Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిచ్‌ల స్వభావంపై నెలకొన్న ఆసక్తి
- ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్
మ్యాచులను గెలిపించేందుకు బలాబలాలు సరిపోతాయి. ఐసీసీ ఈవెంట్లను సొంతం చేసుకునేందుకు కేవలం బలమైన జట్టు, అత్యుత్తమ ఆటగాళ్లు సరిపోరు. మెగా టైటిల్‌ను ముద్దాడేందుకు అన్నింటికి మించి ప్రధానంగా వ్యూహం, సరైన ప్రణాళికలు అవసరం. ప్రత్యర్థి బలం, బలహీనతలపై అవగాహనకు తోడు పిచ్ స్పందించే స్వభావం, అనుసరించాల్సిన వ్యూహంపై ఓ పక్కా ప్రణాళిక ఉండాలి. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ అసలు సమరం అక్టోబర్ 23 నుంచి ఆరంభం కానుంది. దుబారు, అబుదాబి, షార్జా వేదికలుగా సూపర్12 సమరానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో మూడు స్టేడియాల్లో పిచ్ స్వభావం, బ్యాటింగ్, బౌలింగ్ అనుకూలతలను ఐపీఎల్ ప్రదర్శన, ఫలితాల ఆధారంగా ఓ సారి బేరీజు వేద్దామా..!
నవతెలంగాణ క్రీడావిభాగం
షార్జా : స్పిన్నర్ల స్వర్గధామం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ద్వితీయార్థం ఆరంభానికి ముందు షార్జా పిచ్‌ను కొత్తగా వేశారు. కొత్త పిచ్ వినియోగంలోకి రావటంతో బ్యాటర్ల స్వర్గధామమైన షార్జా పిచ్.. అందుకు భిన్నంగా బ్యాటర్ల నరకప్రాయంగా మారింది. 2020 ఐపీఎల్ సీజన్లో ప్రతి 12 బంతులకు ఓ సిక్సర్ నమోదు కాగా.. 2021 ఐపీఎల్ సీజన్లో ఓ సిక్సర్‌కు 23 బంతులు అవసరం అయ్యాయి. పది ఐపీఎల్ మ్యాచుల్లో కేవలం 98 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి. పేస్‌లో వైవిధ్యం చూపించిన బౌలర్లకే ఇక్కడ విజయం లభించింది. స్పిన్నర్లు, సీమర్లు ఇటుఇటుగా ఒకే తరహా గణాంకాలు సాధించారు. పేసర్ల ఎకానమీ రేటు 6.92 కాగా, స్పిన్నర్లు 6.79 ఎకానమీ రేటు నమోదు చేశారు. పేసర్లకు ఇక్కడ ఉత్తమ స్ట్రయిక్‌రేటు ఉంది. పేసర్లు ఇక్కడ సగటున 17 బంతులకు ఓ వికెట్ పడగొట్టగా.. స్పిన్నర్లు 22 బంతులకు ఓ వికెట్ తీసుకున్నారు.
షార్జా వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లు తలా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఐపీఎల్లో స్పందించిన తరహాలోనే ప్రపంచకప్ సూపర్12 దశలోనూ షార్జా పిచ్ స్పందిస్తే పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లకు ఇది ఉపకరించనుంది. ఈ రెండు జట్లు ముగ్గురేసి స్పిన్నర్లను రంగంలోకి దింపగలవు. ఈ రెండు జట్ల బ్యాటింగ్ విభాగాలు 180-200 సోర్ల కంటే 140-160 స్కోర్లను అలవోకగా సాధించగలవు.
దుబాయ్ : సరసమైన సమరం
యుఏఈ పిచ్‌ల్లో పెద్దగా మార్పు చెందని పిచ్ దుబారు. దుబారు స్టేడియంలోని కొన్ని పిచ్‌లు నెమ్మదించగా.. మరికొన్ని పిచ్‌లు పేసర్లకు అనుకూలిస్తున్నాయి. గత రెండు ఐపీఎల్ సీజన్లలో దుబారు స్టేడియంలో సగటు స్కోరు 15-160గా నమోదవుతుంది. దుబారు పిచ్‌లపై ప్రత్యేకించి పేసర్లకు కాస్త అధిక అనుకూలత కనిపిస్తోంది. పేసర్లు ఓ వికెట్‌కు 27 పరుగులు సగటున సమర్పించుకోగా.. స్నిన్నర్లు ప్రతి వికెట్‌కు సగటున 32 పరుగులు సమర్పించుకున్నారు. దుబారు పిచ్‌పై ఏ జట్టు అయినా ముగ్గురు పేసర్లతో ఆడాలని అనుకుంటుంది. అవసరమైతే జెట్ స్పీడ్‌తో బంతులు సంధించగల పేసర్‌ను తీసుకునేందుకు ఇక్కడ ఆడే జట్లు సిద్ధమవుతాయి.
