Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ, ఈసీబీ పరస్పర అంగీకారం
లండన్: టెస్టు క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన, అభిమానులకు మరపురాని క్రికెట్ విన్యాసాలను అందించిన పటౌడీ టెస్టు సిరీస్ ట్రోఫీ నిర్ణయాత్మక టెస్టు పోరుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లు ఓ అంగీకారానికి వచ్చాయి. టీమ్ ఇండియా సహాయక సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ రావటంతో మాంచెస్టర్‌లో జరగాల్సిన భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు వాయిదా పడింది. కరోనా కలవరంతో కోహ్లిసేన మైదానంలోకి దిగేందుకు నిరాకరించింది. దీంతో పటౌడీ ట్రోఫీకి అర్థమే లేకుండా అర్థాంతరంగా ముగిసింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై ఈ టెస్టును ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాయి. వచ్చే ఏడాది టీమ్ ఇండియా వైట్‌బాల్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. టీ20, వన్డే సిరీస్‌కు ముందు నిర్ణయాత్మక ఐదో టెస్టు ఆడేందుకు ఇరు బోర్డులు అంగీకారం తెలిపాయి. మాంచెస్టర్ ఈ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఎడ్జ్‌బాస్టన్‌కు ఈ మ్యాచ్‌ను కేటాయించారు. టెస్టు మ్యాచ్ చేరికతో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన ఆరు రోజులు ముందుకు జరుగనుంది. జులై 1-5 వరకు ఎడ్జ్‌బాస్టన్‌లో ఐదో టెస్టు జరుగనుండగా, జులై 7 నుంచి టీ20 సిరీస్, జులై 12 నుంచి వన్డే సిరీస్‌లు ఆరంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను ఈసీబీ విడుదల చేసింది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. నిర్ణయాత్మక టెస్టులో భారత్ నెగ్గినా, డ్రా చేసుకున్నా సిరీస్ కోహ్లిసేన పరం కానుంది. చివరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం సాధించినా.. పటౌడీ ట్రోఫీ గత విజేతగా భారత్ దక్కించుకోనుంది. 'అత్యద్భుతంగా సాగిన టెస్టు సిరీస్‌లో చివరి టెస్టు నిర్వహణపై బీసీసీఐతో ఓ అంగీకారానికి రావటం సంతోషకరం. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఈ టెస్టు మ్యాచ్ అప్పుడు సాధ్యపడనందున, మరోసారి అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను. ఈ మ్యాచ్ నిర్వహణకు సహకరించిన దక్షిణాఫ్రికా క్రికెట్‌కు కృతజ్ఞతలు' అని ఈసీబీ సీఈఓ టామ్ హారిసన్ ఓ ప్రకటనలో తెలిపాడు.