Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వల్ప ఛేదనలో సఫారీపై గెలుపు
- దక్షిణాఫ్రికా 118/9, ఆస్ట్రేలియా 121/5
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. భారీ స్కోర్ల వేదిక అబుదాబిలో స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో దక్షిణాఫ్రికాపై కంగారూలు పైచేయి సాధించారు. స్టీవ్ స్మిత్ (35), స్టోయినిస్ (24 నాటౌట్) రాణించటంతో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా తొలి విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టినా సఫారీలకు పరాజయం తప్పలేదు.
నవతెలంగాణ-అబుదాబి
స్టీవ్ స్మిత్ (35, 34 బంతుల్లో 3 ఫోర్లు), మార్కస్ స్టోయినిస్ (24 నాటౌట్, 16 బంతుల్లో 3 ఫోర్లు) రాణించటంతో స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 119 పరుగుల ఛేదనలో 81/5తో ఆస్ట్రేలియా ఒత్తిడిలో పడినా.. ఆరో వికెట్‌కు మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (15 నాటౌట్)లు 26 బంతుల్లోనే 40 పరుగులు జోడించారు. బౌలర్ల మెరుపులతో గెలుపుపై ఆశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చారు. ఎడెన్ మార్కరం (40, 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డెవిడ్ మిల్లర్ (16, 18 బంతుల్లో), కగిసో రబాడ (19 నాటౌట్, 23 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 118 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా పేసర్ జోశ్ హజిల్‌వుడ్ (2/19) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
స్టోయినిస్ ముగించాడు : ధోని మాదిరిగా ఉత్తమ ఫినీషర్‌గా నిలువాలని తపిస్తోన్న మార్కస్ స్టోయినిస్ ఆ దిశగా టీ20 ప్రపంచకప్ సూపర్12 దశ ఆరంభ మ్యాచ్‌లో అడుగు ముందుకేశాడు. 119 పరుగుల ఛేదనలో సఫారీ బౌలర్లు నిప్పులు చెరగటంతో పవర్‌ప్లేలో ఆసీస్ బ్యాటింగ్ పవర్ పోయింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (0), డెవిడ్ వార్నర్ (14), మిచెల్ మార్ష్ (11) స్వల్ప స్కోర్లకు అవుటయ్యారు. ఈ దశలో స్టీవ్ స్మిత్ (35), గ్లెన్ మాక్స్వెల్ (18, 21 బంతుల్లో 1 ఫోర్) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను నిలబెట్టారు. ఈ ఇద్దరిని వెనక్కి పంపిన సఫారీలు 81/5తో రేసులోకి వచ్చారు. ఈ దశలో మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్‌లు అద్భుత భాగస్వామ్యంతో ఆసీస్‌ను గెలుపు తీరాలకు చేర్చారు. 26 బంతుల్లోనే 40 పరుగులు జోడించిన ఈ జోడీ మ్యాచ్‌ను లాగేసుకుంది. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా స్టోయినిస్ రెండు బౌండరీలతో లాంఛనం ముగించాడు.
ఆదుకున్న మార్కరం : ఎడెన్ మార్కరం (40) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాపై గౌరవప్రద స్కోరు సాధించింది. టాస్ నెగ్గిన ఆసీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ పేసర్లు హజిల్‌వుడ్, స్టార్క్, జంపాలు నిప్పులు చెరగటంతో సఫారీ బ్యాటర్లు చేతులెత్తేశారు. తెంబ బవుమా (12), క్వింటన్ డికాక్ (7), డుసెన్ (2), ప్రిటోరియస్ (1), కేశవ్ మహరాజ్ (0), హెన్రిచ్ క్లాసెన్ (13) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. ఈ పరిస్థితుల్లో మార్కరం ఒక్కడే క్రీజులో నిలిచాడు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో స్కోరు బోర్డులో చలనం తీసుకొచ్చాడు. చివర్లో కగిసో రబాడ (19 నాటౌట్) మెరువటంతో సఫారీ పోరాడగలిగే స్కోరు సాధించింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : బవుమా (బి) మాక్స్వెల్ 12, డికాక్ (బి) హజిల్‌వుడ్ 7, డుసెన్ (సి) వేడ్ (బి) హజిల్‌వుడ్ 2, మార్కరం (సి) మాక్స్వెల్ (బి) స్టార్క్ 40, క్లాసెన్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 13, మిల్లర్ (ఎల్బీ) జంపా 16, ప్రిటోరియస్ (సి) వేడ్ (బి) జంపా 1, మహరాజ్ రనౌట్ 0, రబాడ నాటౌట్ 19, నోక్యా (సి) ఫించ్ (బి) స్టార్క్ 2, షంషి నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 06,
మొత్తం :(20 ఓవర్లలో 9 వికెట్లకు) 118.
వికెట్ల పతనం : 1-13, 2-16, 3-23, 4-46, 5-80, 6-82, 7-83, 8-98, 9-115.
బౌలింగ్ : స్టార్క్ 4-0-32-2, మాక్స్వెల్ 4-0-24-1, హజిల్‌వుడ్ 4-1-19-2, కమిన్స్ 4-0-17-1, జంపా 4-0-21-2.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : వార్నర్ (సి) క్లాసెన్ (బి) రబాడ 14, ఫించ్ (సి) రబాడ (బి) నోక్యా 0, మార్ష్ (సి) డుసెన్ (బి) మహరాజ్ 11, స్మిత్ (సి) మార్కరం (బి) నోక్యా 35, మాక్స్వెల్ (బి) షంషి 18, స్టోయినిస్ నాటౌట్ 24, వేడ్ నాటౌట్ 15, ఎక్స్‌ట్రాలు : 04, మొత్తం :(19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 121.
వికెట్ల పతనం : 1-4, 2-20, 3-38, 4-80, 5-81.
బౌలింగ్ : రబాడ 4-0-28-1, నోక్యా 4-0-21-2, మహరాజ్ 4-0-23-1, షంషి 4-0-22-1, ప్రిటోరియస్ 3.4-0-26-0.