Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్ శర్మ ధనాధన్ షో
- అశ్విన్, జడేజా, చాహర్ మాయ
- ఆసీస్‌పై భారత్ ఘన విజయం
టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ సన్నాహాకం అదిరింది. ఇంగ్లాండ్‌పై సాధికారిక విజయం సాధించిన కోహ్లిసేన.. బుధవారం ఆస్ట్రేలియాపై ఏకపక్ష విజయం నమోదు చేసింది. బంతితో, బ్యాట్‌తో కంగారూలపై ఎదురులేని ఆధిపత్యం చెలాయించిన భారత్ అసలు సమరానికి అస్త్ర శస్త్రాలు విజయవంతంగా సిద్ధం చేసుకుంది. తొలుత ఆస్ట్రేలియాను 152/5కు కట్టడి చేసిన భారత్, మరో 13 బంతులు ఉండగానే స్వల్ప లక్ష్యాన్ని ఊదేసింది.
నవతెలంగాణ-దుబాయ్
రోహిత్ శర్మ (60, 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (39, 31 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (39 నాటౌట్, 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ మెరుపులతో చెలరేగటంతో ఆస్ట్రేలియాపై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే కోహ్లిసేన ఛేదించింది. వరుసగా రెండో వార్మప్ మ్యాచ్‌లో ఎదురులేని విజయం నమోదు చేసింది. టీ20 ప్రపంచకప్ రేసులో బలమైన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై వార్మప్ల్లో అదరగొట్టిన టీమ్ ఇండియా అక్టోబర్ 24న పొరుగు దేశం పాకిస్థాన్‌తో మెగా పోరుతో టైటిల్ వేటను మొదలుపెట్టనుంది. స్టీవ్ స్మిత్ (57, 48 బంతుల్లో 7 ఫోర్లు), గ్లెన్ మాక్స్వెల్ (37, 28 బంతుల్లో 5 ఫోర్లు), మార్కస్ స్టోయినిస్ (41 నాటౌట్, 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 152 పరుగులు చేసింది.
రోహిత్, రాహుల్ ధనాధన్ : లక్ష్యం 153 పరుగులు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పరుగుల వేటలో ఇబ్బందులు పడింది. దీంతో భారత బ్యాటర్ల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. టీమ్ ఇండియా ఓపెనర్లు కెఎల్ రాహుల్ (39), రోహిత్ శర్మ (60)లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆసీస్ బౌలర్లను ఉతికారేశారు. తొలుత రాహుల్ దూకుడు చూపించటంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో రాహుల్ పవర్‌ప్లేలో పవర్ చూపించాడు. తొలి వార్మప్‌లో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ ఆసీస్‌పై తన విశ్వరూపం ట్రయల్ చూపించాడు. మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 36 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్‌తో భారత్ గెలుపు లాంఛనమైంది. ఐపీఎల్లో నిలకడగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ (38 నాటౌట్) ఆసీస్‌పై మెప్పించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 బంతుల్లోనే అజేయంగా 38 పరుగులు చేశాడు. సూర్యకుమార్ ఫామ్‌లోకి రావటం భారత్‌కు సానుకూలాంశం. రోహిత్ శర్మ రిటైర్డ్ ఔట్‌తో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య (14 నాటౌట్) ఓ సిక్సర్‌తో లాంఛనం ముగించాడు. టాప్-3 బ్యాటర్ల మెరుపులతో 17.5 ఓవర్లలోనే భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ బౌలర్లలో అష్టన్ ఆగర్ (1/14) ఒక్కడికే వికెట్ దక్కింది. మాక్స్వెల్, పాట్ కమిన్స్, జంపా, కేన్ రిచర్డ్సన్ గణాంకాలను రోహిత్, రాహుల్, సూర్యలు తలకిందులు చేశారు. విరాట్ కోహ్లి ఆసీస్‌తో బ్యాటింగ్‌కు రాలేదు.
మాయజాలం : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను టీమ్ ఇండియా స్పిన్‌తో వణికించింది. ఐపీఎల్ 14 సీజన్ ఆరంభం నుంచి అత్యంత పేలవంగా ఆడుతున్న డెవిడ్ వార్నర్ (1) కథ మారలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వరుస బంతుల్లో వార్నర్, మిచెల్ మార్ష్ (0) వికెట్లను కూల్చిన ట్రంప్‌కార్డ్ స్పిన్నర్ అశ్విన్ ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. రవీంద్ర జడేజా ఓవర్లో కెప్టెన్ అరోన్ ఫించ్ (8) సైతం వికెట్ల ముందు దొరికిపోయాడు. 11/3తో ఆస్ట్రేలియా టాప్-3 బ్యాటర్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ ఆసీస్‌ను ఆదుకుంది. స్టీవ్ స్మిత్ (57) అర్థ సెంచరీతో కదం తొక్కగా.. గ్లెన్ మాక్స్వెల్ (37) రాణించాడు. డెత్ ఓవర్లలో మార్కస్ స్టోయినిస్ (41 నాటౌట్, 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడాడు. స్టోయినిస్ మెరుపులతో ఆస్ట్రేలియా గౌరవప్రద స్కోరు సాధించింది. భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్‌కు రాని విరాట్ కోహ్లి.. రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. 12 బంతుల్లో 11 పరుగులు ఇచ్చాడు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (ఎల్బీ) అశ్విన్ 1, అరోన్ ఫించ్ (ఎల్బీ) జడేజా 8, మిచెల్ మార్ష్ (సి) రోహిత్ శర్మ (బి) అశ్విన్ 0, స్టీవెన్ స్మిత్ (సి) రోహిత్ శర్మ (బి) భువనేశ్వర్ కుమార్ 57, గ్లెన్ మాక్స్వెల్ (బి) రాహుల్ చాహర్ 37, మార్కస్ స్టోయినిస్ నాటౌట్ 41, మాథ్యూ వేడ్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 152.
వికెట్ల పతనం : 1-6, 2-6, 3-11, 4-72, 5-148.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-27-1, రవిచంద్రన్ అశ్విన్ 2-0-8-2, రవీంద్ర జడేజా 4-0-35-1, శార్దుల్ ఠాకూర్ 3-0-30-0, విరాట్ కోహ్లి 2-0-12-0, రాహుల్ చాహర్ 3-0-17-1, వరుణ్ చక్రవర్తి 2-0-23-0.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) డెవిడ్ వార్నర్ (బి) ఆష్టన్ ఆగర్ 39, రోహిత్ శర్మ (రిటౌర్డ్ ఔట్) 60, సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 38, హార్దిక్ పాండ్య నాటౌట్ 14, ఎక్స్‌ట్రాలు : 02, మొత్తం : (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 153.
వికెట్ల పతనం : 1-68, 2-127.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 2-0-14-0, పాట్ కమిన్స్ 4-0-33-0, ఆష్టన్ ఆగర్ 2-0-14-1, ఆడం జంపా 3-0-29-0, కేన్ రిచర్డ్సన్ 1.5-0-20-0, మార్కస్ స్టోయినిస్ 2-0-16-0, మిచెల్ మార్ష్ 2-0-17-0, గ్లెన్ మాక్స్వెల్ 1-0-10-0