Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, పాక్ ఢీ నేడే
- ఫేవరేట్‌గా కోహ్లిసేన
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ముందే అంతకుమించిన మహా పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచకప్ సమరంలో పొరుగు దేశం పాకిస్థాన్‌పై ఎదురులేని రికార్డులు కలిగివున్న టీమ్ ఇండియా నేడు సూపర్12 గ్రూప్-2 తొలి మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మైదానం లోపల, వెలుపల టీమ్ ఇండియా గొప్పగా ఉండగా.. పాకిస్థాన్ క్రికెట్ దాదాపు సంక్షోభ కోరల్లో ఉంది!. ప్రపంచ క్రికెట్లో తమ ప్రతాపం చూపించేందుకు పాక్ భావోద్వేగంతో యుఏఈకి చేరుకుంది. ధోనీ అండతో పొట్టి కప్పు వేటను ఘనంగా మొదలెట్టేందుకు కోహ్లిసేన అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంది. భారత్, పాకిస్థాన్ మహా పోరు నేడే.
నవతెలంగాణ-దుబాయ్
ధోనీ అండతో కోహ్లిసేన :
కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇదే చివరి టీ20 వరల్డ్‌కప్. పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై (2007-2016) భారత్ సాధించిన అన్ని విజయాలు ధోనీ సారథ్యంలోనే. కోహ్లికి టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఇదే తొలి పోరు. పాకిస్థాన్‌పై గత మ్యాచుల్లో కోహ్లికి తిరుగులేని రికార్డుంది. 78, 36, 55 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లిపై పాక్ శివతాండవం చేశాడు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లలో ఒకరు తుది జట్టులో నిలువనున్నారు. బౌలింగ్ చేయకపోయినా నం.6 స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా హార్దిక్ పాండ్య జట్టులో ఉండనున్నాడు. శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమిలతో కలిసి బుమ్రా పేస్ దళానికి నాయకత్వం వహించనున్నాడు. అశ్విన్, జడేజాలు పాక్‌ను మాయలో పడేందుకు సిద్ధమవుతున్నారు. పాకిస్థాన్ శిబిరంలో మెరుగైన బ్యాటర్లు, బౌలర్లకు టీమ్ ఇండియా ఇప్పటికే కౌంటర్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
భావోద్వేగ పాకిస్థాన్ :
అంతర్గత, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ క్రికెట్ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై విజయంతో మానసిక స్వాంతన పొందాలని చూస్తోంది. ప్రపంచకప్ కంటే భారత్‌పై విజయానికే ఆ జట్టు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. టీ20ల్లో మెరుగైన రికార్డున్న పాకిస్థాన్ బాబర్ ఆజామ్ సారథ్యంలో సరికొత్తగా కనిపిస్తోంది. భారత్‌పై విరుచుకుపడే ఫకర్ జమాన్, షోయబ్ మాలిక్‌లు నేడు తుది జట్టులో నిలువనున్నారు. మహ్మద్ హఫీజ్, మహ్మద్ రిజ్వాన్‌లు సైతం మంచి ఫామ్‌లో ఉన్నారు. షాహీన్ అఫ్రిదీ, హసన్ అలీ, షాదాబ్ ఖాన్లు భారత బ్యాటింగ్ లైనప్‌కు సవాల్ విసరనున్నారు. యుఏఈలో గత పదేండ్లుగా ఆడుతున్న పాక్‌కు పరిస్థితులపై మెరుగైన అవగాహన ఉండటం అదనపు అనుకూలత. టీ20 ప్రపంచకప్‌లో చివరి ఐదు మ్యాచులను టీమ్ ఇండియాకు కోల్పోయిన పాకిస్థాన్.. టీ20 ఫార్మాట్లో చివరి ఐదు మ్యాచుల్లో ఏకంగా నాలుగింట పరాజయాలు చవిచూసింది. చరిత్ర, గణాంకాలు పాక్‌కు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. విజయ కాంక్ష పాక్‌ను నేడు భావోద్వేగ బాటలో నడిపిస్తోంది.
పిచ్ రిపోర్టు : ఐపీఎల్ కోసం భారత్ గత నెల రోజులుగానే ఇక్కడే ఉంటోంది. గద పదేండ్లుగా పాక్ క్రికెట్‌కు యుఏఈ సొంతగడ్డ. పరిస్థితులపై ఇరు జట్లకు చక్కటి అవగాహన ఉంది. దుబారు పిచ్‌పై సగటు స్కోరు 156. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకు ఓటేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పిచ్‌పై జెట్ స్పీడ్‌తో బంతులేసే పేసర్లకు అనుకూలత ఉంటుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్/శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, జశ్‌ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ : బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్/హైదర్ అలీ, అసిఫ్ అలీ, ఇమద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రౌఫ్, షాహీన్ అఫ్రిది.