Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, పాక్ మ్యాచ్‌పై ప్రకాశ్ పదుకొణె
బెంగళూర్ : సరిహద్దు ఉద్రిక్తతలు, ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు దెబ్బతినటంతో పొరుగు దేశాలు భారత్, పాకిస్థాన్‌లు ఐసీసీ ఈవెంట్ల వేదికగానే ముఖాముఖి తలపడుతున్నాయి. సరిహద్దుల్లో సమస్యలు నిత్యం కృత్యం కావటంతో ఎప్పుడు ఈ రెండు దేశాలు తలపడినా రాజకీయ వేడి రాజుకుంటోంది. 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలోనూ పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని భారత్‌లో ఆందోళనలు చేశారు. కాశ్మీర్లో అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంఘటన నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ రద్దు చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె స్పందించారు. ' క్రీడలు, రాజకీయాలను కలిపి చూడవద్దని నా వ్యక్తిగత అభిప్రాయం. భారత్, పాక్ మ్యాచ్ జరిగినా, జరగకపోయినా.. ఆ విషయంలో నిర్ణయం తీసుకునే, ప్రభావితం చేసే వ్యక్తిని నేను కాదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అడిగితే.. షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాలి. గతంలో ఎన్నోసార్లు ఈ రెండు జట్లు పోటీ పడ్డాయి. ఇప్పుడూ అంతే, ఎటువంటి తేడా లేదు' అని పదుకొణె అన్నారు.