, జడేజా 4-0-37-2.
' ముందుగా కోల్‌కతను అభినందించాలి. సీజన్లో విరామం ఆ జట్టుకు కలిసొచ్చింది. ఐపీఎల్ టైటిల్‌కు అన్ని విధాలుగా అర్హమైన జట్టు కోల్‌కత. ద్వితీయార్థంలో గొప్ప ప్రదర్శన చేశారు. ఇక చెన్నై విషయానికొస్తే మాకు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఫైనల్లో గణాంకాలు చూస్తే.. నిలకడగా ఓడిన జట్టు మాదే. గత సీజన్ అనుభవంతో బలంగా తిరిగి రావాలనుకున్నాం. నిజానికి చెన్నై శిబిరంలో జట్టు సమావేశాల్లో పెద్దగా మాట్లాడం. నెట్ ప్రాక్టీస్ సెషన్లే మాకు సమావేశాలు. ప్రత్యేకించి సమావేశం ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకొస్తుంది. అందుకే ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాండేందుకు ఇష్టపడతాను. ఎక్కడ ఆడినా చెన్నైలోనే ఆడుతున్న భావన కల్పిస్తున్న అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే ఏడాది చెన్నైలోనే ఆడతామని ఆశిస్తున్నాం. కానీ ఆ విషయం బీసీసీఐ చేతుల్లో ఉంది. వచ్చే సీజన్‌కు రెండు కొత్త జట్లు వస్తున్నాయి. రానున్న పదేండ్లలో జట్టు విజయాల్లో బాధ్యత తీసుకునే కోర్ బృందాన్ని కలిగి ఉండటం కీలకం'
- ఎం.ఎస్ ధోని