Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రౌండ్లోనే దారుణ పరాజయం
- డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్
ఒడెన్సె (డెన్మార్క్) : భారత బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్, అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. వరల్డ్ నం.19 సైనా నెహ్వాల్ కోవిడ్ ప్రతికూలత, పేలవ ర్యాంకింగ్‌తో టోక్యో 2020 ఒలింపిక్స్‌కు సైతం దూరమైంది. ఇటీవల ఉబెర్ కప్‌లో తొలి మ్యాచ్‌లోనే మోకాలి నొప్పితో కోర్టు నుంచి నిష్క్రమించింది. డెన్మార్క్ ఓపెన్‌లోనైనా సైనా నెహ్వాల్ మునుపటి ఫామ్ అందుకుంటుందనే అంచనాలు ఆవిరయ్యాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులోనే హైదరాబాదీ అమ్మాయి సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. 34 నిమిషాల్లోనే ముగిసిన తొలి రౌండ్ పోరులో 16-21, 14-21తో సైనా నెహ్వాల్ వరుస గేముల్లో మట్టికరిచింది. జపాన్ యువ సంచలనం అయా ఒహురి వరుస గేముల్లోనే సైనాను ఓడించింది. రెండు గేముల్లోనూ సైనా నెహ్వాల్ మ్యాచ్ రేసులో నిలువలేదు. జపాన్ షట్లర్ అలవోక విజయంతో ముందంజ వేయగా.. సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో సహచర భారత షట్లర్ సౌరభ్ వర్మపై యువ షట్లర్ లక్ష్యసేన్ 21-9, 21-7తో ఎదురులేని విజయం సాధించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, అశ్విని పొన్నప్ప జంట 17-21, 21-14, 11-21తో మలేషియా జోడీ చేతిలో మూడు గేముల్లో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో మేఘన, పూర్విశ జోడీ 8-21, 7-21తో పరాజయం పాలైంది. మరో స్టార్ జోడీ అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి సైతం 17-21, 13-21తో పరాజయం పాలయ్యారు.