దుబారు పిచ్‌పై ఫలితాన్ని, ప్రణాళికలను శాసించే ప్రధానాంశం పిచ్ ఉండే స్థానం. దుబారు పిచ్ ఉండే స్థానంతో ఓవైపు బౌండరీ లైన్ దగ్గరగా ఉంటుంది. దీంతో క్రీజులో కుడి-ఎడమ బ్యాటర్ల కాంబినేషన్ ఉండేందుకు జట్లు ప్లాన్ చేసుకుంటాయి. ఈ కారణంగానే పేసర్‌ను, స్పిన్నర్‌ను ఏ ఎండ్ నుంచి ప్రయోగించాలనే నిర్ణయం కీలకం అవుతుంది. దుబారు వేదికగా టీమ్ ఇండియా నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఐపీఎల్లో భారత క్రికెటర్లు ఇక్కడ ఆడిన అనుభవం వరల్డ్‌కప్‌లో అక్కరకు రానుంది. పిచ్ స్వభావం, పరిస్థితులు ఆధారంగా బ్యాటింగ్, బౌలింగ్ కాంబనేషన్లు భారత్‌కు పుష్కలంగా ఉన్నాయి.
అబుదాబి : ధనాధన్ వేదిక
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్లు నమోదయ్యే వేదిక అబుదాబి. అబుదాబి పిచ్ పరిస్థితులు సహజంగానే బ్యాటింగ్‌కు ఎంతగానో అనుకూలం. షార్జా, దుబారులతో పోల్చితే అబుదాబి పిచ్ బౌండరీలు పెద్దవి. దీంతో ఇక్కడ బౌలర్లకు సైతం సరససమైన అవకాశాలే ఉంటాయి. అయితే స్పిన్నర్లకు ఇక్కడ పెద్దగా అవకాశం ఉండదు. వేదికపై మాయగాళ్లు ఓ వికెట్‌కు సగటున 33 పరుగులు ఇచ్చుకోగా.. పేసర్లు 29 పరుగులతో సరిపెట్టుకున్నారు.
అబుదాబిలో మంచు ప్రభావం సైతం కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ జరిగే మధ్యాహ్నాం మ్యాచులతో పోల్చితే సాయంత్రం మ్యాచులు భిన్నంగా ఉండనున్నాయి. భారీ స్కోర్లు ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు గొప్పగా ఉపకరించిన సందర్భాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు ఇక్కడ రెండేసి మ్యాచులు ఆడాల్సి ఉంది. అఫ్గనిస్థాన్ ఈ స్టేడియంలో మూడు మ్యాచులు ఆడనుంది. ఇక్కడ ఆడటంతో ఏ జట్టుకు ప్రత్యేకించి ఎటువంటి ప్రయోజనం ఉంటుందని చెప్పలేము.
గణాంకాలు కీలకమే! :
టీ20 ప్రపంచకప్‌లో గణాంకాలు సైతం కీలకం కానున్నాయి. అక్టోబర్-నవంబర్ సమయంలో యుఏఈ వాతావరణం కాస్త చల్లబడుతుంది. ఐపీఎల్ గణాంకాలు సెప్టెంబర్-నవంబర్ సమయంలో నమోదైనవి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 77 శాతం మ్యాచుల్లో విజయాలు సాధించగా.. కాస్త చల్లని వాతావరణంలో ఛేదినలో జట్ల విజయ శాతం 77కు చేరుకుంది. అబుదాబి, షార్జా వేదికల్లో 18 మ్యాచుల్లో 15 సార్లు ఛేదించిన జట్టునే విజయం వరించింది. ఐపీఎల్ 2020లో ప్రథమార్థంలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 21 (30 మ్యాచుల్లో) సార్లు విజయం సాధించాయి. ద్వితీయార్థంలో ఛేదనలో 22 (30 మ్యాచులు)సార్లు విజయం దక్కింది.