Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీకాంత్, సమీర్ వర్మ సైతం
- డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్
ఒడెన్సె (డెన్మార్క్) : టోక్యో ఒలింపిక్స్ అనంతరం విరామం తీసుకున్న భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు డెన్మార్క్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌లో నాల్గో సీడ్ పి.వి సింధు తొలి రౌండ్లో చెమటోడ్చకుండా విజయం నమోదు చేసింది. టర్కీ షట్లర్ నెస్లిహాన్ యిగిట్‌పై వరుస గేముల్లో గెలుపొందింది. 21-12, 21-10తో 30 నిమిషాల్లోనే సింధు రెండో రౌండ్లోకి ప్రవేశించింది. నేడు థారులాండ్ స్టార్ షట్లర్ బుసానన్‌తో సింధు పోటీపడనుంది. పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్ ఓపెన్ మాజీ చాంపియన్ (2017) కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించాడు. సహచర షట్లర్ బి. సాయిప్రణీత్‌పై వరుస గేముల్లోనే సాధికారిక విజయంతో మెరిశాడు. 30 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో 21-14, 21-11తో శ్రీకాంత్ ముందంజ వేశాడు. రెండో రౌండ్లో వరల్డ్ నం.1 జపాన్ షట్లర్ మోమోటతో శ్రీకాంత్ తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ సైతం ఆకట్టుకున్నాడు. 21-17, 21-14తో 34 నిమిషాల్లోనే థారులాండ్ షట్లర్‌ను చిత్తు చేశాడు. డబుల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏడో సీడ్ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 23-21, 21-15తో ఇంగ్లాండ్ జంటపై విజయం సాధించగా.. ఎం.ఆర్ అర్జున్, ధ్రువ్ కపిల జోడీ 21-19, 21-15తో ఇంగ్లాండ్‌కే చెందిన బెన్ లేన్, సీన్ విండేలపై సంచలన విజయం నమోదు చేశారు. మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీకి తొలి రౌండ్లో పరాభవం తప్పలేదు. 18-21, 11-21తో మలేషియా జంట చేతిలో వరుస గేముల్లో ఓటమి చెందారు. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నేడు తొలి రౌండ్ పోరులో జపాన్‌కు చెందిన షట్లర్ అయా ఒహౌరితో తలపడనుంది.