Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌తో భారత్ వార్మప్ నేడు
- విరాట్ కోహ్లి ఫామ్‌పైనే ఫోకస్
- మ.3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
ప్రతిష్టాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ వేటలో భారత్, ఆస్ట్రేలియాలు చివరి సన్నాహాకానికి సిద్ధమవుతున్నాయి. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ను ఇప్పటికీ ముద్దాడలేదు. యుఏఈలో ఆ లోటు తీర్చుకోవాలని కంగారూలు ఎదురుచూస్తున్నారు. తొలి టీ20 ప్రపంచకప్‌తో చరిత్ర సృష్టించినా.. మరోసారి పొట్టి కప్పు అందుకోలేని లోటు భారత్‌ను వేధిస్తోంది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కావటంతో టీమ్ ఇండియా శిబిరం భావోద్వేగంతో కనిపిస్తోంది. పొట్టి కప్పు రేసులో అస్త్రాలు సరిచేసుకునేందుకు ఇరు జట్లకు నేడు చివరి చాన్స్!.
నవతెలంగాణ-దుబాయ్
ఆతిథ్య జట్టుగా మరోసారి ఐసీసీ ప్రపంచకప్ అందుకోవాలనే సంకల్పంతో కనిపిస్తోన్న టీమ్ ఇండియా.. ఆ దిశగా ఏ చిన్న అవకాశాలను సైతం వదులుకోవటం లేదు. ఎం.ఎస్ ధోనిని జట్టు మెంటార్‌గా తీసుకుని డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇదే చివరి ఐసీసీ టీ20 ప్రపంచకప్. అత్యుత్తమ బ్యాటర్‌కు అద్వితీయ బహుమతి ఇచ్చేందుకు మెన్ ఇన్ బ్లూ పొట్టి కప్పుపై కన్నేశారు. ఐపీఎల్ ఫామ్, ఒత్తిడి లేని ప్రదర్శనలకు అలవాటైన టీమ్ ఇండియా 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. తొలి వార్మప్‌లో ఇంగ్లాండ్‌పై అలవోక విజయం సాధించిన భారత్.. నేడు ఆస్ట్రేలియాతో మరో సన్నాహాక మ్యాచ్‌లో అస్త్రాలు ప్రయోగించనుంది. నేడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం అసలు పోరులో సిసలైన వ్యూహంపై కోహ్లిసేన ఓ అంచనాకు రానుంది. నేడు దుబారులోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో భారత్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ మధ్యాహ్నాం 3.30 గంటలకు ఆరంభం.
కోహ్లి ఇలా ఎలా?! : విరాట్ కోహ్లి తన కెరీర్లో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి వార్మప్‌లో కోహ్లి పేలవ ప్రదర్శన చేశాడు. భారీ ఛేదనలో అందరూ ధనాధన్ జోరు చూపిస్తే.. విరాట్ కోహ్లి స్ట్రయిక్‌రేటు మరీ పేలవం. దీంతో మెగా ఈవెంట్‌కు ముందు విరాట్ కోహ్లి బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. భారీ స్కోర్లు నమోదు కానున్న వరల్డ్‌కప్‌లో బంతికో పరుగు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాబోదు. ఈ విషయం నాయకుడిగా కోహ్లికి బాగా తెలుసు. బ్యాటింగ్ లైనప్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇంకా టచ్‌లోకి రావాల్సి ఉంది. కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఐపీఎల్ విధ్వంసక ఫామ్ కొనసాగిస్తున్నారు. రోహిత్ శర్మ నేటి మ్యాచ్‌లో ఆడేది లేనిది అనుమానమే. మెగా ఈవెంట్‌కు ముందు రోహిత్ విలువైన విశ్రాంతి పొందుతున్నాడు. ఐపీఎల్లో నాయకత్వ బాధ్యతలతో బాధ్యతాయుతంగా ఆడిన రిషబ్ పంత్ మళ్లీ స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తున్నాడు. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లు మెరిస్తే బ్యాటింగ్ లైనప్‌లో టీమ్ ఇండియా కష్టాలకు తెరపడినట్టే.
స్పిన్ కలవరం : స్పిన్‌కు బాగా అనుకూలించే యుఏఈ పిచ్‌లపై టీమ్ ఇండియా స్పిన్ ఆందోళనకు దారితీస్తోంది. యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ అద్భుత ప్రదర్శనతో వరల్డ్‌కప్‌కు ఎంపికైనా.. ప్రస్తుతం అతడు అంత మంచి ఫామ్‌లో లేడు. మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్ లేని లోటు తొలి వార్మప్‌లో స్పష్టంగా కనిపించింది. వరుణ్ చక్రవర్తి ఆకట్టుకుంటున్నాడు. రవీంద్ర జడేజా సైతం బంతితో మాయకు సిద్ధపడితే జట్టుకు ఉపయుక్తం. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ గాడిలో పడాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. డెత్ ఓవర్లలో బుమ్రాతో కలిసి భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మహ్మద్ షమి పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లలో అమోఘమైన ప్రభావం చూపిస్తున్నాడు. శార్దుల్ ఠాకూర్ నేడు మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
వార్నర్ సమస్య! : డెవిడ్ వార్నర్ పేలవ ఫామ్ ఆస్ట్రేలియాను వెంటాడుతోంది. ఐపీఎల్లో దారుణ ప్రదర్శనతో సన్‌రైజర్స్ కెప్టెన్సీతో పాటు తుది జట్టులో చోటు కోల్పోయాడు వార్నర్. ఇప్పుడు న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లోనూ వార్నర్ సున్నా పరుగులకే వికెట్ కోల్పోయాడు. దీంతో వార్నర్ ఫామ్ ఆసీస్‌ను కంగారు పెడుతోంది. అతడు మెరిస్తే టాప్ ఆర్డర్ సమస్య తీరనుంది. కివీస్‌పై 159 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ చివరి ఓవర్లో ఛేదించింది. బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ అరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్‌లు ధనాధన్ టచ్ అందుకోవాల్సి ఉంది. టీ20 ఫార్మాట్‌కు తగినట్టు కంగారూ బ్యాటర్ల ప్రదర్శన లేదు. ఇది ఆసీస్‌ను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది.పేస్ బౌలింగ్ విభాగంలో జోశ్ హజిల్‌వుడ్ వరల్డ్‌కప్‌లో ఆసీస్‌కు కీలకం కానున్నాడు. మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ మార్ష్‌లు పేస్ విభాగంలో ఉన్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అష్టన్ ఆగర్, ఆడం జంపాలు భారత్‌పై మాయ చేసి ఆసీస్ శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
జట్ల వివరాలు :
భారత్ : విరాట్ కోహ్లి (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, జశ్‌ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, సూర్యకుమార్ యాదవ్.
ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్, అష్టన్ ఆగర్, డాన్ క్రిస్టియన్, నాథన్ ఎలీస్, జోశ్ హజిల్‌వుడ్, జోశ్ ఇంగ్లీస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, డానియల్ శామ్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్విప్సన్, మాథ్యూ వేడ్, డెవిడ్ వార్నర్, ఆడం జంపా.