Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్
- సూపర్12 దశ పోరుకు రంగం సిద్ధం
ఎమిరేట్స్ ఎడారిలో టీ20 తుఫాన్‌కు సమయం ఆసన్నమైంది. పొట్టి ప్రపంచకప్‌లో అర్హత రౌండ్ మ్యాచులతో ఇప్పటికే ధనాధన్ వాతావరణం నెలకొనగా.. నేటి నుంచి టీ20 ప్రపంచకప్ అసలు సమరం షురూ కానుంది. శనవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్ వేటకు తెర లేవనుంది. సుమారు నాలుగున్నర సంవత్సరాల అనంతరం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు టీమ్ ఇండియా టైటిల్ ఫేవవరేట్గా బరిలోకి దిగుతోంది.
నవతెలంగాణ-దుబాయ్
ఐపీఎల్ జోరుతో టీ20 ప్రపంచకప్ లేని లోటు పెద్దగా కనిపించలేదు!. 2016లో చివరగా భారత్ వేదికగా చోటు చేసుకున్న టీ20 ప్రపంచకప్ సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ భారత్ ఆతిథ్యంలోనే జోరందుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ టైటిల్ నిలుపుకునేందుకు తొలి రోజే బరిలోకి దిగుతోంది. అక్టోబర్ 23న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసు..నవంబర్ 14న మెగా ఫైనల్‌తో ముగియనుంది. భారత్‌లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కోవిడ్-19, వర్షాకాల సీజన్ కారణంగా యుఏఈలో నిర్వహిస్తున్నారు.
కొత్త చాంపియన్‌ను చూస్తామా? : ప్రపంచకప్ ఎప్పుడు జరిగినా కొత్త చాంపియన్‌ను చూస్తామా? అనే చర్చ సర్వ సాధారణం. 14 ఏండ్ల కింద పురుడు పోసుకున్న టీ20 ప్రపంచకప్ ఇప్పుడు ఏడోసారి అభిమానుల ముందుకు రాబోతుంది. 2007లో తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ అవతరించగా.. పాకిస్థాన్ (2009), ఇంగ్లాండ్ (2010), వెస్టిండీస్ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్ (2016) పొట్టి వరల్డ్‌కప్ చాంపియన్లుగా నిలిచాయి. వన్డే వరల్డ్‌కప్‌లలో జైత్రయాత్ర చూపించిన ఆస్ట్రేలియా ఇప్పటివరకు టీ20 కప్పును అందుకోలేదు. దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్‌ను సైతం ముద్దాడలేదు. ఈ ఏడాది 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్.. ఈ ఏడాది మరో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికా సైతం తొలిసారి టీ20 ప్రపంచకప్ ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అర్హత రౌండ్ నుంచి సూపర్12కు చేరుకున్న బంగ్లాదేశ్ సైతం తొలిసారి మెగా టైటిల్ అందుకోవాలని ఆశపడుతోంది.
భారత్‌కు ఎదురుందా? : సూపర్12 దశలో 12 జట్లు రెండు గ్రూపులుగా పోటీపడనున్నాయి. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లకు తోడు అర్హత రౌండ్ నుంచి చేరుకున్న బంగ్లాదేశ్ సహా మరో జట్టు ఉన్నాయి. గ్రూప్-2లో ఆతిథ్య జట్టు భారత్, అఫ్గనిస్థాన్, న్యూజిలాండ్, పాకిస్థాన్ సహా అర్హత రౌండ్ నుంచి వచ్చిన స్కాట్లాండ్ సహా మరో జట్టు ఉండనున్నాయి. పొట్టి ఫార్మాట్లో పాకిస్థాన్ ఇటీవల గొప్ప ప్రదర్శన చేస్తోంది. 20 ఓవర్ల ఆటలో న్యూజిలాండ్ జట్టుది భారత్‌పై స్పష్టమైన పైచేయి సాధించింది. 2016 టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లోనూ కేన్ విలియమ్సన్ బృందం టీమ్ ఇండియాకు ఝలక్ ఇచ్చింది. దీంతో గ్రూప్ దశ మ్యాచులు కోహ్లిసేనకు ఎంత మాత్రం సులభం కాబోవు. గ్రూప్ దశలో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్లోకి చేరనున్నాయి. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లతో పోటీ తీవ్రంగా ఉండనుంది. 2007 ఆరంభ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత్.. మళ్లీ ఆ కప్పును అందుకోలేదు. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరుకున్నా శ్రీలంకకు పొట్టి కప్పును కోల్పోయింది. 2016 టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య జట్టుగా ఫేవరేట్‌గా బరిలో నిలిచినా.. సెమీఫైనల్లో చాంపియన్ వెస్టిండీస్ చేతిలో పరాజయం చవిచూసింది.
తొలి రోజే మాజీ చాంపియన్లు : 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 దశ తొలి రోజే మాజీ చాంపియన్లు బరిలో నిలిచాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు ఢకొీట్టనున్నాయి. భారీ స్కోర్ల వేదిక అబుదాబిలో తొలి టైటిల్ వేటలో ఆసీస్, సఫారీలు తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. దుబారులో మాజీ చాంపియన్లు ఇంగ్లాండ్, వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేడు రెండు మ్యాచుల్లో గ్రూప్-1 జట్ల మధ్యే జరుగనున్నాయి. టీ20 ప్రపంచకప్ అర్హత మ్యాచులకు ఒమన్ ఆతిథ్యం ఇవ్వగా.. సూపర్12 మ్యాచులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబారు, అబుదాబి, షార్జా నగరాలు వేదికగా నిలువనున్నాయి. కరోనా మహమ్మారి అనంతరం అధిక సంఖ్యలో అభిమానుల హాజరు కానున్న క్రికెట్ ఈవెంట్‌గా టీ20 ప్రపంచకప్ నిలువనుంది. స్టేడియంలో 80 శాతం సామర్థ్యం మేరకు అభిమానులకు ప్రవేశం కల్పించనున్నారు.