Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాపై శ్రీలంక ఘన విజయం
నవతెలంగాణ-షార్జా
టీ20 ప్రపంచకప్ వేటను మాజీ చాంపియన్ శ్రీలంక ఘనంగా మొదలు పెట్టింది. స్వల్ప స్కోర్ల షార్జాలో భారీ స్కోర్లు నమోదవగా 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే శ్రీలంక ఛేదించింది. చరిత్ అసలంక (80 నాటౌట్, 49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో శ్రీలంకకు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని కట్టబెట్టాడు. మహ్మద్ నయీం (62, 52 బంతుల్లో 6 ఫోర్లు), ముష్ఫీకర్ రహీం (57, 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించటంతో తొలుత బంగ్లాదేశ్ 171/4 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఛేదనలో చెలరేగిన చరిత్ అసలంక 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అర్హత రౌండ్ నుంచి సూపర్-12 దశకు చేరుకున్న శ్రీలంక, బంగ్లాదేశ్‌లు గ్రూప్-1 తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి.
చెలరేగిన చరిత్ : ఐపీఎల్లో అత్యల్ప స్కోర్లు నమోదైన షార్జాలో 172 పరుగుల లక్ష్యం భారీగా కనిపించింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (1)ను ఆరంభంలోనే అవుట్ చేసిన బంగ్లా ఛేదనలో శ్రీలంకపై ఒత్తిడి పెంచింది. చరిత్ అసలంక (80), మరో ఓపెనర్ నిశాంక (24, 21 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యంతో గెలుపు దిశగా గట్టి పునాది వేశారు. నిశాంక, ఫెర్నాండో (0), హసరంగ డిసిల్వ (6) వికెట్లతో బంగ్లా మరోసారి రేసులోకి వచ్చింది. భానుక రాజపక్స (53, 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో బంగ్లా బౌలర్లపై శివమెత్తాడు. రాజపక్స, చరిత్ అర్థ సెంచరీలతో శ్రీలంక 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా బౌలర్లలో అహ్మద్, షకిబ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
మెరిసిన ముష్ఫీకర్ : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు సాధించింది. టాప్ ఆర్డర్లో మహ్మద్ నయీం (62), మిడిల్ ఆర్డర్లో ముష్ఫీకర్ రహీం (57) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో బంగ్లాదేశ్ ఆరంభం నుంచి భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. లిటన్ దాస్ (16), షకిబ్ అల్ హసన్ (10), అఫిఫ్ (7) ఆకట్టుకోవటంలో విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నె, ఫెర్నాండో, కుమారలకు తలా ఓ వికెట్ దక్కింది.
స్కోరు వివరాలు :
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : 171/4 (మహ్మద్ నయీం 62, ముష్ఫీకర్ రహీం 57, కరుణరత్నె 1/12)
శ్రీలంక ఇన్నింగ్స్ : 172/5 (చరిత్ అసలంక 80 నాటౌట్, రాజపక్స 53, షకిబ్ 2/17)